KTR: సుంకిశాల ఘటన.. తప్పును ఒప్పుకున్నట్టేనా
ABN, Publish Date - Jan 11 , 2025 | 11:28 AM
Telangana: సుంకిశాల ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి స్పందించారు. మేఘా సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలనే కమిటీ రిపోర్ట్‌ను ప్రభుత్వం రహస్యంగా ఉంచడానికి ప్రధాన కారణం సీఎం రేవంత్ - మేఘా కృష్ణారెడ్డికి మధ్య కుదిరిన చీకటి ఒప్పందమే అని ఆరోపించారు. సుంకిశాలలో మేఘా సంస్థ నిర్లక్ష్యం వల్ల రిటైనింగ్ వాల్ కూలి రూ. 80 కోట్ల ప్రజాధనానికి నష్టం వాటిల్లిందన్నారు.
హైదరాబాద్, జనవరి 11: సుంకిశాల ఘటనపై (Sunkishala incident) విజిలెన్స్ నివేదికను సమాచార హక్కు చట్టం కింద ఇవ్వకుండా తొక్కిపెట్టడం దారుణమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్‌వేదికగా ఆయన స్పందిస్తూ.. ఒక నిర్మాణ సంస్థ చేసిన ఘోర తప్పిదాన్ని.. దేశ రక్షణకు సంబంధించిన సమాచార హక్కు సెక్షన్లతో ముడిపెట్టి దాచడం మరింత విడ్డూరమన్నారు. మేఘా సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలనే కమిటీ రిపోర్ట్‌ను ప్రభుత్వం రహస్యంగా ఉంచడానికి ప్రధాన కారణం సీఎం రేవంత్ - మేఘా కృష్ణారెడ్డికి మధ్య కుదిరిన చీకటి ఒప్పందమే అని ఆరోపించారు. సుంకిశాలలో మేఘా సంస్థ నిర్లక్ష్యం వల్ల రిటైనింగ్ వాల్ కూలి రూ. 80 కోట్ల ప్రజాధనానికి నష్టం వాటిల్లిందన్నారు. హైదరాబాద్‌లో పెరుగుతున్న తాగునీటి అవసరాలు తీర్చే సంకల్పానికి గండిపడిందన్నారు. నిర్మాణ లోపం బయట పడుతుందనే భయంతోనే కమిటీ నివేదికను బహిర్గతం చేయడానికి కాంగ్రెస్ సర్కారు జంకుతోందన్నారు. సమాచారాన్ని దాచడం అంటే జరిగిన తప్పును ఒప్పుకున్నట్టే అని అన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘా సంస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ అని దుమ్మెత్తిపోసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారని మండిపడ్డారు. తన జేబు సంస్థగా మార్చుకుని ఢిల్లీ పెద్దల ధనదాహాన్ని తీర్చేందుకు పావుగా వాడుకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు.బ్లాక్‌లిస్టులో పెట్టాల్సిన మేఘా సంస్థకు, మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీకి రూ.4,350 కోట్ల కొండగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును (Quid pro Quo) కేక్ కోసినట్టు చెరిసగం పంచిపెట్టి భారీ కుంభకోణానికి తెరతీశారని ఆరోపించారు. ఇప్పటికైనా సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసే చర్యలను మానుకోవాలని, సుంకిశాల ఘటనపై ప్రభుత్వం చేపట్టిన విచారణ నివేదికను బహిర్గతం చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
కాగా.. నల్లగొండ జిల్లా సుంకిశాల వద్ద చేపట్టిన జలమండలి పనుల్లో ఒక్కసారిగా రిటెయినింగ్ వాల్ కుప్పకూలిన విషయం తెలిసిందే. నాగార్జున సాగర్ జలాశయానికి ఆనుకుని నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టు టన్నెల్ గేటు, ఇన్‌టేక్ వెల్ రక్షణ గోడ గతేడాది కుప్పకూలింది. భారీ శబ్ధంతో రిటెయినింగ్ వాల్ కూలింది. అయితే ఆ సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటనపై ఇంజనీర్ల కమిటీతో విచారణ జరిపిన వాటర్ బోర్డు.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సుంకిశాల ప్రాజెక్టు సైడ్ వాల్ (రక్షణ గోడ) కూలిపోయిన ప్రమాద ఘటనకు పూర్తి బాధ్యత తమదేనని నిర్మాణ సంస్థ వాటర్ బోర్డుకు తెలిపింది. దీనికి నిర్మాణ సంస్థ మూడు పేజీలతో కూడిన వివరణ లేఖను వాటర్ బోర్డుకు అందజేసింది. అయితే ఘటనకు కారణమైన మేఘా ఇంజినీరింగ్ కంపెనీపై చర్యలు తీసుకోకుండా కాపాడుకుంటూ వస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. మేఘా సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలనే కమిటీ రిపోర్ట్‌ను ప్రభుత్వం రహస్యంగా ఉంచింది. ఈ ఘటనపై విజిలెన్స్ విచారణ జరిపిన ప్రభుత్వం ఆ నివేదికను బయటపెట్టడం లేదు. దీనిపైనే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి...
Sankranti: సంక్రాంతి పండుగ వేళ.. ఆ బస్సులపై అధికారుల నిఘా
Sankranti: పల్లెలకు కదిలిన జనం.. బస్సులు, ట్రైన్‌లు ఫుల్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jan 11 , 2025 | 01:11 PM