MBBS: ఎంబీబీ‘ఎస్’ ఎప్పుడు?
ABN , Publish Date - Apr 14 , 2025 | 05:01 AM
రాష్ట్రంలోని ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పరీక్ష రాసిన విద్యార్థులు తుది ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నెల రోజులు ఆలస్యమైంది.

ఫిబ్రవరిలో వైద్యవిద్య చివరి సంవత్సరం పరీక్షల పూర్తి.. ఫలితాల జాడే లేదు
ఉత్తీర్ణత సాధిస్తే ఏడాది ఇంటర్న్‌షిప్
అది పూర్తి చేస్తేనే నీట్ పీజీకి అర్హత
తీవ్ర ఆందోళనలో వైద్య విద్యార్థులు
హైదరాబాద్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పరీక్ష రాసిన విద్యార్థులు తుది ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నెల రోజులు ఆలస్యమైంది. ఇప్పటివరకు చివరి విద్యాసంవత్సరం జవాబు పత్రా ల ముల్యాంకనం పూర్తి కాలేదు. మరో 15-20ు ప త్రాలు మూల్యాంకనం చేయాల్సి ఉన్నట్లు విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఫలితాల కోసం వైద్య విద్యార్థులు మరికొన్ని రోజుల పాటు నిరీక్షించక తప్పని పరిస్థితి నెలకొంది. ఎంబీబీఎస్ తుది సంవత్సరం పరీక్షలు ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగాయి. మార్చి 3వ తేదీ వరకు ప్రాక్టికల్స్ జరిగాయి. వాటి ఫలితాలను అప్పుడే ప్రకటించారు. థియరీ పరీక్ష పత్రాల ముల్యాంకనం మాత్రం ఆలస్యమవుతోంది. మూల్యాంకనం చేసేందుకు సరిపడా అధ్యాపకులు వైద్య కళాశాలల్లో లేకపోవడంతోనే జాప్యం జరుగుతున్నట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు ఫైనలియర్‌కు చెందిన మొత్తం 66,046 స్ర్కిప్టులు మూల్యాంకనం చేయాల్సివుండగా ఈనెల 10 వరకు 58,126 స్ర్కిప్టులనే మూల్యాంకనం చేశారు. మరో 7,920 స్ర్కిప్టులు మిగిలి ఉన్నాయి. ఫైనలియర్ ఫలితాలు వెల్లడికాగానే ఉత్తీర్ణులైనవారు విధిగా ఏడాదిపాటు ఆస్పత్రుల్లో హౌస్‌సర్జన్లుగా పనిజేయాలి. అప్పుడే వారు నీట్ పీజీకి అర్హులవుతారు. వైద్య విద్య పూర్తయిన విద్యార్థులు సంబంధిత కళాశాల ఆస్పత్రుల్లో ఇంటర్నీ్‌సగా ఏడాది పాటు పనిచేయాలి. వాస్తవానికి ఇప్పటికే ఫైనలియర్ ఉత్తీర్ణులైన విద్యార్థులంతా ఇంటర్నీ్‌సగా చేరాలి. ఫలితాల వెల్లడిలో జరుగుతున్న ఆలస్యానికి ఆరోగ్య విశ్వవిద్యాలయం తీరే కారణం అని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత ఆలస్యమైతే తాము తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 15న నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ఉంది. నీట్ పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించే నాటికి ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. చివరి సంవత్సరం పరీక్ష రాసిన తాము హౌస్‌సర్జన్స్‌గా పన్నెండు నెలలు పూర్తిచేసేలోపే వచ్చే ఏడాది నీట్ పరీక్ష జరిగితే పరిస్థితి ఏమిటి? అని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్థోపెడిక్ పత్రాలు జనరల్ సర్జన్ అధ్యాపకులతో మూల్యాంకనం
ప్రతి కళాశాలలో ఆర్థోపెడిక్ విభాగం ఉంటుంది. ఆర్థో విభాగం పరీక్షకు సంబంధించి జవాబు పత్రాలను ఆ అధ్యాపకులతోనే మూల్యాంకనం చేయించాలి. అయితే ఈ ఏడాది విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు విచిత్రంగా జనరల్ సర్జరీ విభాగానికి చెందిన అధ్యాపకులతో ముల్యాంకనం చేయిస్తున్నారు. దీనిపై కూడా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థో అధ్యాపకులు ఉన్నప్పుడు జనరల్ సర్జన్ అధ్యాపకులతో ఎలా మూల్యాంకనం చేయిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.