Share News

LRS Scheme: వేగంగా ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రొసీడింగ్స్‌ జాప్యం చేయవద్దు.. రెండు వారాల్లో పూర్తి చేయాలి: డీటీసీపీ దేవేందర్‌రెడ్డి

ABN , Publish Date - Apr 04 , 2025 | 04:23 AM

రాష్ట్రంలో లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద వచ్చిన దరఖాస్తుల పరిశీలన వేగంగా చేపట్టి, అభ్యంతరాలు లేనివాటికి త్వరగా ప్రొసీడింగ్స్‌ జారీ చేయాలని డీటీసీపీ దేవేందర్‌రెడ్డి క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు.

LRS Scheme: వేగంగా ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రొసీడింగ్స్‌ జాప్యం చేయవద్దు.. రెండు వారాల్లో పూర్తి చేయాలి: డీటీసీపీ దేవేందర్‌రెడ్డి

  • ఇప్పటికే ఫీజు చెల్లించిన సుమారు 4 లక్షల దరఖాస్తులకు మోక్షం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద వచ్చిన దరఖాస్తుల పరిశీలన వేగంగా చేపట్టి, అభ్యంతరాలు లేనివాటికి త్వరగా ప్రొసీడింగ్స్‌ జారీ చేయాలని డీటీసీపీ దేవేందర్‌రెడ్డి క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు 4,80,000 మంది ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లించగా.. ఇప్పటివరకు సుమారు 70 వేల మందికి మాత్రమే ప్రొసీడింగ్స్‌ ఇచ్చారని.. ఇంకా నాలుగు లక్షల మందికిపైగా వేచి ఉన్నారని వివరించారు. ఇలాంటి వారికి ఏప్రిల్‌ నెల మొదటి, రెండు వారాల్లో ప్రొసీడింగ్స్‌ క్లియర్‌ చేయాలని డీటీసీపీ సూచించారు.


రాయితీ గడువు పొడిగించడంతో..

ప్రభుత్వం తొలుత నిర్ణయించిన మేరకు మార్చి నెలాఖరులో రాయితీ గడువు ముగుస్తుందన్న ఉద్దేశంతో.. గత నెల చివరి రెండు వారాల్లో సుమారు 4 లక్షల మంది దరఖాస్తుదారులు ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులు చెల్లించారు. వీరికి సంబంధించి ప్రొసీడింగ్‌ పత్రాలు ఇవ్వాల్సి ఉంది. ఫీజు చెల్లించిన పది రోజుల వ్యవధిలో ప్రొసీడింగ్‌ ఇవ్వాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొన్నా.. చాలా మందికి ఆ గడువు తరువాత కూడా ప్రొసీడింగ్స్‌ అందలేదు. దీనితో వారు ఆందోళనలో పడ్డారు. ఫీజు చెల్లించిన దరఖాస్త్తులకు సంబంధించి ఏదైనా కారణంతో ప్రొసీడింగ్‌ ఇవ్వలేకపోతే.. ఫీజులో 10 శాతం మినహాయించుకుని మిగతా 90 శాతం ఫీజును తిరిగి దరఖాస్తుదారుల ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది.


ఫీజుపైనే సిబ్బంది దృష్టి!

గత రెండు వారాల్లో సిబ్బంది మొత్తం ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులు జమ చేసుకోవడంపైనే దృష్టి సారించారు. దరఖాస్తుల పరిశీలనలో జాప్యం నెలకొంది. ప్రభుత్వం మొత్తంగా సుమారు 20 లక్షల దరఖాస్తుదారులకు ఫీజు చెల్లించాలని లేఖలు పంపింది. సిబ్బంది కూడా దరఖాస్తుదారులకు ఫోన్లు చేసి గుర్తు చేయడం, ఇతర పనుల్లో నిమగ్నం కావడంతో.. క్షేత్రస్థాయి పరిశీలనలో జాప్యం జరిగి ప్రొసీడింగ్స్‌ ఇవ్వలేకపోయారని అధికారులు చెబుతున్నారు. అన్ని పత్రాలు సరిగా ఉంటే ప్రొసీడింగ్‌ కచ్చితంగా వస్తుందని వివరిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏప్రిల్‌ నెలాఖరు వరకు రాయితీ గడువు పొడిగించింది. దీనితో ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లింపులు కొంత నెమ్మదించే అవకాశం ఏర్పడింది. ఈ సమయంలో ప్రొసీడింగ్స్‌ను వేగవంతం చేయాలని డీటీసీపీ ఆదేశించారు.


బిల్డ్‌నౌపై కమిషనర్లకు అవగాహన

భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువస్తున్న బిల్డ్‌నౌ అప్లికేషన్‌పై మున్సిపల్‌ కమిషనర్లకు గురువారం అవగాహన కల్పించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నిర్వహించిన సమావేశంలో పురపాలక శాఖ సంచాలకురాలు టి.కె.శ్రీదేవి మాట్లాడారు. 2024-25లో ఆస్తి పన్ను వసూళ్లలో చూపిన ప్రగతి, 2025-26లో అవలంబించాల్సిన ప్రణాళికలను వివరించారు. 75 నుంచి 85 శాతం పన్ను వసూలు చేసిన 39 మంది మున్సిపల్‌ కమిషనర్లను అభినందించారు. 85 శాతం కంటే ఎక్కువ పన్ను వసూలు చేసిన 31 మంది మున్సిపల్‌ కమిషనర్లను, గత రెండేళ్లుగా మెరుగైన పనితీరు కనబర్చిన కమిషనర్లను సత్కరించారు. ఇక ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం అమలు, సందేహాలపై, బిల్డ్‌నౌ అప్లికేషన్‌పై డీటీసీపీ దేవేందర్‌రెడ్డి అవగాహన కల్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు..

వక్ఫ్‌ బిల్లుకు లోక్‌సభ ఓకే

For More AP News and Telugu News

Updated Date - Apr 04 , 2025 | 04:23 AM