CM Revanth Reddy: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

ABN, Publish Date - Feb 14 , 2025 | 05:08 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ యూత్ కాంగ్రెస్ నుంచే వచ్చారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. హనుమంతరావు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన సమయంలో వారిద్దరూ యూత్ కాంగ్రెస్‌లో పని చేశారని ఆయన చెప్పుకొచ్చారు.

CM Revanth Reddy: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Chief Minister Revanth Reddy

హైదారాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అగ్ర రాజకీయ నేతలంతా యూత్ కాంగ్రెస్ (Youth Congress) నుంచే వచ్చారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR) సైతం యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వారేనని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ యువజన కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా జక్కిడి శివచరణ్ (Jakkidi Shivacharan) ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్ గాంధీ భవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో శివచరణ్ బాధ్యతలు స్వీకరించారు.


హనుమంతరావు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు, కేసీఆర్ యూత్ కాంగ్రెస్‌లో పని చేశారని ముఖ్యమంత్రి రేవంత్ గుర్తు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా అక్కడ్నుంచే వచ్చారని పేర్కొన్నారు. రాజకీయాలకు యూత్ కాంగ్రెస్ అనేది మొదటిమెట్టని ఆయన చెప్పుకొచ్చారు. పదవులు వచ్చినా, రాకపోయినా కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉండాలని సూచించారు.


ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.."తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. పేదల ఆత్మగౌరవం కోసం ఇళ్లు కట్టిస్తున్నాం. డబుల్‌ బెడ్‌రూమ్‌ పేరుతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలను మోసం చేశారు. ఆయన మోసం చేశారు కాబట్టే ప్రజలు మనకు అధికారం ఇచ్చారు. స్థానిక సంస్థల్లో యూత్‌ కాంగ్రెస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. పార్టీ కోసం పనిచేసే వారికే పదవులు ఇస్తాం. ఫ్లెక్సీలు కట్టి దండాలు పెట్టేవారికి పదవులు రావు. ఢిల్లీ నుంచి కాదు.. గల్లీ నుంచి వచ్చిన వారికే పదవులు ఇస్తాం. దేశంలోనే ఎవరూ చేయనంత రుణమాఫీ తెలంగాణ రైతాంగానికి చేశాం.


భూమి లేని వారికీ రూ.12 వేలు ఇస్తున్నాం. 55 వేల ఉద్యోగాలు భర్తీ చేసి చూపించాం. ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలను యూత్ కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎన్నికల్లో డబ్బుతో ఎవరూ గెలవలేరు. మేము ప్రజాభిమానంతో గెలిచాం. డబ్బులే గెలిపిస్తాయంటే కేసీఆర్‌కు 100 సీట్లు వచ్చి ఉండేవి. కొడితే గట్టిగా కొడతామని కేసీఆర్‌ అంటున్నారు. కేసీఆర్‌ను కొట్టాలంటే కేటీఆర్‌, కవిత, హరీశ్‌నే కొట్టాలి. కేసీఆర్‌ను కేటీఆర్‌ ఓడించారు, కేజ్రీవాల్‌ను కవిత ఓడించింది. కల్వకుంట్ల కుటుంబం అవినీతి చూసే ప్రజలు బుద్ధి చెప్పారు. దేశంలో కులగణన చేసిన ఏకైక ప్రభుత్వం మాది.


కులగణన, ఎస్సీ వర్గీకరణపై పక్కాగా చేసిన మా లెక్కను తప్పంటారా. కేసీఆర్‌ ఒక్క రోజే సర్వే చేసి కాకిలెక్కలు చూపించారు. చెట్ల మీద విస్తరాకులు కుట్టినట్టుగా గతంలో సర్వే చేశారు. తెలంగాణలో జీవించే హక్కు కేసీఆర్‌కు లేదు. గ్యాంబ్లర్స్‌ అంతా బీఆర్ఎస్‌లోనే ఉన్నారు. కులాల లెక్కలు ఎప్పటికీ తేలకూడదనే ఆ పార్టీ నేతలు పన్నాగం పన్నుతున్నారు. కేసీఆర్ లాంటి వాళ్లు తెలిసి, బలిసి సర్వేలో పాల్గొనలేదు. జనాభా లేకపోయినా రావులంతా పదవులు పంచుకున్నారు. బీసీలు ఆ లెక్కలు అడుగుతారనే అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన నా కోసం కాదు.. క్రమశిక్షణ కలిగిన సీఎంగా కులగణన చేయిచాం. దొంగ లెక్కలు చెప్పాలనుకుంటే మా కులాన్ని ఎక్కువ చూపించేవాళ్లం. బీసీ కులగణనకు రెండో విడత కూడా అవకాశం ఇచ్చాం.


ప్రధాని నరేంద్ర మోదీ బీసీ కాదు.. లీగల్లీ కన్వర్టెడ్‌ బీసీ. 2002 వరకు మోదీది ఉన్నత వర్గమే. ఆయన గుజరాత్ సీఎం అయ్యాక తన కులాన్ని బీసీల్లో కలిపారు. అన్నీ తెలుసుకునే మోదీ కులం గురించి మాట్లాడుతున్నా. కులగణన సర్వేలో పాల్గొనని కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావును సామాజిక బహిష్కరణ చేయాలని తీర్మానం చేశాం. లెక్కల్లో పాల్గొనాలని కేసీఆర్‌, కేటీఆర్‌ ఇళ్ల ముందు డప్పు కొట్టండి" అని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Kishan Reddy: కాంగ్రెస్ ఓటమి ఖాయం.. వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే

Hairsh Rao: గుమ్మడిదలను మరో లగచర్ల చేయొద్దు..

Updated Date - Feb 14 , 2025 | 06:02 PM