Hyderabad: అత్త మాస్టర్ ప్లాన్.. కోడలిని ఘోరంగా..
ABN, Publish Date - Jan 10 , 2025 | 10:53 AM
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రామాంజాపూర్‌తండాలో దారుణం చోటు చేసుకుంది. కల్లులో మత్తు కలిపి ఓ అత్త తనకోడలిని దారుణంగా హత్యచేసింది. ఆ తర్వాత ఓవ్యక్తి సాయంతో మృతదేహాన్ని సాతంరాయి..
శంషాబాద్, జనవరి 10: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రామాంజాపూర్‌తండాలో దారుణం చోటు చేసుకుంది. కల్లులో మత్తు కలిపి ఓ అత్త తనకోడలిని దారుణంగా హత్యచేసింది. ఆ తర్వాత ఓవ్యక్తి సాయంతో మృతదేహాన్ని సాతంరాయి పరిధిలో త్రిలోక్ వెంచర్‌లోని సెల్లార్‌లో పూడ్చిపెట్టింది. ఏమీ తెలియనట్లు కోడలు కనిపించడం లేదంటూ కొడుకుతోపాటు వెతుకుతున్నట్లు నటించి పోలీసులను తప్పుదోవ పట్టించింది. పోలీసులు తమదైన విచారణ చేయడంతో సుమారు రెండు నెలల తర్వాత కేసు మిస్టరీ వీడింది.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. శంషాబాద్ మండలం రామాంజాపూర్‌తండాలో ముడావత్ సురేశ్, ముడావత్ డోలి(35) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. అయితే, తన కొడుకును డోలీ వివాహం చేసుకోవడం ఇష్టంలేని అత్త తులసి తరచూ కోడలితో తగువు పడేది. కోడలితో సఖ్యత లేకపోవడంతో అత్తా మామలు తమ మకాంను సాతంరాయికి మార్చారు. ఇదిలా ఉంటే, సురేశ్ రోజూ తప్పతాగి వచ్చి తనను కొడుతున్నాడని అతని భార్య డోలీ అత్తామామలకు ఫిర్యాదు చేసేది. భార్య తనను వేధిస్తున్నదని సురేశ్ తన తల్లిదండ్రులకు తరచూ చెప్పేవాడు. దీంతో కోడలిని హత్య చేయడానికి అత్త తులసి పథకం పన్నింది. గతేడాది నవంబర్ 9న సురేష్ మద్యంతాగి వచ్చి తనను కొట్టాడని డోలీ అత్తకు చెప్పింది. దీంతో కోడలిని సాతంరాయికి రమ్మని, ఇక్కడే కూలీ పని చూపిస్తానని నమ్మబలికి ఆమెను రప్పించింది.
పథకం ప్రకారం డోలీ రాగానే ఆమెను దుకాణానికి తీసుకెళ్లి కల్లు తాగించింది. ఇంటికి వచ్చాక మరో రెండు సీసాల కల్లుతెప్పించి అందులో గుళికల మందు కలిపి తాగించడంతో డోలీ మృతి చెందింది. మృతదేహాన్ని మరో వ్యక్తి సహాయంతో త్రిలోక్ వెంచర్‌కు తీసుకెళ్లింది. అక్కడే సెల్లార్‌లో గోతితీసి పూడ్చిపెట్టింది. అయితే, భార్య కోసం రెండు రోజులపాటు చుట్టుపక్కల గ్రామాల్లో వెతికిన సురేశ్ నవంబర్ 11న శంషాబాద్‌రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేసు మిస్టరీగా మారుతుండడంతో అత్తపై అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించగా కోడలిని హత్య చేసి పాతిపెట్టిన విషయం తెలిపింది. దీంతో పోలీసులు త్రిలోక్ వెంచర్‌లో ఎక్స్‌కవేటర్‌తో తవ్వి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ హత్యకు ఎవరెవరు సహకరించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read:
దావోస్ పర్యటనకు వెళ్లనున్న సీఎం చంద్రబాబు
హైకోర్టులో హరీశ్‌రావు క్వాష్ పిటిషన్.. ఎందుకంటే
For More Telangana News and Telugu News..
Updated Date - Jan 10 , 2025 | 10:53 AM