High Court Slams GHMC: అక్రమమని తెలిసీ ప్రోత్సాహం
ABN , Publish Date - Apr 16 , 2025 | 03:03 AM
హైదరాబాద్ మణికొండలో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న జీహెచ్‌ఎంసీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించడంపై కమిషనర్లను వ్యక్తిగతంగా హాజరు కావాలని హెచ్చరించింది

ఆ తర్వాత పథకాల పేరిట క్రమబద్ధీకరణ
అక్రమ నిర్మాణాలను ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ
ప్రోత్సహిస్తున్నాయి.. హైకోర్టు ఆగ్రహం
మణికొండలో అక్రమ కట్టడాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశం
లేదంటే జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్లు వ్యక్తిగతంగా
విచారణకు హాజరు రావాలి.. ధర్మాసనం హెచ్చరిక
హైదరాబాద్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ అధికారులు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో చెడు సంప్రదాయానికి తెరలేపుతున్నారని.. అక్రమ నిర్మాణాల పూర్తికి అవకాశం ఇచ్చి.. ఆ తర్వాత వివిధ పథకాల పేరుతో వాటిని క్రమబద్ధీకరిస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోకపోతే చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు అలాగే కొనసాగుతాయని.. ఈ విషయంలో ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ కొనసాగిస్తున్న విధానం సమంజసం కాదని వ్యాఖ్యానించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ జాగీర్‌లో 203 నుంచి210 వరకూ ఉన్న వివిధ సర్వే నంబర్లలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని మణినగర్ కాలనీ ప్లాట్ ఓనర్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ సొసైటీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. యథాతథ స్థితి (స్టేటస్ కో) విధించింది. 2023 మార్చి 14 నాటికి సదరు భూముల్లో నిర్మాణాల పరిస్థితిపై ఫొటోలు, వీడియోలు సమర్పించాలని పేర్కొంది. అయితే, హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ అక్కడ అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని.. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులు వాటిని అడ్డుకోవడం లేదని పేర్కొంటూ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలైంది. దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. కచ్చితమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని.. ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వ్యాఖ్యానించింది. స్టేటస్ కో విధించిన తర్వాత కూడా పలు నిర్మాణాలు పూర్తయినట్లు ఫొటోల ద్వారా స్పష్టమవుతోందని పేర్కొంది. అక్రమ నిర్మాణాలను సీజ్ చేయాలన్న ఉత్తర్వులను జీహెచ్‌ఎంసీ చిత్తశుద్ధితో అమలు చేయడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. అధికారులతో కుమ్మక్కై చట్టవిరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టినందుకు ‘సూపర్‌టెక్ లిమిటెడ్ వర్సెస్ ఎమరాల్డ్ కోర్ట్ ఓనర్స్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్’ కేసులో భారీ టవర్స్ కూల్చివేతకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసింది.
ప్రస్తుత కోర్టు ధిక్కరణ కేసులోని మణికొండ జాగీర్ భూముల్లో ఎన్ని నిర్మాణాలు ఉన్నాయి? ఎన్నింటికి అనుమతి ఉంది? అనుమతి లేకుండా ఎన్ని నిర్మాణాలు చేపట్టారు? ప్రణాళికకు విరుద్ధంగా ఎన్ని కట్టారు? అక్రమ నిర్మాణాలపై తీసుకున్న చర్యలేంటి? తాగునీరు, విద్యుత్ నిలిపివేతకు సంబంధించి ఎన్ని లేఖలు రాశారు? అక్రమ నిర్మాణాల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై ఎలాంటి చర్యలు చేపట్టారు? తదితర వివరాలు, ఫొటోలు, వీడియోలతో సమగ్ర నివేదిక సమర్పించాలని.. వచ్చే విచారణ తేదీలోపు ఈ నివేదిక సమర్పించపోతే జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్లు వ్యక్తిగతంగా హాజరు కావాలని ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణ జూలై 2కు వాయుదా వేసింది.
కార్పొరేటర్ చెప్తే..నిర్మాణ అనుమతి నిలిపేస్తారా?: హైకోర్టు
కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌పై మండిపాటు
కార్పొరేటర్ చెప్పారని నిర్మాణ అనుమతులు ఇవ్వకుండా నిలిపేయడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో ప్రత్యక్షంగా హాజరైన కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్‌పై ఆగ్రహం వ్యక్తంచేసింది. నిబంధనల ప్రకారం ప్రాసెసింగ్ ఫీజు తీసుకుని బిల్డింగ్‌కు నిర్మాణ అనుమతి ఇవ్వాలని హైకోర్టు గతంలో ఆదేశాలు జారీచేనప్పటికీ చర్యలు తీసుకోలేదని వీణారెడ్డి అనే మహిళ హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ధిక్కరణ కేసులో నోటీసులు ఇచ్చినా కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ స్పందించకపోవడంతో ప్రత్యక్షంగా హాజరుకావాలని హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తాజాగా మంగళవారం ఈ పిటిషన్‌పై జస్టిస్ కే లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. కోర్టు ముందు హాజరైన కమిషనర్.. అందులో ప్రభుత్వ భూమి ఉందని కార్పొరేటర్ చెప్పడం వల్లే అనుమతి ఇవ్వలేదని పేర్కొనడంతో ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. కమిషనర్ వివరణకు సంతృప్తి చెందని ధర్మాసనం.. అనుమతి కోరుతున్న భూమిలో సర్వే చేపట్టి ప్రభుత్వ భూమి ఉందా? లేదా? తేల్చాలని స్పష్టంచేసింది. ఆ తర్వాత నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణ జూన్ నెలకు వాయిదా వేసింది.
For AndhraPradesh News And Telugu News