Hyderabad: వాహనదారులకు అలర్ట్.. ఈ మార్గం గుండా వెళ్తే చుక్కలే..
ABN , Publish Date - Mar 23 , 2025 | 11:11 AM
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌తో హైదరాబాద్ నగర వాసులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ఇవాళ సాయంత్రం ఉప్పల్, ఆ మార్గం గుండా వివిధ ప్రాంతాలకు వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు ఎదురుకానున్నాయి.

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పండగ ప్రారంభమైంది. సినీ ప్రముఖుల హంగామా, హీరోహీరోయిన్ల డ్యాన్స్ ప్రదర్శనలతో క్రికెట్ స్టేడియాలు హోరెత్తిపోతున్నాయి. సింగర్లు శ్రోతలను ఉర్రూతలూగిస్తుంటే.. క్రికెటర్లు భారీ షాట్‌లతో అభిమానులను కేరింతలు కొట్టిస్తున్నారు. అందుకు ఉదాహరణే శనివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) మధ్య జరిగిన మెుదటి మ్యాచ్. నేడు (ఆదివారం) రెండో మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఇవాళ మధ్యాహ్నం 03:30 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే రెండు టీమ్‌ల క్రికెటర్లు హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు.
అయితే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌తో హైదరాబాద్ నగర వాసులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ఇవాళ సాయంత్రం ఉప్పల్, ఆ మార్గం గుండా వివిధ ప్రాంతాలకు వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు ఎదురుకానున్నాయి. మ్యాచ్ ప్రారంభానికి ముందే అభిమానులు పెద్దఎత్తున స్టేడియం వద్దకు చేరుకోనున్నారు. దీంతో రద్దీ పెరిగిపోయి ఉప్పల్ సర్కిల్ దాటేందుకు గంటల కొద్దీ సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ, ఉపాధి రీత్యా ఉప్పల్‌కు చెందిన వారంతా వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో తిరిగి ఉప్పల్ మార్గం గుండా సాయంత్రం ఇంటికి వెళ్లాలంటే వారికి ప్రత్యక్ష నరకం కనిపించే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఎల్బీ నగర్-ఉప్పల్ మార్గం కిక్కిరిపోయే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరోవైపు యాదగిరి గుట్ట, వరంగల్‌కు వెళ్లే వారు సైతం ఉప్పల్ సర్కిల్ దాటాల్సి ఉంటుంది. దీంతో వారికీ ఇబ్బందులు ఎదురుకానున్నాయి. అయితే ఉప్పల్‌కి వెళ్లేవారు ప్రధాన రహదారులు కాకుండా వివిధ మార్గాల గుండా వెళ్తే ట్రాఫిక్ కష్టాల బారిన పడకుండా ఉంటారు. అలాగే స్టేడియానికి వెళ్లాలనుకునే వారూ ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలి. కాగా, పోలీసుల సైతం ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే స్టేడియం వద్ద ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి: