Share News

Saraswati Pushkaralu: సరస్వతి పుష్కరాలు.. ఎప్పటి నుంచంటే..

ABN , Publish Date - Apr 15 , 2025 | 06:53 PM

Saraswati Pushkaralu: ఈ ఏడాది సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకోసం రూ. 35 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే ఈ పుష్కరాలకు సంబంధించిన వెబ్ పోర్టల్‌తోపాటు పోస్టర్‌ను మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు.

Saraswati Pushkaralu: సరస్వతి పుష్కరాలు.. ఎప్పటి నుంచంటే..
TG Minister Konda Surekha

హైదరాబాద్, ఏప్రిల్ 15: ఈ ఏడాది సరస్వతి నది పుష్కరాలు జరగనున్నాయి. ఇది మే 15 నుంచి 26వ తేదీ వరకు ఈ పుష్కరాలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సరస్వతి పుష్కరాల వెబ్ పోర్టల్‌ను తెలంగాణ దేవాయదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. పుష్కరాలకు సంబంధించిన పోస్టర్‌ను ఆమె విడుదల చేశారు. అలాగే ఈ పుష్కరాల యాప్‌ను మంత్రి శ్రీధర్ బాబు విడుదల చేశారు. అనంతరం మంత్రి కొండా సురేఖ విలేకర్లతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం యాదగిరి గుట్ట మినహా మిగతా దేవాలయాలను నిర్లక్ష్యం చేసిందంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు.

తమ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. దేవాలయాల వద్ద భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. రూ. వంద కోట్లు దాటిన ఆలయాలను పాలక మండలి కిందకు తీసుకువస్తామని ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. అలాగేటెంపుల్ టూరిజం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగానే ఈ సరస్వతి పుష్కరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పుష్కరాల సందర్భంగా రూ. 35 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని వివరించారు. ఇక 17 అడుగుల సరస్వతి విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. పుష్కరాలు జరిగే 12 రోజులపాటు కాశీ నుంచి వచ్చిన పండితులతో ప్రత్యేక హోమాలు, హారతి నిర్వహిస్తామని తెలిపారు.


ఇక ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణలో కాళేశ్వరం త్రివేణి సంగమని గుర్తు చేశారు. గోదావరి, ప్రాణహితతో కలిసి సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని వివరించారు. 2013లో సరస్వతి పుష్కరాలు జరిగాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సారి కూడా ఈ పుష్కరాలను చాలా గొప్పగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గురువు మిధున రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ సరస్వతి పుష్కరాలు వస్తాయన్నారు.


ఈ పుష్కరాలకు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ నుంచి భారీగా భక్తులు తరలి వస్తారన్నారు. ప్రతీ రోజు లక్ష మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తుందని చెపారు. ఈ పుష్కరాల కోసం సీఎం రేవంత్ రెడ్డి రూ. 35 కోట్లు విడుదల చేశారన్నారు. ఈ పుష్కరాల కోసం వచ్చేసే భక్తుల కోసం వంద పడకల టెంట్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. కాశీ నుంచి వచ్చే పురోహితులతోపాటు స్థానిక పురోహితులు కలిసి ప్రత్యేక హారతి, హోమాలు నిర్వహిస్తారని వివరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ రూ. 3 కోట్లతో బస్ షెల్టర్ నిర్మాణానికి నిధులు కేటాయించారన్నారు.


కంచ గచ్చి బౌలి భూములపై ప్రధాని వ్యాఖ్యలు స్పందించిన మంత్రి..

అంతకుముందు అంటే.. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రేవంత్ రెడ్డి సర్కార్ అనుసరించిన వైఖరిపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు తనదైన శైలిలో స్పందించారు. కంచ గచ్చిబౌలిలోనివి హెచ్‌సీయూ భూములు కాదని.. అవి ప్రభుత్వ భూములని ఆయన స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు సైతం తీర్పు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.

అయితే ఈ భూముల వ్యవహారంపై ప్రధాని మోదీకి సరైన సమాచారం ఇవ్వలేదంటూ రాష్ట్ర బీజేపీ నేతలపై మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ అంటే తమకు గౌరవం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికైనా పూర్తి స్థాయి సమాచారంతో ప్రధాని మోదీ మాట్లాడతారని తాము భావిస్తున్నామన్నారు. ఇక అక్కడ ఉన్న భవనాలకు మున్సిపల్ శాఖ అనుమతి లేదని గుర్తు చేశారు. కానీ ప్రభుత్వ భూమి 400 ఎకరాల్లో భవనాలు నిర్మించారని.. వాటిని 2022లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారని వివరించారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి పేరిట పర్యావరణాన్ని సైతం పక్కన పెట్టి భూములు కేటాయించారని.. ఆ విధంగా ఎన్ని చెట్లు నరికేశారనేది తాము చూపెడుతామని మంత్రి డీ. శ్రీధర్ బాబు తెలిపారు.


వన్య ప్రాణాలకు సంబంధించి ఆ ప్రాంత పర్యావరణంపై అనేకమంది అనుమానాలు వ్యక్తం చేసినా.. ఎవరి మాట వినకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముందుకెళ్లారని.. కానీ తాము ఆ విధంగా చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. 400 ఎకరాలు భూమి సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా అది ప్రభుత్వ భూమి అని ఆయన పేర్కొన్నారు. కంచ అంటే పశువులకు గడ్డికి సంబంధించి భూమి అది అని ఆయన వివరించారు. ఈ భూమంతా రికార్డుల ప్రకారం ఉందని.. అంతే ఫారెస్ట్ అక్కడ ఎక్కడి నుండి వచ్చిందని ప్రశ్నించారు.

అనేక సంవత్సరాలుగా అక్కడ నిర్మాణాలు లేక పోవడం వల్ల చెట్లు మొలిచాయని చెప్పారు. దానిని అటవీ ప్రాంతంగా.. అది కూడా ప్రధాని మోదీ పేర్కొనడం చాలా దురదృష్టకరమని ఆయన అభివర్ణించారు. ఇక్కడ జరుగుతోన్న అభివృద్ధిని అడ్డుకోవాలని బీజేపీ ప్రజా ప్రతినిధులు బురద చల్లుతున్నారని విమర్శించారు. అందులోభాగంగానే తప్పుడు సమాచారాన్ని వారు ప్రధానికి అందిస్తున్నారని ఆరోపించారు. పెద్దలు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే తాము గౌరవిస్తామని స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిన ఫోటోలు, సోషల్ మీడియా గ్రూపులు చూపించడం జరిగిందని ఆయన వివరించారు. కోర్టులోని అంశంపై ప్రధాని మాట్లాడటం దాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి..

National Herald Case: ఈడీ ఛార్జ్‌షీట్లో సోనియా, రాహుల్ పేర్లు

BRS MLA: ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ వ్యాఖ్యలపై స్పందించిన కొత్త ప్రభాకర్ రెడ్డి

Farmers: దేశ ప్రజలకు అదిరిపోయే వార్త

Errabelli Dayakar Rao: అలా అయితే.. రాజకీయాల నుంచి తప్పుకొంటా..

PM Modi: ఏపీకి ప్రధాని మోదీ.. ఎప్పుడంటే..

వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ

For Telangana News And Telugu News

Updated Date - Apr 15 , 2025 | 07:02 PM