Share News

Dilshuknagar Bomb Blast: దోషుల తరఫున వాదించింది ఎవరంటే..

ABN , Publish Date - Apr 08 , 2025 | 03:54 PM

Dilshuknagar Bomb Blast: దిల్‌షుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో దోషులకు ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను తెలంగాణ హైకోర్టు సమర్థించింది. ఈ కేసులో దోషుల్లో ఒకరి తరఫున న్యాయవాది ఈ కేసును వాదించారు. అయితే ఈ కేసు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.

Dilshuknagar Bomb Blast: దోషుల తరఫున వాదించింది ఎవరంటే..

హైదరాబాద్, ఏప్రిల్ 08: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎన్‌ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలంటూ ఐదుగురు దోషులు దాఖలు చేసిన అప్పీళ్లను ఉన్నత న్యాయస్థానం డిస్మిస్‌ చేసింది. ఎన్‌ఐఏ కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది.

అయితే నిందితుల్లో ఒకరైన ఏ6 అజాజ్ షేక్ సమర్ అర్మాన్ తరపున న్యాయవాది మహమ్మద్ షుజావుల్లా ఖాన్ ఈ కేసును హైకోర్టులో వాదించారు. ఈ కేసులో వీరి ప్రమేయం లేదన్నారు. వీరికీ ఏం తెలియదన్నారు. హైకోర్టు తీర్పుపై తాము మరికొద్ది నెలల్లో సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని నిందితుల తరఫు న్యాయవాది మహమ్మద్ షుజావుల్లా ఖాన్ స్పష్టం చేశారు.


మరోవైపు ఈ బాంబు పేలుళ్ల కారణంగా 18 మంది మరణించగా.. 131 మంది గాయపడ్డారు. వారిలో పలువురు నేటికి నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో దోషులుగా తేలిన వారి తరఫున వాదించి న్యాయవాదిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో నిందితులకు ఉరి శిక్ష పడిన అనంతరం కోర్టు బయట.. న్యాయవాది మహమ్మద్ షుజావుల్లా ఖాన్ మీడియాతో మాట్లాడుతోన్న వీడియో వైరల్ అయింది. అతడిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా.. అతడిపై కామెంట్ల రూపంలో తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


ఇంతకీ ఏం జరిగిందంటే..

2013,ఫిబ్రవరి 21వ తేదీన దిల్‌షుఖ్‌నగర్‌లోని బస్ స్టాప్‌, మిర్చిపాయింట్‌ వద్ద జంట బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 18 మంది మృతి చెందారు. మరో 131 మంది గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్‌ రియాజ్‌ అలియాస్‌ రియాజ్‌ భత్కల్‌ పరారీలో ఉన్నాడు. మిగిలిన ఐదుగురు నిందితులకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబరు 13న తీర్పును వెలువరించింది.

ఉరిశిక్ష పడిన నిందితుల్లో అసదుల్లా అక్తర్‌ అలియాస్‌ హద్ది, జియా ఉర్‌ రహమాన్‌ అలియాస్‌ వఘాస్‌ అలియాస్‌ నబీల్‌ అహమ్మద్, మహ్మద్‌ తహసీన్‌ అక్తర్‌ అలియాస్‌ హసన్‌ అలియాస్‌ మోను, యాసిన్‌ భత్కల్‌ అలియాస్‌ షారూఖ్, అజాజ్‌ షేక్‌ అలియాస్‌ సమర్‌ ఆర్మాన్‌ తుండె అలియాస్‌ సాగర్‌ అలియాస్‌ ఐజాజ్‌ సయ్యద్‌ షేక్‌ ఉన్నారు.


అనంతరం ఉరిశిక్ష ధ్రువీకరణ నిమిత్తం ఎన్‌ఐఏ కోర్టు తీర్పును హైకోర్టుకు నివేదించింది. దీంతో పాటు ఐదుగురు నిందితులు కింది కోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్, జస్టిస్‌ పి.శ్రీసుధలతో కూడిన ధర్మాసనం దాదాపు 45 రోజులు సుదీర్ఘ విచారణ జరిపింది.

అనంతరం ఈ కేసులో తీర్పును వాయిదా వేసింది. అయితే ఎన్‌ఐఏ కోర్టు తీర్పును ఈ ధర్మాసనం సమర్థిస్తు ఆదేశాలు జారీ చేసింది. ఇక హైకోర్టు తీర్పుపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న వారికి మిఠాయిలు పంచి పెట్టారు.

For Telangana News And Telugu News

Updated Date - Apr 08 , 2025 | 04:05 PM