MP Raghunandan Rao: సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌పై నిప్పులు చెరిగిన ఎంపీ రఘునందన్ రావు..

ABN, Publish Date - Apr 03 , 2025 | 06:02 PM

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడ్రోజుల్లోనే 100 ఎకరాల్లో చెట్లు నరికివేయడంపై సుప్రీంకోర్టు సైతం విస్మయం వ్యక్తం చేసినట్లు ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ తీరుకు నిదర్శనమని ఎంపీ మండిపడ్డారు.

MP Raghunandan Rao: సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌పై నిప్పులు చెరిగిన ఎంపీ రఘునందన్ రావు..
MP Raghunandan Rao

హైదరాబాద్: కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli) భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పును బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) స్వాగతించారు. ఏప్రిల్ 16 వరకూ ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టవద్దని ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడ్రోజుల్లోనే 100 ఎకరాల్లో చెట్లు నరికివేయడంపై సుప్రీంకోర్టు సైతం విస్మయం వ్యక్తం చేసిందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిదర్శనమని ఆయన మండిపడ్డారు. 1973లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పెట్టినప్పుడు 2,374 ఎకరాలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని, ఇప్పుడు అదే కాంగ్రెస్ ఆ భూములను లాక్కుంటుందని రఘునందన్ రావు మండిపడ్డారు.


రాహుల్ గాంధీ ప్రశ్నించరా?..

ఈ సందర్భంగా ఎంపీ రఘునందర్ రావు మాట్లాడుతూ.."సుప్రీంకోర్టు తీర్పు విద్యార్థులు సాధించిన సమైక్య విజయం. విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలిపినప్పుడు పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారు. యూనివర్సిటీలో పిల్లల జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన దృశ్యాలు రాహుల్ గాంధీకి ఎందుకు కనిపించలేదు. మా నానమ్మ ఇచ్చిన భూములను ఎందుకు లాక్కుంటున్నావని రాహుల్ గాంధీ అడిగారా?. రాహుల్ అడిగి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. కోర్టులో ఉన్న అంశంపై ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం సరికాదు. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు విద్యార్థులకు అనుకూలం, వారి విజయానికి నిదర్శనం. భవిష్యత్తులో విద్యార్థుల భూములు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకుండా అడ్డుకుంటాం. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలి. వాల్టా చట్టం ప్రకారం ఇంటి కాంపౌండ్‌లో ఉన్న చెట్టు నరకాలన్నా అనుమతులు తప్పనిసరి.


విద్యార్థుల పక్షానే..

ఒక్క చెట్టుకే అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితుల్లో.. మూడ్రోజుల్లో 100 ఎకరాల్లో వేల కొద్దీ చెట్లను నరికివేయడంపై సుప్రీంకోర్టు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ చట్టాలు, నిబంధనలు అధికారులకు తెలియదని నేను అనుకోవడం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నెల రోజుల్లో నిపుణుల కమిటీ వేయాలి. విద్యార్థుల పక్షాన నిలబడతాం. వారి పోరాటాన్ని అభినందిస్తూ వారి వెంట ఉంటాం. 1973లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పెట్టినప్పుడు 2374 ఎకరాలను ప్రభుత్వం ఇచ్చింది. ఇందిరమ్మ రాజ్యమని రోజూ చెప్పే రేవంత్ రెడ్డి.. ఇందిరమ్మ హయాంలో ఇచ్చిన భూములను వ్యాపారం కోసం ఎలా వాడతారు?. చెరువులు, కుంటల్లో అక్రమ నిర్మాణాలను తొలగించి పర్యావరణాన్ని రక్షించేందుకు హైడ్రా తెచ్చానని సీఎం రేవంత్ అన్నారు. మరిక్కడ వందల ఎకరాల్లో చెట్లను నరికి, వన్య ప్రాణులకు ఇబ్బంది కలిగిస్తుంటే ఎలా?. అమ్మ బతికున్నప్పుడు అన్నం పెట్టలేనోడు.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్టు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.


ఆ రెండు పార్టీలూ ఒక్కటే..

పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ మొహం చూడని యువరాజు(కేటీఆర్) ఇప్పుడు నంగనాచి కబుర్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సెంట్రల్ యూనివర్సిటీ భూములపై మాట్లాడే నైతిక హక్కు లేదు. ఆ పార్టీ విశ్వసనీయత కోల్పోయింది. బీఆర్ఎస్ వాళ్లు విద్యార్థుల ముందుకెళ్లి మొసలి కన్నీళ్లు కార్చుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ నాణేనికి బొమ్మా, బొరుసు వంటివి. పదేళ్లపాటు వాళ్లు పచ్చగున్న దగ్గర తిని, వెచ్చగున్న చోట పడుకున్నారు. గులాబీ జెండా మీద ఎమ్మెల్యే అయ్యి, మూడు రంగుల జెండా మీద పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ రెండు పార్టీలది వీణా-వాణిలా విడదీయరాని బంధం" అని విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Gachibowli Land Case: కంచ గచ్చిబౌలి భూముల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

TG High Court: వక్ఫ్ బోర్డుపై తెలంగాణ హైకోర్టు సీరియస్.. తీర్పులనే ఉల్లంఘిస్తారా అంటూ ప్రశ్న..

MP Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డికి ఎదురుదెబ్బ.. లిక్కర్ స్కామ్ కేసులో..

Updated Date - Apr 03 , 2025 | 06:44 PM