Share News

HCU Land:హెచ్‌సీయూ భూములు.. హైకోర్టు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Apr 02 , 2025 | 05:06 PM

HCU Land: హెచ్‌సీయూ భూములను జాతీయ ఉద్యానవనంగా మార్చాలంటూ వట ఫౌండేషన్, సదరు యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. అందులోభాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.

HCU Land:హెచ్‌సీయూ భూములు.. హైకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్, ఏప్రిల్ 02: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూములపై విచారణను తెలంగాణ హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. సదరు భూముల్లోని చెట్లను గురువారం వరకు కొట్టివేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కంచ గచ్చిబౌలి భూ వివాదంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరఫు సీనియర్ కౌన్సిల్ రవిచంద్.. తన వాదనలు వినిపించారు. జీవో 54ను రద్దు చేయాలని కోరుతూ వాదనలు జరిగాయి. వట ఫౌండేషన్ తరఫున సీనియర్ లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆ క్రమంలో నిబంధనలకు విరుద్దంగా టీజీఐఐసీకి భూములు అప్పగించారని తెలిపారు.

వట ఫౌండేషన్, హెచ్‌సీయూ విద్యార్థులు..

ఈ భూములపై వట ఫౌండేషన్, హెచ్‌సీయూ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. సదరు భూమిని జాతీయ ఉద్యానవనంగా గుర్తించాలని పిటిషనర్లు.. తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో హైకోర్టు విచారణ చేపట్టింది.


న్యాయవాది రవిచందర్..

ఆ క్రమంలో న్యాయవాది రవి చందర్ తన వాదనలు వినిపించారు. గత ఏడాది అంటే 2024, జూన్‌లో ప్రభుత్వం 54 జీవో తీసుకొచ్చిందని తెలిపారు. ఈ జీవోలో 400 ఎకరాల ప్రభుత్వ భూమిని టీజీఐఐసీకి ఇచ్చినట్లు వెల్లడించారన్నారు. ఒక వేళ ఆది ప్రభుత్వ భూమి అయినా సుప్రీం కోర్టు తీర్పుకు లోబడే ప్రభుత్వాలు పని చేయాలని పేర్కొన్నారు. సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని కొట్టి వేయాలంటే ముందుగా ఎక్స్‌పర్ట్స్ కమిటీ వేయాల్సి ఉంటుందని గుర్తు చేశారు.


అయితే గత కొన్ని రోజులుగా ఈ భూముల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. భారీ వాహనాలు, పెద్ద పరికరాలను వినియోగించి చెట్లను కొట్టేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ హైకోర్టు దృష్టికి న్యాయవాది రవిచందర్ తీసుకు వెళ్లారు.


అలాగే ఈ చర్యలను అడ్డుకొని.. నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. పోలీసులను వినియోగించి.. ప్రభుత్వం ఈ భూమిలో పనులు చేయిస్తుందని చెప్పారు. ఆ క్రమంలో నిబంధనలు ఉల్లంగిస్తూ పనులు నిర్వహిస్తున్నారని హైకోర్టుకి ఆయన వివరించారు.


వట ఫౌండేషన్..

ఇక వట ఫౌండేషన్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి.. హైకోర్టుకు తన వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం భూములను టీజీఐఐసీకి అప్పగించిందన్నారు. 2003లో 400 ఎకరాలను అప్పటి ప్రభుత్వం ఐఎంజీ అకడమిక్ భారత్‌కు విక్రయించారని వివరించారు. అంటే.. 5-8-2003లో నాడు ఎకరా భూమిని రూ. 50 వేలకు విక్రయించారని తెలిపారు. ఆ సమయంలో ఒక ఎకరం భూమి రూ. 26 లక్షలు విలువ ఉంటే.. కేవలం రూ. 50 వేలకు విక్రయించారని హైకోర్టు దృష్టికి ఆయన తీసుకు వెళ్లారు.


ఇక 2006లో ప్రభుత్వం మారగానే ఈ భూముల విక్రయం.. నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని.. ఈ నేపథ్యంలో వాటిని వెనక్కి తీసుకుందని తెలిపారు. నాటి నుంచి ఐఏంజీ భారత్ కోర్టులో ఈ భూమి కోసం పోరాడుతుందని గుర్తు చేశారు. ఐఏంజీ కేసులో ఇప్పటి వరకు ఈ భూమి ఫారెస్ట్ ఏరియా అని ఒక్క వాదన కూడా జరగలేదని .. ఈ విషయాన్ని గమనించాలని హైకోర్టును ఆయన కోరారు. అలాగే ఈ భూమి ఎక్కడా ఫారెస్ట్ ఏరియాగా ప్రభుత్వం నోటిఫై చేయలేదన్నారు.


ఇక గూగుల్ మ్యాప్‌లో మాన్సన్ ఏరియా బట్టీ ఫారెస్ట్ ఏరియాగా కనిపిస్తుందని కోర్టుకు తెలిపారు. ఇది కేవలం ఇండస్ట్రీ భూమి మాత్రమేనని.. ఇది ఫారెస్ట్ ఏరియా మాత్రం కానే కాదని ఆయన వివరించారు. ఇక్కడ హెలిప్యాడ్‌లు సైతం నిర్మించారని గుర్తు చేశారు. డిఫెన్స్ మినిస్టర్ వచ్చినా ఇక్కడే హెలికాప్టర్ ల్యాండ్ అవుతుందని కోర్టుకు ఆయన విన్నవించారు.


ఈ వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. గురువారం మధ్యాహ్నం 2.15 గంటలకు ఈ కేసును విచారిస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గురువారం వరకు ఆ భూమిలో ఎటువంటి చెట్లు నరకవద్దని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఇవీ చదవండి:

రాబడికి నూతన మార్గాలు

యువకుడిపై పెట్రోల్‌ పోసి..

ఇందిర ఆశయాలు తుంగలోకి.. ప్రొఫెసర్లు సీరియస్

జగన్‌పై ఆగ్రహం.. ఉప్పల్ స్టేడియం ముట్టడి

వక్ఫ్‌బోర్డు బిల్లుకు మద్దతు ఇవ్వండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 02 , 2025 | 05:06 PM