Suryanarayana Guptha: యూనివర్శిటీకి పొట్టి శ్రీరాములు పేరు తీస్తే ఊరుకోం.. బీజేపీ ఎమ్మెల్యే
ABN , Publish Date - Mar 17 , 2025 | 06:24 PM
పొట్టిశ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పుపై బీజేపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త స్పందించారు. ఆర్యవైశ్యుల డిమాండ్స్ నెరవేర్చకపోతే ప్రభుత్వంపై ఉద్యమం చేస్తామన్నారు.ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతీయకుండా ప్రభుత్వం చూడాలన్నారు.

తెలంగాణ ప్రభుత్వం తెలుగు యూనివర్శిటీకి పొట్టి శ్రీరాములు పేరు తొలగించి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలన్న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు యూనివర్శిటీకి పొట్టి శ్రీరాములు పేరు తీసేయడాన్ని బీజేపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త తప్పుబట్టారు. ప్రభుత్వం నిర్ణయంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ‘ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాం. పొట్టి శ్రీరాములు అంటే గుర్తుకొచ్చేది యూనివర్సిటీ. ఆయన ఒక ప్రాంతానికి చెందినవారు కాదు. గాంధీతో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. కులం, జాతి కోసం పనిచేసిన వ్యక్తి కాదు. దేవాలయాల్లోకి అందరికీ అనుమతి ఉండాలని కోరిన వ్యక్తి. బాషపరమైన పునాది ఉందంటే అది పొట్టి శ్రీరాములు ఘనతే. నిరంకుశ పాలనకు..రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి సురవరం ప్రతాపరెడ్. ఆయన పేరు ఉస్మానియా యూనివర్సిటీకి పెట్టాలని మా డిమాండ్.
శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం. ఆర్యవైశ్యులకు ఆరాధ్య దైవం పొట్టిశ్రీరాములు. ఆర్యవైశ్యులు మృధు స్వభావులు. ఆర్యవైశ్యుల డిమాండ్స్ నెరవేర్చకపోతే ప్రభుత్వంపై ఉద్యమం చేస్తాం. చర్లపల్లికి పేరు తీయడం ఎందుకు,పెట్టడం ఎందుకు. ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతీయకుండా ప్రభుత్వం చూడాలి’ అని అన్నారు. అంతకు ముందు తెలుగు యూనివర్శిటీ పేరు మార్పుపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. పేరును ఎందుకు మార్చాల్సి వచ్చిందో వివరించారు. పేరు మార్పు తెలంగాణ ఆత్మ గౌరవానికి సంబంధించినదని అన్నారు. తెలంగాణ కోసం పని చేసిన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకే పేరు మార్చుతున్నట్లు తెలిపారు. తెలంగాణకు అసలు భాషనే లేదన్న సందర్భంలో గోల్కొండ పత్రిక ప్రారంభించి కవులను ఏకతాటిపైకి తెచ్చి నడిపించారన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో సురవరం ప్రతాపరెడ్డి సేవ మరువలేనిదన్నారు.
అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం
అమరావతిలో భారీ పొట్టి శ్రీరాములు విగ్రహ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు కోసం 58 రోజులపాటు కఠోర దీక్ష చేపట్టి, ఆత్మ బలిదానం చేసిన పొట్టి శ్రీరాములు స్మారకంగా 58 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పొట్టి శ్రీరాములు స్వగ్రామమైన పడమటిపల్లిలోని నివాసాన్ని మ్యూజియంగా మారుస్తామన్నారు. నెల్లూరుకు పొట్టి శ్రీరాములు పేరును పెట్టింది తామేనన్నారు. పొట్టి శ్రీరాములు పేరుతో మెమోరియల్ ట్రస్టు కూడా ఏర్పాటు చేయాలని ఆయన అభిమానులకు పిలుపునిచ్చారు. వచ్చే సంవత్సరం మార్చి 16 వరకు ప్రతినెలా ఒకటి చొప్పున 12 రకాల కార్యక్రమాలు చేపడతామని, అప్పటికి 125వ జయంతి ఉత్సవాలు పూర్తవుతాయని చంద్రబాబు తెలిపారు.
Also Read:
ఎన్టీఆర్ స్టేడియంలో పట్టపగలే దారుణం..
ప్రధాని అపాయింట్‌మెంట్ ఇప్పించండి
ప్రైవేటు భాగాల్లో బంగారు దాచిపెట్టి..
For More Telangana News and Telugu News..