Share News

ప్రతి దశలో రాజ్యాంగం అమలును పర్యవేక్షించాలి

ABN , Publish Date - Apr 15 , 2025 | 05:50 AM

రాజ్యాంగాన్ని పరిరక్షించడంతోపాటు ప్రతి దశలోనూ అది ఎలా అమలు జరుగుతుందో పర్యవేక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌ అన్నారు.

ప్రతి దశలో రాజ్యాంగం అమలును పర్యవేక్షించాలి

  • ఇది పౌరుల వ్యక్తిగత బాఽధ్యత

  • హైకోర్టు తాత్కాలిక సీజే జస్టిస్‌ సుజోయ్‌పాల్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగాన్ని పరిరక్షించడంతోపాటు ప్రతి దశలోనూ అది ఎలా అమలు జరుగుతుందో పర్యవేక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌ అన్నారు. తెలంగాణ బార్‌ కౌన్సిల్‌, హైకోర్టు అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన అంబేద్కర్‌ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ రాజ్యాంగంలో పొందుపర్చిన విలువలు, సూత్రాలను ప్రతి పౌరుడు ఉత్సాహంతో కాపాడుకోవాలని, దానిని వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. గంగానది ప్రారంభంలో చాలా స్వచ్ఛమైన నీటితో ప్రవహిస్తుందని, పోనుపోను నీరు కలుషితమై తాగడానికి వీలులేకుండా మారుతుందని అన్నారు.


అలాగే ప్రారంభంలో సైతం రాజ్యాంగం స్వచ్ఛంగా ఉండేదని.. కాలక్రమేణా మలినాలు ప్రవేశించాయని, వాటిని మనమే నివారించాలన్నారు. గౌరవ అతిథిగా పాల్గొన్న జస్టిస్‌ సూరేపల్లి నంద మాట్లాడుతూ.. సామాజిక సంక్షేమం, సామాజిక న్యాయం ప్రజలకు అందించినప్పుడే అంబేద్కర్‌కు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. బలహీనవర్గాల అభ్యున్నతికి, అన్ని రంగాల్లో సమ్మిళిత వృద్ధికి వ్యూహాలను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి జస్టిస్‌ నందికొండ నర్సింగరావు, బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ నర్సింహారెడ్డి, వైస్‌ ఛైర్మన్‌ సునీల్‌గౌడ్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఏ జగన్‌, మాజీ అధ్యక్షుడు వీ రఘునాథ్‌, బీసీఐ సభ్యుడు విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2025 | 05:50 AM