High Court: చెట్ల నరికివేత ఆపండి..

ABN, Publish Date - Apr 03 , 2025 | 04:48 AM

కంచ గచ్చిబౌలిలోని సర్వే నంబరు 25లో ఉన్న 400 ఎకరాల భూముల్లో ఉన్న చెట్ల నరికివేతను ఆపేయాలని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

High Court: చెట్ల నరికివేత ఆపండి..
  • గురువారం దాకా కంచ గచ్చిబౌలిలో ఎలాంటి పనులు వద్దు

  • ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం.. నేడు మళ్లీ విచారణ

  • ఒకే చోట 125 ఎకరాల విస్తీర్ణంలో చెట్లు ఉంటే అడవే

  • వాల్టా చట్టం ప్రకారం 3 మీటర్ల కంటే ఎత్తున్న ఒక్క చెట్టును

  • కొట్టేయాలన్నా అధికారుల అనుమతి తీసుకోవాల్సిందే

  • ప్రభుత్వ భూమైనా.. ప్రైవేటు అయినా నిబంధనలు వర్తిస్తాయి

  • అడవిలో చెట్లు కొట్టేయాలంటే నిపుణుల కమిటీ వేయాల్సిందే

  • కమిటీ వేయకుండా ప్రభుత్వం సుప్రీం తీర్పును ఉల్లంఘించింది

  • హైకోర్టులో పిటిషనర్ల తరఫు లాయర్ల వాదన

  • అది ప్రభుత్వ భూమే.. పరిశ్రమల కోసం ఉద్దేశించిందే

  • కంచ గచ్చిబౌలి.. అటవీ భూమి అని ఏ రికార్డుల్లోనూ లేదు

  • పాములు, ముంగీసలు, నెమళ్లు ఉంటే అడవి అవుతుందా?

  • అలాగైతే హైదరాబాద్‌లో చాలా ప్రాంతం అడవే

  • ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ సుదర్శన్‌ రెడ్డి వాదన

  • ‘ఐఎంజీ భారత’ తీర్పులో కంచ గచ్చిబౌలి భూమి స్వభావం

  • ఏంటనేది ఉందా.. అడ్వొకేట్‌ జనరల్‌ను ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలిలోని సర్వే నంబరు 25లో ఉన్న 400 ఎకరాల భూముల్లో ఉన్న చెట్ల నరికివేతను ఆపేయాలని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం మధ్యాహ్నం ఇదే అంశంపై తాము మళ్లీ విచారణ చేపడతామని.. అప్పటివరకు ఈ భూముల్లో ఎలాంటి పనులూ చేపట్టవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను టీజీఐఐసీకి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 54ను కొట్టేయాలని, సదరు భూముల్లో చెట్ల నరికివేత, చదును చేసే పనులను వెంటనే ఆపాలని విశ్రాంత శాస్త్రవేత్త బాబూరావు, వట ఫౌండేషన్‌ వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల(పిల్స్‌)పై తాత్కాలిక ప్రఽధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌, జస్టిస్‌ రేణుకతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు ఎల్‌ రవిచందర్‌, ఎస్‌ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) సుదర్శన్‌రెడ్డి వాదించారు. అడవి అంటే ఏంటనే నిర్వచనం ఏ చట్టంలోనూ స్పష్టంగా లేదని, ఒకే చోట 125 ఎకరాల విస్తీర్ణంలో చెట్లు ఉంటే అది అడవి కిందికే వస్తుందని, ‘ఏదేని ఒక విశాల ప్రదేశంలో చెట్లు దట్టంగా ఉంటే అది అడవి’ అన్న ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ అర్థాన్నే సుప్రీంకోర్టు కూడా పరిగణలోకి తీసుకుందని పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదించగా.. కంచ గచ్చిబౌలిలోని భూమి ముమ్మాటికీ ప్రభుత్వ భూమేనని, దాన్ని పరిశ్రమల కోసమే కేటాయించారని అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి అన్నారు. గూగుల్‌ ఇమేజ్‌లు తప్ప అవి అటవీ భూములు అనడానికి ఏ రికార్డూ లేదని చెప్పారు. అటవీ భూముల నిర్ధారణలో గూగుల్‌ ఇమేజ్‌లను పరిగణలోకి తీసుకోలేమంటూ సుప్రీంకోర్టే స్వయంగా చెప్పిందని పేర్కొన్నారు. ‘‘అటు రెవెన్యూ, రికార్డుల్లో.. ఇటు అటవీ రికార్డుల్లో సదరు భూమి అడవి అని ఎక్కడా లేదు. ఫొటోలను పట్టుకుని అటవీ భూమి అని నిర్ధారిస్తాం?’’ అని ఎదురు ప్రశ్నించారు. ‘‘పాములు, ముంగీసలు, నెమళ్లు ఉంటే అడవి అయిపోతుందా? అయితే హెచ్‌సీయూ కూడా అడవే. అంతెందుకు హైదరాబాద్‌లో చాలా ప్రాంతాన్ని అడవిగానే గుర్తించాల్సి వస్తుంది. హైదరాబాద్‌ గోల్ఫ్‌ అసోసియేషన్‌లో కూడా పాములు, నెమళ్లు ఉన్నాయి. దాన్నికూడా అడవి అంటారా?’’ అని వాదించారు.


200 ఎకరాల్లో చెట్లను నరికేశారు

బుధవారం విచారణ సందర్భంగా తొలుత పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదనలను ప్రారంభిస్తూ.. ‘‘వాల్టా చట్టం ప్రకారం మూడు మీటర్ల కంటే పొడవున్న ఒక్క చెట్టును నరకాలన్నా సంబంధిత అధికారి అనుమతి అవసరం. కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే కంచ గచ్చిబౌలిలో వేల చెట్లను తొలగించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తుగా ఎలాంటి అనుమతులు పొందలేదు. ప్రభుత్వ భూమి అయినా ప్రైవేటు భూమి అయినా అటవీ రూల్స్‌ వర్తిస్తాయి. ‘అక్కడ జంతువులు లేవు.. జింకలు లేవు.. గుంట నక్కలు మాత్రమే ఉన్నాయి’ అని ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ సంస్థ హైడ్రా చెరువులను గర్తించేందుకు నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ చిత్రాలను వినియోగిస్తోంది. అదేవిధంగా ఈ ప్రాంతం ఇమేజ్‌లు తెప్పించండి. అక్కడ ఏం ఉందో తెలుస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ ప్రాంతంలో చెట్లు కొట్టేయాలంటే నిపుణుల కమిటీ వేయాలి. ఆ కమిటీ అధ్యయనం చేసి అనుమతించిన తర్వాతనే చెట్లను నరికివేయాలి. కానీ, ఈ కేసులో ఎలాంటి అనుమతులు లేకుండానే వందల ఎకరాల్లో చెట్లను నరికి సుప్రీంకోర్టు ఆదేశాల ధిక్కరణకు పాల్పడ్డారు. ఒకవేళ ఈ పిటిషన్లను హైకోర్టు అనుమతిస్తే నరికేసిన అడవిని ప్రభుత్వం ఎలా పునరుద్ధరిస్తుంది’’ అని ప్రశ్నించారు. ‘‘అడవుల సంరక్షణ నిబంధనలు-2023 ప్రకారం అడవులు, అడవుల తరహాలో ఉండే భూముల రికార్డులను రూపొందించడానికి ప్రతీ రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం నిపుణుల కమిటీ వేయాలని ‘అశోక్‌ కుమార్‌ శర్మ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’ కేసులో ఈ ఏడాది మార్చి 4న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. కానీ, తెలంగాణ ప్రభుత్వం నిపుణుల కమిటీ వేయకుండానే అడవిని కొట్టేస్తోంది. యాభైకి పైగా భారీ యంత్రాలను, సిబ్బందిని మోహరించి పనులు చేస్తున్నారు. వట ఫౌండేషన్‌ మొదట పిటిషన్‌ దాఖలు చేసిన రోజు హైకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. హైకోర్టులో కేసు విచారణలో ఉండగా బాధ్యతగల రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదన్న విశ్వాసంతోనే హైకోర్టు జోక్యం చేసుకోలేదు. కానీ, దీన్ని అదనుగా తీసుకొని ప్రభుత్వం రాత్రింబవళ్లు పనులు చేస్తూ చెట్లను కొట్టేస్తోంది. ఇప్పటికే 200 ఎకరాల్లో వృక్ష సంపదను నరికేశారు. ఆకాశహర్మ్యాలు, భారీ కాంక్రీట్‌ నిర్మాణాల మధ్య పర్యావరణాన్ని సమతౌల్యం చేస్తూ అనేక రకాల జీవజాతులు, జలవనరులతో ఉన్న ప్రాంతాన్ని తొలగించడం సమంజసం కాదు’’ అని వాదించారు.


గతంలో కేటాయింపులపై ఎందుకు మాట్లాడలేదు

రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ.. వివాదం నడుస్తున్న భూమి మొదటి నుంచీ పరిశ్రమల కోసం ఉద్దేశించిందేనని కోర్టుకు తెలిపారు. ‘‘2003లో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం క్రీడాభివృద్ధి, మౌలికసదుపాయాల ఏర్పాటు కోసం ఐఎంజీ అకాడమీస్‌ భారత అనే ప్రైవేటు సంస్థకు రూ.50 వేలకు ఎకరం చొప్పున నామమాత్రపు ధరకే ఈ భూములను కేటాయించింది. కానీ, ఆ తర్వాత వచ్చిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఐఎంజీ భారత పేరిట చేసిన సేల్‌ డీడ్‌ను, ఎంవోయూను రద్దు చేసింది. దీన్ని ఐఎంజీ భారత సంస్థ హైకోర్టులో సవాల్‌ చేసింది. హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇస్తూ.. భూకేటాయింపు రద్దు సబబేనని పేర్కొంది. ఈ తీర్పును ఐఎంజీ భారత సంస్థ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. అక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వానికే అనుకూలంగా తీర్పు వచ్చింది. ఏళ్లతరబడి సుప్రీం కోర్టు వరకు వెళ్లి ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోకుండా రక్షించుకున్నాం. ప్రజల అవసరాల కోసమే వాటిని వినియోగిస్తున్నాం. ఇప్పుడు అటవీ భూమిని ఐటీ కంపెనీలకు కేటాయిస్తున్నారని గగ్గోలు పెడుతున్నవారు.. గతంలో ప్రైవేటు వ్యక్తులకు, ఇతర సంస్థలకు ఇస్తే ఎందుకు మాట్లాడలేదు.


రాష్ట్రంలో 1990 నుంచి ప్రభుత్వాలు.. 25 సర్వే నెంబరులోనే బస్సు డిపోకు 6.05 ఎకరాలు, బీఎ్‌సఎన్‌ఎల్‌కు ఎకరం, నవోదయ పాఠశాలకు 31ఎకరాలు, మండల కార్యాలయాల కాంప్లెక్స్‌కు ఐదు ఎకరాలు, స్పోర్ట్స్‌ అథారిటీ అండ్‌ టిమ్స్‌కు 117 ఎకరాలు, టీఎన్జీవోస్‌ హౌసింగ్‌ కోసం 134ఎకరాలు, అప్రోచ్‌ రోడ్డుకు 31ఎకరాలు, సబ్‌స్టేష కోసం 12.25 ఎకరాలు, ట్రిపుల్‌ ఐటీకి 81 ఎకరాలు కేటాయించాయి. అప్పుడు ఎవరూ దీన్ని ప్రశ్నించలేదు’’ అన్నారు. ‘‘ఈ 400 ఎకరాలతో పాటు సరూర్‌నగర్‌ మండలం మామిడిపల్లిలో 450 ఎకరాలను కూడా పరిశ్రమల కోసం కేటాయించారు. భవిష్యత్తులో సదరు మామిడిపల్లి భూములను కూడా అటవీ భూములు అంటారేమో’’ అని ఏజీ వ్యాఖ్యానించారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. ఐఎంజీ అకాడమీస్‌ భారత తీర్పులో ఎక్కడైనా ‘‘సదరు భూమి స్వభావం ఏంటి అని ఉందా?’’ అని ఏజీని ప్రశ్నించింది. దీనికి ఏజీ సమాధానం ఇస్తూ.. భూమి స్వభావం ఏంటి అని పేర్కొనాల్సిన అవసరమే లేదని, కంచ అంటేనే గడ్డి కోసం కేటాయించిన భూములని పేర్కొన్నారు. పశువుల పోషణకు నిజాం రాజు హైదరాబాద్‌కు నలుదిక్కులా గడ్డి కోసం ప్రత్యేకంగా భూములను ఇచ్చారన్నారు. సమయం లేకపోవడంతో విచారణను గురువారం మధ్యాహ్నం 2.15గంటలకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. అప్పటివరకు ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టరాదని స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎస్ఆర్‌హెచ్‌ వివాదంపై స్పందించిన హెచ్‌సీఏ

నా కుమారుడు ఎవరినీ మోసం చేయలేదు

For More AP News and Telugu News

Updated Date - Apr 03 , 2025 | 04:48 AM