Fake Photos: మాయమవుతున్న ఫేక్ వీడియోలు
ABN , Publish Date - Apr 09 , 2025 | 04:44 AM
కంచ గచ్చిబౌలి భూముల్లో ప్రాణభయంతో జింకలు పరుగులు పెడుతున్నట్లు, నెమళ్లు ఏడుస్తున్నట్లు ఫొటోలు, వీడియోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసిన వేలాది మంది.. ప్రస్తుతం వాటిని డిలీట్ చేస్తున్నారు.

సోషల్ మీడియా నుంచి తొలగిస్తున్న వేలాది మంది కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో..
అలజడి సృష్టించిన నకిలీ వీడియోలు, ఫొటోలు
పలువురు బీఆర్‌ఎస్ నేతలపై ఫిర్యాదులు
ఫేక్ వీడియోలను సృష్టించి, ప్రచారం చేసిన వారిని గుర్తించే పనిలో సైబర్ క్రైమ్ బృందాలు
పోస్టులు డిలీట్ చేసినా.. కేసు తప్పదని హెచ్చరిక
కేసు తప్పదు: సైబర్ క్రైమ్ బృందాలు
హైదరాబాద్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలి భూముల్లో ప్రాణభయంతో జింకలు పరుగులు పెడుతున్నట్లు, నెమళ్లు ఏడుస్తున్నట్లు ఫొటోలు, వీడియోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసిన వేలాది మంది.. ప్రస్తుతం వాటిని డిలీట్ చేస్తున్నారు. ప్రకృతి, పర్యావరణ విధ్వంసం పేరిట ఏఐ ఆధారిత నకిలీ ఫొటోలు, వీడియోలను కొందరు సృష్టిస్తే.. వాటిని నిజమని నమ్మి పలువురు ప్రముఖులతోపాటు వేలాది మంది బీఆర్‌ఎస్ కార్యకర్తలు, చోటా మోటా నాయకులు, పర్యావరణ ప్రేమికులు ఆ ఫొటోలు, వీడియోలను వైరల్ చేశారు. దీంతో ఈ వ్యవహారం ఢిల్లీని సైతం తాకింది. అక్కడ కూడా వీటిని రీట్వీట్ చేయడంతో.. ఫేక్ ఫొటోలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేశాయి. దీంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించారు. ఉన్నతాధికారులతో సమావేశమై.. ఫేక్ ఫొటోలు, వీడియోలను సృష్టించిన వారితోపాటు వాటిని ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, కమిషనరేట్లతోపాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు రంగంలోకి దిగారు. మరోవైపు పలు జిల్లాల్లో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు ఫేక్ వీడియోలు పోస్టు చేసిన వారిపై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇందుకు సంబంధించి పెద్దసంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఫేక్ వీడియోలను ఎవరు తయారు చేశారన్న విషయంలో ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు ఒక కచ్చితమైన అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.
కేటీఆర్ సహా పలువురికి నోటీసులు..
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు ఆ పార్టీ సోషల్ మీడియా బాధ్యతలు చూస్తున్న మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్ తదితరులకు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. వీరిలో క్రిశాంక్ తనపై నమోదైన నాలుగు ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయాలంటూ కోర్టుకు వెళ్లినప్పటికీ ఆయనకు ఉపశమనం కలుగలేదు. విచారణకు హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు ఇలాంటి పోస్టులు పెట్టిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఇప్పటికే తాము పెట్టిన పోస్టులను డిలీట్ చేశారు. వీరిద్దరు పోస్టులను డిలీట్ చేసిన తర్వాత వేలాది సోషల్ మీడియా ఖాతాల నుంచి ఫేక్ పోస్టులు డిలీట్ అవుతున్నట్లు సైబర్ సెక్యూరిటీ అధికారులు గుర్తించి ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. అయితే పోస్టులు డిలీట్ చేసినా కొందరిపై కే సులు మాత్రం తప్పవని పోలీసు అధికారులు అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నారు. వేల కేసులు నమోదు చేయడం తమ లక్ష్యం కాదని, కేసులు పెడతామనే హెచ్చరిక ప్రజల్లోకి వెళితే మరోసారి ఇలాంటి ఫేక్ వీడియోలు, ఫొటోలు పోస్టు చేసే ముందు ఆలోచిస్తారని పోలీసులు పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి..
సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..
సిట్ కస్టడీకి ‘కల్తీ నెయ్యి’ నిందితులు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here