Singareni: ఇల్లు కట్టు.. పరిహారం కొట్టు

ABN, Publish Date - Mar 18 , 2025 | 05:23 AM

సింగరేణి ఓపెన్‌కా్‌స్ట గనుల విస్తరణ అక్రమార్కులకు వరంగా మారింది. కోల్‌బెల్ట్‌లో గనుల కోసం ఎక్కడ భూ సేకరణ జరిగినా.. కేటుగాళ్లు వాలిపోతున్నారు.

Singareni: ఇల్లు కట్టు.. పరిహారం కొట్టు
  • భూపాలపల్లి ఓసీపీ-3 విస్తరణకు భూ సేకరణ

  • ప్రభావిత పల్లె కొండంపల్లిపై అక్రమార్కుల కన్ను

  • కొత్తగా ఇళ్ల నిర్మాణం.. పరిహారంగా రూ.లక్షలు కొట్టేసే ప్లాన్‌

  • కేటుగాళ్లకు అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలు

  • గుడి, బడి స్థలాలకూ ఛోటా నేతల ఎసరు.. ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలన

భూపాలపల్లి, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): సింగరేణి ఓపెన్‌కా్‌స్ట గనుల విస్తరణ అక్రమార్కులకు వరంగా మారింది. కోల్‌బెల్ట్‌లో గనుల కోసం ఎక్కడ భూ సేకరణ జరిగినా.. కేటుగాళ్లు వాలిపోతున్నారు. రాత్రికి రాత్రే తాత్కాలికంగా ఇళ్లు కట్టి.. వాటిని శాశ్వత గృహాలుగా చూపి.. రూ.లక్షలు పరిహారం కొట్టేసేందుకు పథకం వేస్తున్నారు. సింగరేణి ప్రాంతంలో కొంత కాలంగా ఇది పరిపాటిగా మారింది. ఆసిఫాబాద్‌ జిల్లాలోని గోలేటి మొదలుకొని మందమర్రి, బెల్లంపల్లి, రామగుండం, వంటి ప్రాంతాల్లో ఈ తరహాలో పరిహారాన్ని కొట్టేసిన అక్రమార్కులు.. తాజాగా భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కొండంపల్లిలో దగా చేసేందుకు సిద్ధమయ్యారు. భూపాలపల్లిలోని ఓపెన్‌కా్‌స్ట-3 గని విస్తరణకు 3,201 ఎకరాల భూసేకరణ చేయాలని సింగరేణి నిర్ణయించింది. ఇందులో వ్యవసాయ భూములతో పాటు 120 ఇళ్లు కూడా ఇందులో నష్టపోయే అవకాశం ఉందని ప్రాథమికంగా గుర్తించింది. భూసేకరణ కోసం నోటిఫికేషన్‌ జారీ చేసి సంబంధిత యజమానులకు నోటీసులు ఇచ్చింది. అయితే, ప్రాజెక్టులో ఇళ్లు, భూములు కోల్పోతున్న చాలా మంది పేర్లు ఈ జాబితాలో లేవు. దీంతో ఇందులో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో హైరానా పడ్డ కొండంపల్లి పరిసర గ్రామాలకు చెందిన బాధితులు ఈ అక్రమ తతంగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమ నిర్మాణాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించగా విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి.


అక్రమార్కులతో అధికారుల కుమ్మక్కు..

ఓపెన్‌కా్‌స్ట గని విస్తరణలో ఎక్కడి వరకు స్థలాలు సేకరించే విషయాన్ని కొంత మంది సింగరేణి అధికారులు లీక్‌ చేశారు. దీంతో సంబంధిత గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, సింగరేణి సిబ్బంది, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై సింగరేణి ఖజానాకు కన్నం పెట్టేందుకు సిద్ధమయ్యారు. కొండంపల్లి ప్రాంతంలో 90 నుంచి 120 ఇళ్లు నష్టపోతుండగా దళారుల రంగ ప్రవేశంతో ఆ సంఖ్య 380కి చేరింది. సింగరేణి నిబంధనలు అనుసరించి భూసేకరణ జరిపే ప్రాంతంలో సీసీ రూఫ్‌ టాప్‌ ఇళ్లకు రూ.8 లక్షలు, కలపతో నిర్మించిన పెంకుటిళ్లకు రూ.10 లక్షల పరిహారం చెల్లిస్తున్నారు. దీంతో అక్రమార్కులు రాత్రికి రాత్రే పెంకుటిళ్లను కట్టేసి రూ.10 లక్షలు కొట్టేసేందుకు స్కెచ్‌ వేశారు. ప్రస్తుతం సింగరేణి యాజమాన్యం ఇళ్ల విస్తీర్ణం, కలప వివరాలను నమోదు చేసే పనిలో బిజీగా ఉంది. మొదట్లో కొత్తగా నిర్మించిన ఇళ్లకు పరిహారం ఇచ్చేందుకు ససేమిరా అన్న సింగరేణి.. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో కాస్త మెత్తబడింది. స్థలాలకు కాకుండా తాత్కాలికంగా నిర్మించిన ఇళ్లకే పరిహారం ఇచ్చేలా సంస్థ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, పరిహారం జాబితాలో పేరు రాని బాధితులు అధికారులను నిలదీస్తే.. విషయం బయటకు పొక్కకుండా వారికి కూడా పరిహారం ఇప్పిస్తామంటూ హామీ పత్రం రాసిస్తామని చెబుతున్నారు. ఈ విషయమై సింగరేణి అధికారులను ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా.. ఇంకా ఎవరికి పరిహారం ఫైనల్‌ కాలేదంటూ మాట దాట వేయడం గమనార్హం.


దండుకుంటున్న రెవెన్యూ అధికారులు..

వ్యవసాయ భూములకు సింగరేణి చెల్లిస్తున్న పరిహారం తక్కువగా ఉందని రైతులు గగ్గోలు పెడుతుంటే.. భూసేకరణలో రెవెన్యూ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఒక రైతుకు ఎకరా స్థలం ఉంటే 30 గుంటలు మాత్రమే నమోదు చేసి పరిహారం మంజూరు చేస్తున్నారు. మిగతా 10 గుంటలను వేరొకరి పేరుపై నమోదు చేసి రూ.లక్షల్లో దండుకుంటున్నట్లు తెలుస్తోంది. కాస్తో కూస్తో అవగాహన ఉన్న రైతులు అధికారులను నిలదీస్తే అలాంటి వారి రికార్డులను సరిచేస్తున్నట్లు తెలుస్తోంది. భూపాలపల్లి ఆర్డీవో కార్యాలయంలో చాలా కాలంగా తిష్ఠ వేసిన ఓ ఉద్యోగి ఈ వ్యవహారాలు నడిపిస్తున్నట్లు సమాచారం. కొండంపల్లి గ్రామం కింద మొత్తం 41.29 ఎకరాల భూములు ఉండగా, వీరికి పునరావాసం కింద భూపాలపల్లి వైద్య కళాశాల సమీపంలో ఒక్కొక్కరికి 200 గజాల చొప్పున స్థలాలు ఇవ్వనున్నారు. కుటుంబంలో వివాహం కాని వారందరికీ ప్యాకేజీ ఇస్తారు. పునరావాసం కింద వచ్చే సంక్షేమ పథకాలన్నీ వర్తింపజేయనున్నారు.


ప్రేరేపిత ఆందోళనలు..

పరిహారం కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు కొంత మంది దళారులు బాధితులతో ఆందోళనలు కూడా చేయిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు కొండంపల్లిలో ప్రభుత్వ పాఠశాలకు చెందిన 20 గుంటల భూమిని, దేవాలయానికి చెందిన మరో 20 గుంటల స్థలాన్ని గ్రామానికి చెందిన అధికార, విపక్ష నాయకులు అంతా కలిసి తమ పేరిట రికార్డులు సృష్టించి, పరిహారం కోసం అధికారులపై ఒత్తిడి తెస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తమకు రావాల్సిన పరిహారం విషయంలో ఇబ్బందులు సృష్టిస్తారేమోనని గ్రామస్థులు భయపడి ఫిర్యాదు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారని తెలుస్తోంది.

Updated Date - Mar 18 , 2025 | 05:23 AM