Supreme Court: సుప్రీంకోర్టులో కేటీఆర్‌కు చుక్కెదురు
ABN, Publish Date - Jan 15 , 2025 | 12:22 PM
Supreme Court: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఫార్ములా ఈ రేసు కేసులో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది.
న్యూఢిల్లీ, జనవరి 15: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు (Former minister KTR) సుప్రీం కోర్టులో (Supreme Court) చుక్కెదురైంది. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. దీంతో క్వాష్ పిటిషన్‌ను కేటీఆర్ వెనక్కి తీసుకున్నారు. ఫార్ములా ఈ కార్ రేసులో హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేస్తూ కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను వేశారు. దీనిపై ఈరోజు (బుధవారం) సుప్రీం ధర్మాసనం ముందు విచారణకు రాగా.. కాసేపటి క్రితమే వాదనలు ముగిశాయి. అయితే ఈ వ్యవహారంలో సుప్రీంలో కేటీఆర్‌కు నిరాశే ఎదురైంది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది.
విచారణలో భాగంగా కేటీఆర్ తరపున న్యాయవాది సిదార్థ వాదనలు వినిపించారు. ఈ ఫార్ములా కారు రేసు కేసులో హెచ్‌ఎండీఏను, ఇతరులను పేర్కొనలేదని కేవలం ఇద్దరు అధికారులను, కేటీఆర్‌ను మాత్రమే నిందితులుగా చేర్చారని కోర్టు ముందు ప్రస్తావించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపు కేసు అని.. కేటీఆర్ ఒక్క రూపాయి తీసుకున్నారని ఎవరూ చెప్పడం లేదని న్యాయవాది తెలిపారు. ఇలాంటప్పుడు అవినీతి నిరోధక చట్టంలోని 13(1)ఏ ఎలా వర్తిస్తుందని.. ఇందులో పీసీ యాక్ట్ 13(1A) వర్తించనే వర్తించదని కేటీఆర్ తరపు న్యాయవాది వాదించారు. వెంటనే జోక్యం చేసుకున్న జస్టిస్ బేలా త్రివేది.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఎలాంటి జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. దీంతో ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో కాస్త ఊరట లభిస్తుందని భావించిన కేటీఆర్‌కు ఎదురుదెబ్బే తగిలింది. సుప్రీం నిర్ణయంతో ఈ కేసులో ఏసీబీకి మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది.
అయితే కేటీఆర్ కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంలో కేవియట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఒకవేళ కేటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే.. విచారణ సందర్భంగా ముందు తమ వాదనలు వినాలని తెలంగాణ ప్రభుత్వం కేవియట్ పిటిషన్‌ను ముందస్తుగానే దాఖలు చేసింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ నిరాకరణకు గురైనప్పటికీ.. సుప్రీం స్టే విధిస్తుందని కేటీఆర్ భావించినట్లు తెలుస్తోంది. కానీ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌లో తాము జోక్యం చేసుకునేది లేదని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పడంతో ఏసీబీ మరోసారి నోటీసులు ఇస్తే ఆ విచారణకు కేటీఆర్ ఖచ్చితంగా హాజరుకావాల్సి ఉంటుంది. గతంలో ఈ కేసుకు సంబంధించి కేటీఆర్‌ను దాదాపు ఎనిమిది గంటల పాటు ఏసీబీ విచారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీం కోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయిన నేపథ్యంలో.. మాజీ మంత్రి అరెస్ట్ తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా.. ఈ కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌తో పాటు, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్‌ను ఈడీ, ఏసీబీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. వీరి నుంచి పలు కీలక సమాచారాన్ని ఏసీబీ, ఈడీ అధికారులు రాబట్టినట్లు తెలుస్తోంది.
Updated Date - Jan 15 , 2025 | 01:04 PM