Mahesh Kumar Goud: మోదీ, అమిత్ షా అనుమతి లేకుండా బండి సంజయ్ టిఫిన్ కూడా చెయ్యరు: మహేశ్ కుమార్ గౌడ్
ABN, Publish Date - Apr 06 , 2025 | 03:12 PM
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు కేంద్రమంత్రికి కౌంటర్ ఇస్తూ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుమతి లేకుండా కేంద్ర మంత్రి బండి సంజయ్ కనీసం టిఫిన్ కూడా చెయ్యరని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కేంద్రమంత్రనే విషయం మర్చిపోయి దిగజారి మాట్లాడుతున్నారని, అమిత్ షా చెప్పులు మోసిన చరిత్ర బండి సంజయ్‌దంటూ మండిపడ్డారు. ఇవాళ (ఆదివారం) ఉదయం బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు మహేశ్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు, సన్న బియ్యం, హెచ్‌సీయూ భూములు, తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి ఆరోపణలు గుప్పించారు. ఈ మేరకు కౌంటర్ ఇస్తూ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
చెప్పులు మోసిన చరిత్ర నీది..!
ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. "బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా, చట్టబద్ధత కోసం వాటిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేలా ప్రధాని మోదీ ఒప్పించే దమ్ము బండి సంజయ్‌కు ఉందా?. ఢిల్లీ పెద్దలకు భయపడే తెలంగాణ బీజేపీ నేతలు బీసీల ధర్నాకు మొహం చాటేశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఢిల్లీ పెద్దలకు గులాం గిరి చేసిన పనులు మర్చిపోయావా బండి సంజయ్?. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి కేంద్ర మంత్రి చెప్పులు మోసిన చరిత్ర నీది. నోటికొచ్చింది మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. కాంగ్రెస్.. జాతీయ పార్టీ. ఏదైనా సమష్టి నిర్ణయాలు ఉంటాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల మాదిరిగానే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్‌తో బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకుంది.
బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే..
ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేకనే రహస్య మిత్రులు బీఆర్ఎస్‌తో చీకటి ఒప్పందం చేసుకున్నారు. బండి సంజయ్‌లో రోజురోజుకూ అభద్రతా భావం పెరిగిపోతోంది. మోదీ, అమిత్ షా అనుమతి లేకుండా బండి సంజయ్ కనీసం టిఫిన్ కూడా చెయ్యరు. సొంత పార్టీ కార్యకర్తలే ఆయన వైఖరిపై గుర్రుగా ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి రాదని తెలిసి సంజయ్ ఆగమాగం అయిపోతున్నారు. గుర్తింపు కోసమే తాను కేంద్రమంత్రినని మర్చిపోయి దిగజారి మాట్లాడుతున్నారు. బీజేపీలో ఉనికి కోసం ఆయన ఆరాట పడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి కేంద్రమంత్రికి కనిపించకపోవడం విడ్డూరం. సుదీర్ఘ కాలం గడిచినా బీజేపీ జాతీయ అధ్యక్షుడిని నియమించుకోలేని బీజేపీకి కాంగ్రెస్ హైకమాండ్ గురించి మాట్లాడే హక్కు లేదు.
రేవంత్ రెడ్డికి పూర్తి పట్టుంది..
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి పూర్తి పట్టు సాధించారు కాబట్టే బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులకు ఆమోదం లభించిందనే విషయం అవగాహన లేకుండా బండి సంజయ్ మాట్లాడుతున్నారు. హెచ్‌సీయూ అంశం ఉన్నత న్యాయస్థానం పరిధిలో ఉంది. ప్రభుత్వం కమిటీ సైతం వేసింది. రాజకీయ అవసరాల కోసం ఆయన మాట్లాడడం సమంజసం కాదు. మైనార్టీ హక్కుల కోసం నిలబడి వక్ఫ్ బోర్డు బిల్లుపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. కార్పొరేట్ సంస్థలను బెదిరించి నిధులు రాబట్టుకున్న బీజేపీ నంబర్ వన్‌గా నిలిచింది. సన్న బియ్యం కేంద్రం ఇస్తోందని బండి సంజయ్ ప్రచారం చేస్తున్నారు. అలా అయితే దేశం మెుత్తం ఇవ్వొచ్చు కదా?. సన్న బియ్యంతో తెలంగాణలో నిరుపేదలకు అసలైన పండగను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దేశ చరిత్రలో నిలిచిపోయే కులగణన, బీసీ బిల్లు, ఎస్సీ వర్గీకరణ, సన్న బియ్యంను కాంగ్రెస్ హయంలో అమలు అయ్యాయని" చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Harish Rao: ఉత్తర తెలంగాణకు అద్భుతమైన ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యం చేశారు
Bhadradri: కన్నుల పండువగా శ్రీ సీతారాముల కల్యాణం..
Updated Date - Apr 06 , 2025 | 03:15 PM