Adilabad: పక్కింటి బాలికపై తండ్రీకొడుకుల అత్యాచారం
ABN , Publish Date - Feb 23 , 2025 | 04:36 AM
ఓ 70 ఏళ్ల వృద్ధుడు.. 32 ఏళ్ల వయస్సు ఉన్న అతని కుమారుడు.. తమ పక్కింటిలో ఉండే నిండా 13 ఏళ్లు లేని ఓ బాలిక పట్ల కీచకులుగా మారారు. మానసిక ఆరోగ్యం సరిగా లేని చిన్నారి అని కూడా చూడకుండా వేర్వేరుగా అత్యాచారానికి తెగబడి ఆ బాలిక బాల్యాన్ని చిదిమేశారు.

బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు వేర్వేరుగా అఘాయిత్యం
చంపేస్తామని బెదిరించడంతో బయటకు చెప్పని చిన్నారి
అస్వస్థతకు గురైన కుమార్తెను తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా బయటపడిన ఘోరం
ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ఓ 70 ఏళ్ల వృద్ధుడు.. 32 ఏళ్ల వయస్సు ఉన్న అతని కుమారుడు.. తమ పక్కింటిలో ఉండే నిండా 13 ఏళ్లు లేని ఓ బాలిక పట్ల కీచకులుగా మారారు. మానసిక ఆరోగ్యం సరిగా లేని చిన్నారి అని కూడా చూడకుండా వేర్వేరుగా అత్యాచారానికి తెగబడి ఆ బాలిక బాల్యాన్ని చిదిమేశారు. ఈ దారుణ ఘటన ఆదిలాబాద్‌లో శనివారం వెలుగు చూసింది. బాధిత కుటుంబం ఆదిలాబాద్‌లోని ఓ కాలనీలో నివాసముంటుంది. కూలీ పనులు చేసుకునే తల్లిదండ్రులు.. మానసిక స్థితి బాగోలేని తమ కుమార్తె(13)ను ఇంటి వద్దే ఉంచి పనికి వెళ్లివస్తుంటారు. ఈ క్రమంలో పాపను చూస్తుండమని ఇరుగుపొరుగుకు చెబుతుంటారు.
బాధితురాలి పక్కింట్లో ఇంగోలే గంగాధర్(70) అతని కొడుకు ఇంగోలే అనిల్(32), అనిల్ భార్య దుప్పాత్రే సుషు నివాసముంటున్నారు. కూలీ పనులు చేసుకునే తండ్రీకొడుకులు పక్కింట్లో ఉన్న బాలికపై కన్నేశారు. వారం క్రితం బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు వేర్వేరుగా అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం బయటికి చెబితే చంపేస్తామని బాలికను బెదిరించడంతో ఆ బాలిక ఎవరికీ చెప్పలేదు. ఈ అత్యాచారం సంగతి తెలిసినా సుషు నోరువిప్పలేదు. అయితే, బాలిక అస్వస్థతకు గురికాగా తల్లిదండ్రులు శనివారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా జరిగిన దారుణం బయటికొచ్చింది. దీంతో నిందితులు గంగాధర్, అనిల్‌తోపాటు వారికి సహకరించిన సుషును పోలీసులు అరెస్టు చేశారు.