Share News

Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు 20.19 కోట్లు విడుదల

ABN , Publish Date - Apr 16 , 2025 | 05:33 AM

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద బేస్‌మెంట్‌ పూర్తి చేసిన 2,019 లబ్ధిదారుల ఖాతాల్లో రూ.20.19 కోట్లు నేరుగా జమ చేసినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. నాలుగు దశల్లో నిధులు విడుదల చేస్తామని, ప్రతి దశలో మొబైల్‌ యాప్‌ ద్వారా ఫొటోలు అప్‌లోడ్‌ చేసినా నిధులు అందుతాయని చెప్పారు

Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు 20.19 కోట్లు విడుదల

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. నిబంధనల ప్రకారం మొదటి ధశ కింద బేస్‌మెంట్‌ పూర్తి చేసుకున్న లబ్ధిదారుల ఖాతాల్లో రూ.20.19 కోట్లను జమచేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మొదటి విడతలో పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద మంజూరు చేసిన 70,122 ఇళ్లలో బేస్‌ మెంట్‌ పూర్తి చేసుకున్న 2,019 మంది లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున ఈ రూ.20.19 కోట్లను విడుదల చేశామని మంగళవారం ఒక ప్రకటనలో ఆయన వివరించారు. బేస్‌మెంట్‌ పూర్తిచేసుకున్న వారిలో ఓ 12 మంది లబ్ధిదారులకు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా రూ.లక్ష చెక్కులను లాంఛనంగా అందజేసినట్లు తెలిపారు. గ్రౌండింగ్‌ అయిన ఇళ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేస్తున్నామని, ఇప్పటికి 13,500 ఇళ్ల గ్రౌండింగ్‌ పూర్తయిందని పొంగులేటి తెలిపారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆటంకం ఏర్పడకుండా నిధులు విడుదల చేస్తామని చెప్పారు. మధ్యవర్తుల ప్రమేయానికి తావులేకుండా నాలుగు విడతల్లో లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాల్లోనే నిధులను జమ చేస్తామన్నారు. బేస్‌మెంట్‌ పూర్తి అయిన తర్వాత రూ.లక్ష, గోడల వరకు నిర్మాణం అయితే రూ. 1.25 లక్షలు, శ్లాబ్‌ పూర్తి చేసుకున్న తర్వాత రూ. 1.75 లక్షలు, ఇల్లు నిర్మాణం పూర్తయ్యాక రూ.లక్ష చొప్పున నాలుగు దశల్లో ఆర్థిక సహయం అందించనున్నట్టు వెల్లడించారు. బేస్‌మెంట్‌, గోడల వరకు, శ్లాబ్‌ వరకు నిర్మాణం పూర్తయిన దశల్లో అధికారుల కోసం ఎదురుచూడకుండా లబ్ధిదారులే ఫొటో తీసి మొబైల్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేసినా డబ్బులు వారి ఖాతాలో జమచేస్తామని స్పష్టంచేశారు. కనీసం 400 చదరపు గజాలకు తగ్గకుండా, 600 చదరపు గజాలకు మించకుండా లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకోవాలని మంత్రి సూచించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మరింత వేగవంతం చేయడంతో పాటు అధికారులకు, ప్రజాప్రతినిధులకు సమన్వయం ఉండేలా ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నామని తెలిపారు.

Updated Date - Apr 16 , 2025 | 05:35 AM