Share News

Kamareddy: గాంధారిలో కారు భీభత్సం

ABN , Publish Date - Mar 21 , 2025 | 04:08 AM

మద్యం, గంజాయి మత్తులో ఉన్న ఓ యువకుడు కారుతో బీభత్సం సృష్టించాడు. విచక్షణ కోల్పోయి అతివేగంగా కారు నడిపి పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులపైకి దూసుకెళ్లాడు.

Kamareddy: గాంధారిలో కారు భీభత్సం

  • మద్యం, గంజాయి మత్తులో యువకుడి డ్రైవింగ్‌

  • పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లపైకి దూసుకొచ్చిన కారు.. ఒకరి మృతి

గాంధారి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): మద్యం, గంజాయి మత్తులో ఉన్న ఓ యువకుడు కారుతో బీభత్సం సృష్టించాడు. విచక్షణ కోల్పోయి అతివేగంగా కారు నడిపి పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులపైకి దూసుకెళ్లాడు. దీంతో రవి (38) అనే కానిస్టేబుల్‌ మృతిచెందగా.. మరో కానిస్టేబుల్‌ సుభాష్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారిలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గాంధారి ఠాణాలో పనిచేస్తున్న తాడ్వాయి మండలం దేమికలాన్‌కు చెందిన రవి, సుభాష్‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ బస్టాండ్‌ సమీపంలో టిఫిన్‌ సెంటర్‌ వద్ద తమ బైక్‌ను ఆపి నిల్చున్నారు. అదే సమయంలో కామారెడ్డి వైపు నుంచి ఓ కారు వారిపైకి దూసుకొచ్చింది. దాంతో రవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.


తోటి కానిస్టేబుళ్లు అక్కడకు చేరుకుని కారులో ఉన్న గాంధారికి చెందిన యువకుడు సందీ్‌పను అదుపులోకి తీసుకున్నారు. అతను గాంధారి శివారులోని ఓ రైస్‌ మిల్లులో తన స్నేహితులతో కలిసి బుధవారం రాత్రంతా మద్యం, గంజాయి తాగి తెల్లవారుజామున ఇంటికి వెళ్లే క్రమంలో కారును అతి వేగంగా నడిపినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సందీప్‌ కొద్ది నెలల క్రితం ద్విచక్ర వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడంతో జరిగిన ప్రమాదంలో వెనక కూర్చున్న అతని స్నేహితుడు మరణించాడు.

Updated Date - Mar 21 , 2025 | 04:08 AM

News Hub