Sankranti: సంక్రాంతి జాతర.. పల్లెకు బయలెల్లిన హైదరాబాదీలు
ABN, Publish Date - Jan 11 , 2025 | 09:52 AM
Telangana: హైదరాబాద్ - విజయవాడ 65వ జాతీయ రహదారిపై సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వాహనదారులతో సందడి నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. హైదరాబాద్ నుంచి ఏపీ వైపు భారీగా వాహనాలు వెళ్లాయి. నిన్నటి (శుక్రవారం) సాయంత్రం నుంచే రద్దీ మొదలైంది.
హైదరాబాద్, జనవరి 11: సంక్రాంతి పండుగ (Sankranti Festival) సందర్భంగా హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. సాధారణ రోజుల్లో 30 నుంచి 35 వేల వాహనాల రాకపోకలు సాగిస్తుండగా పండుగ నేపథ్యంలో ఎనిమిది వేల వాహనాలు అదనంగా సాగిస్తున్నాయి. నల్గొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. హైదరాబాద్ - విజయవాడ 65వ జాతీయ రహదారిపై సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వాహనదారులతో సందడి నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. హైదరాబాద్ నుంచి ఏపీ వైపు భారీగా వాహనాలు వెళ్లాయి. నిన్నటి (శుక్రవారం) సాయంత్రం నుంచే రద్దీ మొదలైంది. ఈరోజు ఉదయం 8:30 గంటల వరకు పెద్ద ఎత్తున వాహనాలు హైదరాబాద్ నుంచి ఏపీ వైపు వాహనాలు తరలివెళ్లాయి.
నిన్న సాయంత్రం నుంచి ఈరోజు వరకు 70 వేలకు పైగా వాహనాలు సొంతూళ్లకు వెళ్లారు. పంతంగి టోల్‌ప్లాజ్ వద్ద మొత్తం 16 బూతులకు గాను పది బూతులు ఏపీ వైపుకు, 6 బూతులను హైదరాబాద్ వైపు తెరచి ఉంచారు. అలాగే నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్‌ప్లాజా వద్ద ఉన్న 12 బూతులలో ఏడు ఏపీ వైపు, ఐదు హైదరాబాద్ వైపు తెరిచి ఉంచారు. ఆదివారం సాయంత్రం వరకు హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున వాహనాలు ఏపీకి తరలివెళ్లనున్నాయి. సంక్రాంతిని పురస్కరించుకుని 11 నుంచి 19 వరకు స్కూళ్లకు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఉన్న నేపథ్యంలో ప్రజలు సంక్రాంతి పండుగను పల్లెల్లో జరుపుకునేందుకు సొంత వాహనాల్లో, బస్సుల్లో తరలివెళ్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్ నుంచి చౌటుప్పల్ మండలం దండిమల్కపూరం చేరే వరకు దాదాపు గంట సమయం పడుతోంది. దండిమల్కపురం వరకు ఆరులైన్ల రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. అలాలే మల్కాపురం నుంచి ఏపీ నందిగామ వరకు 17 బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి రోడ్డు మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని ఎన్‌హెచ్‌ఏ అధికారులు సూచిస్తున్నారు. టోల్‌ప్లాజా వద్ద మూడు సెకన్ల కంటే ఎక్కువగా వాహనాలు నిలిచిపోకుండా టోల్‌ప్లాజా నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫాస్టాగ్‌లో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే హ్యాండ్ మిషన్ గన్‌లను కూడా అందుబాటులో ఉంచుకున్నారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టోల్‌ప్లాజ్ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అయితే ఎక్కువగా హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ఎక్కువ వాహనాలు వస్తున్న నేపథ్యంలో ఏపీలో గుంటూరు, నెల్లూరు, ఒంగోలుకు వెళ్లే వారు నాగార్జున సాగర్‌వైపు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే వాహనదారులు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రధాన వారధిగా ఉన్న హైదరాబాద్ - విజయవాడ 65 జాతీయ రహదారిపైనే రాకపోకలు కొనసాగిస్తున్న నేపథ్యంలో పంతంగి, కొర్లపాడు టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి...
దేవుడా.. నీకు మనసెలా వచ్చిందయ్యా..
Read Latest Telangana News And Telugu news
Updated Date - Jan 11 , 2025 | 09:56 AM