Hyderabad: స్నేహితుడిని కలిసేందుకు జైలు లోపలికి వెళ్లిన యువకులు.. తిక్క పని చివరికి..
ABN , Publish Date - Apr 14 , 2025 | 05:45 PM
హైదరాబాద్ నగరానికి చెందిన అహ్మద్ బిన్ హసన్ అల్ జాబ్రీ అనే యువకుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ కేసులో అరెస్టు చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు.

హైదరాబాద్: సోషల్ మీడియా వచ్చిన తర్వాత వెర్రి వేషాలు, వింత చేష్టలు ఎక్కువైపోతున్నాయి. ఫేమస్ అవ్వాలనే మోజులో పడి తిక్క పనులు చేస్తున్నారు. ప్రజల మధ్య కొంతమంది యువకులు బైక్ స్టంట్స్ చేస్తూ ఆ వీడియోలను యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వాటిల్లో పోస్ట్ చేస్తుంటే.. మరికొంతమంది విచిత్రంగా ప్రవర్తిస్తూ నలుగురితో తిట్లు తింటున్నారు. అయితే ఇవన్నీ బోర్ కొట్టిన హైదరాబాద్ యువకులు కొత్తగా ట్రై చేసి చిక్కుల్లో పడ్డారు. వారు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భయంతో వణికిపోతున్నారు.
హైదరాబాద్ నగరానికి చెందిన అహ్మద్ బిన్ హసన్ అల్ జాబ్రీ అనే యువకుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ కేసులో అరెస్టు చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలో నిందితుడి స్నేహితులు అతన్ని కలవాలని అనుకున్నారు. ఈ మేరకు నిబంధనలు అనుసరించి ములాఖత్ అనుమతి తీసుకున్నారు. జైలు లోపలికి వెళ్లి అతనితో మాట్లాడారు. ఇందులో ఏముందని అనుకుంటున్నారా? ఇక్కడ ఉంది అసలు ట్విస్ట్. వారంతా జైలు నిబంధనలు ఉల్లఘించారు. జైలు సిబ్బంది కళ్లు కప్పి దొంగచాటుగా మొబైల్ ఫోన్ తీసుకెళ్లారు.
సరదాగా స్నేహితుడి(ఖైదీ)తో మాట్లాడుకుని ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో అది కాస్త వైరల్‌గా మారింది. జైలు ములాఖత్ గది వద్ద కట్టుదిట్టమైన భద్రత, పటిష్ట నిఘా ఉన్నప్పటికీ వారంతా ఫోన్ ఎలా తీసుకెళ్లారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. జైలు భద్రతా వ్యవస్థపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు ఇంకా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి:
Visakhapatnam: మరో 24 గంటల్లో డెలివరీ కానున్న భార్య.. భర్త ఎంత దారుణానికి ఒడికట్టాడో..
PM Narendra Modi: కంచ గచ్చిబౌలి భూములు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ..