Jaggareddy: నాపై జరిగిన మర్డర్ ప్లాన్‌ను సినిమాలో చూస్తారు...
ABN , Publish Date - Apr 15 , 2025 | 04:40 AM
తనకు సంబంధించిన మూడు పాత్రల్లో మరొక యాక్టర్ నటిస్తాడని.. తర్వాత తాను ఎంటర్ అవుతానని చెప్పారు. తన నిజ జీవితంలో జరిగిన సంఘటనలతోనే సినిమా ఆద్యంతం రక్తి కట్టించేలా డైరెక్టర్ రామానుజం స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నారని జగ్గారెడ్డి వెల్లడించారు.

జగ్గారెడ్డి- ఏ వార్ ఆఫ్ లవ్‌లో నా ప్రేమ కథ ఉండదు.. కానీ ప్రేమికులకు అండగా ఉంటా
కథను ప్రిపేర్ చేయడంలో మా డైరెక్టర్ బిజీ
పోలీసుల ఒత్తిళ్లు, నిర్బంధాలను ఎదుర్కొని జీవితంలో నేను ఎదిగిన తీరు.. ఓ కలెక్టర్‌ను ట్రాన్స్ఫర్ చేసేదాకా పోరాడిన ఘటనలు సినిమాలో ఉంటాయి
మూడు పాత్రల్లో మరొక యాక్టర్ .. తర్వాత నేను ఎంటర్ అవుతా
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సంగారెడ్డి ప్రతినిధి, ఏప్రిల్ 14 ఆంధ్రజ్యోతి: ఓ రాజకీయ పార్టీ నాయకుడు తనను చంపడానికి మర్డర్ ప్లాన్ చేస్తే... ఆ మర్డర్ ప్లాన్‌ను తాను వ్యూహాత్మకంగా ఎదుర్కొన్న తీరు... తనపై పోలీసుల ఒత్తిళ్లు, నిర్బంధాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి తాను ఎదిగిన తీరు... ఎలాంటి పొలిటికల్ బ్యాగ్రౌండ్, ధన బలం లేకున్నా అంతకు మించిన జన బలం, కార్యకర్తల బలగంతో తన నిజ జీవితం ఎలా ముందుకెళ్లిందనే సన్నివేశాలను జగ్గారెడ్డి- ఏ వార్ ఆఫ్ లవ్ సినిమాలో చూడబోతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. జగ్గారెడ్డి- ఏ వార్ ఆఫ్ లవ్ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాల గురించి ఆయన విలేకరులతో చిట్‌చాట్‌గా చర్చించారు. సినిమా కథను ప్రిపేర్ చేయడంపైనే డైరెక్టర్ రామానుజం నిమగ్నమయ్యారని చెప్పారు.
ఈ సినిమాలో తన ప్రేమ కథ ఉండదని, కానీ ప్రేమికులకు అండగా ఉంటానని తెలిపారు. సంగారెడ్డిలో స్టూడెంట్ లీడర్‌గా, మున్సిపల్ కౌన్సిలర్‌గా, మున్సిపల్ చైర్మన్‌గా తన నిజజీవితంలోని కీలక ఘట్టాలను ఈ సినిమాలో చూడబోతున్నారని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. ఓ పోలీసు అధికారిని ఎదిరించడం, ఓ కలెక్టర్‌ను ట్రాన్స్ఫర్ చేసేదాకా పోరాటం చేసిన సన్నివేశాలు ఈ సినిమాలో వీక్షిస్తారని వివరించారు. తనకు సంబంధించిన మూడు పాత్రల్లో మరొక యాక్టర్ నటిస్తాడని.. తర్వాత తాను ఎంటర్ అవుతానని చెప్పారు. తన నిజ జీవితంలో జరిగిన సంఘటనలతోనే సినిమా ఆద్యంతం రక్తి కట్టించేలా డైరెక్టర్ రామానుజం స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నారని జగ్గారెడ్డి వెల్లడించారు.