KTR: అవసరమైతే చచ్చిపోతా.. కేటీఆర్ సంచలన కామెంట్స్
ABN, Publish Date - Jan 09 , 2025 | 10:26 AM
Telangana: ‘‘ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కుంటాం. న్యాయస్థానాలపైన.. చట్టాలపైన నమ్మకం ఉంది. ఏ ప్రశ్నలు వేసినా సమాధానం చెప్పేందుకు సిద్ధం. కేసీఆర్ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డగా చెబుతున్నా.. తెలంగాణ కోసం అవసరమైతే చనిపోతాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో తలవంచేది లేదు’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్, జనవరి 9: ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ విచారణకు బయలుదేరారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా నందినగర్‌లోని నివాసం నుంచి ఏసీబీ కార్యాలయానికి బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కేసులో తాను ఎలాంటి క్విడ్ ప్రోకు పాల్పడలేదని తెలిపారు. తమకు న్యాయవ్యవస్థపైన పూర్తి నమ్మకం ఉందన్నారు. తాము ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ కొడుకుగా చెబుతున్నా తెలంగాణ కోసం అవసరమైతే చనిపోతా అంటూ కేటీఆర్ సెన్షేషనల్ కామెంట్స్ చేశారు. ‘‘తెలంగాణ బిడ్డగా, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన కార్యకర్తగా, కేసీఆర్ సైనికుడిగా స్వచ్ఛమైన మనసుతో చెబుతున్నా.. నేను ఏ తప్పు చేయలేదు. తెలంగాణ ప్రతిష్టను పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను అంతర్జాతీయం చేయడానికి ఆనాడు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశాను.. ఆ ప్రయత్నాలు చాలా వరకు ఫలించాయి. దేశంలోనే ప్రధానమైన నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా పనిచేశాము’’ అని మాజీ మంత్రి తెలిపారు.
వారికి చెప్పేది ఒక్కటే...
‘‘బీఆర్‌ఎస్ హయాంలో మా బావమరుదులకు 1137 కోట్ల కాంట్రాక్టు ఇచ్చే పనులు చేయలేదు. మంత్రిగా కేబినెట్‌లో కూర్చుని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వలేదు. కాంట్రాక్టులు ఇచ్చి ప్రతిఫలంగా కార్లు కొనుక్కోలేదు. ఆ పనులను సీఎం రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు చేశారు. నేను ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వెళ్లి దొరికిపోయిన దొంగను కాను. నేను నికార్సైన తెలంగాణ బిడ్డను. హైదరాబాద్ ప్రతిష్టను పెంచడానికి అన్ని విధాలుగా ప్రయత్నించాను. అరపైసా అవినీతి కూడా చేయలేదు. మాపై బుదరజల్లి.. కొంతమంది రాజకీయపబ్బం గడుపుకోవాలని భావిస్తున్నారు. వారికి నేను చెప్పేది ఒక్కటే. నిజం నిలకడమీద తెలుస్తుంది. మేము మాట్లాడుతూనే ఉంటాం.. పోరాడుతూనే ఉంటాం. గత సంవత్సర కాలంగా విద్యుత్ చార్జీలు పెంచవద్దని పోరాడింది టీఆర్‌ఎస్. లగచర్లలో రైతులను జైల్లో పెట్టినా, హైడ్రా కూల్చివేతలను, ఆరు గ్యారెంటీలను చేయపోతే నిలదీసింది బీఆర్ఎస్’’ అని తెలిపారు.
తలవంచేది లేదు...
‘‘నాపైన కేసుపెట్టి మా పార్టీ నాయకత్వాన్ని దారిమళ్లింపు దిశగా చేసే ప్రయత్నాలు ఎప్పటికీ నెరవేరవు. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కుంటాం. న్యాయస్థానాలపైన.. చట్టాలపైన నమ్మకం ఉంది. ఏ ప్రశ్నలు వేసినా సమాధానం చెప్పేందుకు సిద్ధం. కేసీఆర్ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డగా చెబుతున్నా.. తెలంగాణ కోసం అవసరమైతే చనిపోతాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో తలవంచేది లేదు’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. అనంతరం ఆయన ఏసీబీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. కేటీఆర్ వెంట న్యాయవాది రామచంద్రరావు ఉన్నారు. మరికాసేపట్లో కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించి విదేశీ కంపెనీకి నిధుల మళ్లింపుపై ప్రధానంగా కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు.
ఇవి కూడా చదవండి...
TTD: తిరుపతిలో తొక్కిసలాట ఆరుగురి దుర్మరణం
Read Latest Telangana News And Telugu news
Updated Date - Jan 09 , 2025 | 01:21 PM