Supreme Court: సెలవుల్లో బుల్డోజర్లు దింపాల్సిన అవసరం ఏంటి.. సర్కార్‌కు సుప్రీం సూటి ప్రశ్న
ABN , Publish Date - Apr 16 , 2025 | 11:50 AM
Supreme Court: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంలో విచారణ జరుగగా.. ప్రభుత్వంపై ధర్మాసనం సీరియస్ అయ్యింది. అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని జస్టిస్ గవాయ్ హెచ్చరించారు.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో (Supreme Court) ఈరోజు (బుధవారం) విచారణ ప్రారంభమైంది. జస్టిస్ బీఆర్ గవాయ్ నేత్రత్వంలోని ద్విసభ్య ధర్మాసనం దీన్ని విచారించింది. చెట్లు కొట్టేసి ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని విచారణలో జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలన్నారు. అయితే అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు, పొదలను తొలగించినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టుకు చెప్పారు. తెలంగాణలో వాల్టా చట్టం అమలులో ఉందని, దాని ప్రకారం స్వయం అనుమతులుగా ప్రభుత్వం వ్యవహరించిందని అమికస్ క్యూరీ సుప్రీంకు వివరించారు. అనుమతులు తీసుకున్నారా లేదా అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని జస్టిస్ గవాయ్ హెచ్చరించారు.
జస్టిస్ గవాయ్: చీఫ్ సెక్రటరీని కఠినమైన చర్య నుంచి కాపాడాలనుకుంటే, ఆ వంద ఎకరాలను ఎలా పునరుద్ధరించాలో ఒక ప్రణాళికతో ముందుకు రావాలి. 1996 డిసెంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏమాత్రం వ్యవహరించినా చూస్తూ ఊరుకోం. మూడు రోజుల సెలవుల్లో అలా చేయడానికి అంత తొందర ఏమిటి? ఆ సెలవుల్లోనే బుల్డోజర్లు తీసుకొచ్చారు. పర్యావరణాన్ని కాపాడటానికి మేము ఇక్కడ ఉన్నాం. అధికారుల అనుమతి లేకుండా ఎన్ని చెట్లను నరికివేశారో అనే ఆందోళన మాత్రమే ఉంది. చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలి. మేము బుల్డోజర్ ఉనికి, 100 ఎకరాల అడవిని తొలగించడం గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నాం. మీరు నిర్మించాలనుకుంటే, మీరు అనుమతులు తీసుకొని ఉండాలి అని జస్టిస్ అన్నారు.
అమికస్ క్యూరీ: రూ.10 వేల కోట్లకు మార్టిగేజ్ చేశారని సీఈసీ నివేదికలో చెప్పిందన్నారు.
జస్టిస్ గవాయ్: భూములను మార్టిగేజ్ చేశారా లేదా, అమ్ముకున్నారో లేదో తమకు అనవసరం. చెట్లు కొట్టేసే ముందు అనుమతి ఉందా లేదా అనేది ముఖ్యం.
అభిషేక్ మను సింఘ్వి: 2004 నుంచి ఈ భూముల వ్యవహారం, కోర్టుల్లో ఉన్న పరిస్థితి, తర్వాత చుట్టుపక్కల జరిగిన అభివృద్ధి, ఐటి పార్కు, ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన వివారలను కోర్టుకు చెప్పారు.
జస్టిస్ గవాయ్: వంద ఎకరాల్లో జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలన్న విషయం పైనే మేము దృష్టి సారించాలని అంటున్నాం.
Saraswati Pushkaralu 2025: తెలంగాణలో పుష్కరాలకు వేళాయె.. ప్రత్యేక మొబైల్ యాప్ మీకోసమే
నిరంజన్ రెడ్డి: వంద ఎకరాల్లో జంతువులకు తీవ్ర నష్టం జరుగుతుంది. సీఎస్ ఫైల్ చేసిన అఫిడవిట్ చూస్తే ఆశ్చర్యంగా ఉందిం. వంద ఎకరాలు మార్టిగేజ్ చేసి, చెట్లు కొట్టేసి ఇప్పుడు పర్యావరణ హితమైన ఐటి పార్క్ అని చెబుతున్నారు.
జస్టిస్ గవాయ్: పర్యావరణ పరిరక్షణ కోసం ఏమైనా చేస్తాం.ఆ భూముల్లో ఉన్న జంతుజాలాన్ని ఎలా సంరక్షిస్తారో చెప్పాలి.
అమికస్ క్యూరీ: సీఈసీ నివేదికలో మార్టిగేజ్ వ్యవహారం స్పష్టంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 144 సెక్షన్ పెట్టినా ఈ భూములను వెంటనే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి అప్పజెప్పాలి.
జస్టిస్ గవాయ్: మార్టిగేజ్ వ్యవహారం తమకు సంబంధం లేదు. పర్యావరణ అనుమతులు ఉన్నాయా లేదా. 1996 మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా. దెబ్బతిన్న పర్యావరణాన్ని ఎలా పునరుద్దరిస్తారో అనే విషయం మాకు ప్రధానం. మిగిలిన వ్యవహారాలతో తమకు సంబంధం లేదు. ఆర్టికల్ 142 కింద పర్యావరణ పరిరక్షణ కోసం ఏమైనా చేస్తాం. పునరుద్ధరణను అడ్డుకునే ప్రయత్నం చేస్తే, మీ అధికారులను తాత్కాలికంగా జైలుకు పంపిస్తాం. ఈ మధ్యకాలంలో అక్కడ ఒక్క చెట్టైనా కొట్టరాదు. బుల్డోజర్లు తొలగించబడ్డాయా? అని జస్టిస్ ప్రశ్నించారు.
100 ఎకరాల్లో జరిగిన నష్టం కారణంగా ప్రభావితమైన వన్యప్రాణులను రక్షించేందుకు అవసరమైన తక్షణ చర్యలను పరిశీలించి, అమలులోకి తీసుకురావాలని తెలంగాణ వన్యప్రాణి సంరక్షణాధికారిని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. పునరుద్ధరణ ఎలా చేస్తారు, ఎంత కాలంలో చేస్తారు, జంతు జలాన్ని ఎలా సంరక్షిస్తారో స్పష్టంగా చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. నాలుగు వారాల్లో ప్రణాళిక ఫైల్ చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ధర్మాసనం. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి విచారణను మే 15కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి
Illegal immigrants: అక్రమ వలసదారులకు ట్రంప్ బంపరాఫర్..
Gold Locket: శబరిమల తొలి గోల్డ్ లాకెట్ దక్కించుకున్న ఆంధ్రా వాసి..
Read Latest Telangana News And Telugu News