Share News

TG Politics: అందరి కోరిక అదే.. కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా అంతర్గత కుమ్ములాటలు

ABN , Publish Date - Apr 15 , 2025 | 04:21 PM

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు తారా స్థాయికి చేరాయా.. మంత్రి పదవుల కోసమే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారా. అంతర్గత విబేధాలతోనే మంత్రి వర్గ విస్తరణ వాయిదాపడుతూ వస్తుందా.

TG Politics: అందరి కోరిక అదే.. కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా అంతర్గత కుమ్ములాటలు
Telangana Congress

తెలంగాణ కాంగ్రెస్‌లో కొన్ని రోజులుగా ఏమి జరుగుతుందో ఎవరికీ అర్థం కావడంలేదు. పార్టీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువంటూ ఇలాంటి అంతర్గత కుమ్ములాటలను ఆ పార్టీ సమర్థించుకోవడం సహజమే. కానీ పార్టీలో కొత్తగా చేరిన నేతలో, క్షేత్రస్థాయి నాయకులో ఈ విమర్శలు చేయడంలేదు. ఎమ్మెల్యేలు, ఆ స్థాయి నేతలే ఇలాంటి విమర్శలు చేసుకోవడంతో నేరుగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. పార్టీకి ఇబ్బంది కలిగించేలా ఏ నాయకుడు మాట్లాడినా ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. ముఖ్యంగా మంత్రి పదవులు ఆశిస్తున్న నాయకులు తమ పోస్టులను వేరే ఒకరు ఎగరేసుకుపోతున్నారనే ప్రచారం నేపథ్యంలో సొంత పార్టీ నేతలపై కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిని ఉద్దేశించి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.


అందరి కోరిక అదే

తెలంగాణలో పూర్తిస్థాయిలో మంత్రివర్గం కొలువుదీరలేదు. ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 18 మంది వరకు మంత్రివర్గంలో ఉండొచ్చు. ప్రస్తుతం సీఎంతో కలిపి 12మంది మాత్రమే ఉన్నారు. ఇంకా ఆరుగురికి మంత్రిమండలిలో చోటు కల్పించే అవకాశం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా ఆరుగురు మంత్రుల ఎంపిక పూర్తికాలేదు. తాజాగా తెలంగాణలోని మంత్రిమండలిలో ఖాళీలను నింపుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఉగాదిగే ఈ ప్రక్రియ పూర్తవుతుందని అంతా భావించారు. కానీ అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో ఈ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి.మంత్రి పదవుల కోసం ఎక్కువ మంది ఆశావాహులు ఉండటంతో ఎవరికి ఇస్తే ఎలాంటి ఇబ్బదులు వస్తాయోననే ఆలోచలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.


సామాజిక సమీకరణల నేపథ్యంలో

సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో మంత్రివర్గాన్ని నింపాల్సి ఉంటుంది. బీసీ నినాదం పెద్దఎత్తున నడుస్తున్న క్రమంలో వారికి కనీసం 2 సీట్లు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఎస్సీలకు రెడు, మైనార్టీలకు మరొక పదవి ఇవ్వాల్సి ఉంది. కానీ కాంగ్రెస్‌లో ఓసీ అభ్యర్థుల నుంచి మంత్రి పదవుల కోసం తీవ్రపోటీ నెలకొంది. ఈ క్రమంలో ఆ ఒక్క పదవి కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా కష్టడుతున్నారు. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని ఆశిస్తున్నారు. కానీ ఒకే కుటుంబంలో రెండు పదవులు వద్దని కొందరు నేతలు హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారికి మంత్రి పదవి ఇవ్వాలని మాజీ మంత్రి జానారెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాశారు. దీంతో తన పదవికి జానారెడ్డి అడ్డుపడుతున్నారనే ఉద్దేశంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా కొన్ని విమర్శలు చేశారు. ఇలా మంత్రి పదవులు ఆశిస్తున్న నేతలు సొంతపార్టీ నాయకులపై బహిరంగంగా విమర్శలు చేసుకుంటుండంటం అధిష్టానానికి తలనొప్పిగా మారిందట.

ఈ వార్తలు కూడా చదవండి:

AP Liquor Scam: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి షాక్.. ఆ కేసులో నోటీసులు జారీ..

Supreme Court: వివేకా హత్య కేసు..ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీం నోటీసులు..

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Apr 15 , 2025 | 04:21 PM