Banakacharla Project Debate: నేడు బనకచర్ల పై చర్చ
ABN , Publish Date - Apr 07 , 2025 | 04:07 AM
బనకచర్ల ప్రాజెక్టు పై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టులో కృష్ణా వరద జలాలు బొల్లాపల్లి రిజర్వాయర్‌కు తరలించే ప్రతిపాదనపై చర్చ జరుగనుంది

బనకచర్లకు తెలంగాణ తీవ్ర వ్యతిరేకం.. కృష్ణా, గోదావరి బోర్డులకు ఫిర్యాదు
గోదావరి బోర్డు కోరినా బొల్లాపల్లి వివరాలివ్వని ఏపీ
ప్రాజెక్టుల అప్పగింతపైనా ఏపీ మెలిక
హైదరాబాద్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు విషయమై తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలపై సోమవారం గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశంలో కీలక చర్చ జరుగనున్నది. ప్రత్యేకించి బొల్లాపల్లి రిజర్వాయర్‌కు కృష్ణా వరద జలాల తరలింపుపై చర్చ జరిగే అవకాశం ఉంది. జీఆర్‌ఎంబీ చైర్మన్ ఏకే ప్రధాన్ అధ్యక్షతన హైదరాబాద్‌లోని జలసౌధలో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్‌సీ(జనరల్) జి.అనిల్‌కుమార్, ఏపీ నుంచి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వర రావు తమ రాష్ట్రాల వాదనలు వినిపించనున్నారు. గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాల తరలింపుతోపాటు నాగార్జున సాగర్ నుంచి కృష్ణా వరద జలాలను గుంటూరు జిల్లాలో నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్‌కు మళ్లిస్తామని ఏపీ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తంచేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రాజెక్టుల అప్పగింతపైనా చర్చ
గోదావరి నది పరిధిలోని మొత్తం 16 ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను జీఆర్‌ఎంబీకి అప్పగించాలని 2021 జూలై 15న కేంద్రం జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్‌మీద బోర్డు సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. గోదావరిపై ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు మాత్రమే రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అని, అది మినహా ఇతర ప్రాజెక్టులను అప్పగించే ప్రసక్తే లేదని తెలంగాణ తేల్చేసింది. తెలంగాణ ప్రాజెక్టులు అప్పగిస్తేనే తామూ అప్పగిస్తామని ఏపీ మెలిక పెట్టింది. 2021లో కేంద్రం విడుదల చేసిన గెజిట్ ప్రకారం తెలంగాణలో 11, ఏపీలో నాలుగు కలిపి గోదావరి బేసిన్‌లో మొత్తం 16 అనుమతి లేని ప్రాజెక్టులకు ఆయా రాష్ట్రప్రభుత్వాలు అనుమతి పొందాల్సి ఉంది. తెలంగాణలోని 11 ప్రాజెక్టుల్లో తొమ్మిది ప్రాజెక్టుల ఎనిమిది డీపీఆర్‌లను అనుమతి కోసం కేంద్రానికి సమర్పిస్తే ఆరింటికి టీఏసీ అనుమతులు లభించాయి. ఏపీ సర్కార్ మాత్రం తమ ప్రాజెక్టుల డీపీఆర్‌లను అనుమతుల కోసం కేంద్రానికి సమర్పించనే లేదు.
బొల్లాపల్లి పై ఇవీ ఏపీ ప్రతిపాదనలు
రూ.80 వేల కోట్ల ప్రాథమిక అంచనాలతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు ద్వారా రోజూ రెండు టీఎంసీల చొప్పున 90 రోజుల్లో 180 టీఎంసీల మిగులు జలాలను తరలిస్తామని ఏపీ చెబుతోంది. అందుకు నాగార్జున సాగర్ కుడి కాల్వ సామర్ధ్యం పెంచడం ద్వారా కృష్ణా నది వరద జలాలను తరలిస్తామని ఏపీ ప్రతిపాదన. అదే జరిగితే నాగార్జునసాగర్ కింద తమ ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదం ఉందని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేసింది. దీనిపై గోదావరి, కృష్ణా బోర్డులతోపాటు కేంద్ర జలశక్తిశాఖకూ ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ప్రాజెక్ట్ డీపీఆర్, ఇతర వివరాలు సమర్పించాలని సమర్పించాలని జీఆర్‌ఎంబీ లేఖ రాసినా ఏపీ ఇంతవరకూ అందించలేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
HCU Land: హెచ్‌సీయూ వివాదంలో నిజాలు ప్రచారం చేయండి
No Exam: ఈ అర్హత చాలు.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. నెలకు రూ. 2 లక్షల జీతం
Water Conflict: నీటి పంచాయతీ.. అధికారులతో ఉత్తమ్ కీలక భేటీ
Healthy Soup: ఈ సూప్‌తో మీ శరీరంలో కొన్ని భాగాలకు ఊహించని శక్తి పక్కా
Cotton Clothing: కాటన్ దుస్తులు.. ఒరిజినలా? కాదా? ఎలా గుర్తించాలంటే..
Fake Cardiologist: ఏడుగురి ఉసురు తీసిన వైద్యుడు.. విచారణకు రంగం సిద్ధం
శ్రీలీలకి చేదు అనుభవం.. చెయ్యి పట్టుకుని లాగిన యువకులు
కేసు No.62.. సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ
For Telangana News And Telugu News