ప్రయాగ్‌రాజ్‌లో నలుగురు మహిళల అదృశ్యం!
ABN , Publish Date - Feb 01 , 2025 | 04:30 AM
మహా కుంభమేళాలో పుణ్యస్నాం చేసేందుకు ఎంతో ఉత్సాహంగా జగిత్యాల నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లిన ఆ బృందం ఇప్పుడు అక్కడ ఆందోళన పడిపోయింది.

జగిత్యాల నుంచి 12మంది కుంభమేళాకు
గల్లంతైన నలుగురూ అక్కాచెల్లెళ్లే
24 గంటలు గడిచినా దొరకని ఆచూకీ
జగిత్యాల, ఖానాపూర్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): మహా కుంభమేళాలో పుణ్యస్నాం చేసేందుకు ఎంతో ఉత్సాహంగా జగిత్యాల నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లిన ఆ బృందం ఇప్పుడు అక్కడ ఆందోళన పడిపోయింది. 12మందితో కూడిన ఆ బృందంలో నలుగురు కనిపించకపోవడమే వారి ఆందోళనకు కారణం! ఆ నలుగురూ స్వయానా అక్కాచెల్లెళ్లు కావడం గమనార్హం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్, కొత్తవాడ కాలనీలతో పాటు నిర్మల్ జిల్లా కడెం గ్రామానికి చెందిన 12 మంది ఓ అద్దె వాహనంలో జనవరి 27న రాత్రి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు. వీరిలో 11 మంది మహిళలే. 29న రాత్రి ఈ బృందం ప్రయాగ్‌రాజ్ చేరుకుంది. 30న తీవ్ర రద్దీ కారణంగా స్నాన ఘట్టాలకు ఓ పది కి.మీ దూరంలోనే వాహనాన్ని ఆపి.. అక్కడి నుంచి రెండు ఆటోల్లో ఆరుగురు చొప్పున ఎక్కి బయలుదేరారు. ఘట్టాల వద్దకు చేరుకున్నాక సెల్‌ఫోన్లను ఆటోల్లోనే వదిలేసి స్నానాలకు దిగారు. అయితే తిరిగి ఆటోల వద్దకు మాత్రం పన్నెండుగురిలో ఎనిమిది మందే వచ్చారు.
అక్కాచెల్లెళ్లయిన.. జగిత్యాలకు చెందిన వీర్ల నర్సవ్వ, ఆది రాజవ్వ, కడెంకు చెందిన ఏనుగుల బుచ్చవ్వ, కడెంకు చెందిన బెల్లపు సత్తవ్వలు ఆటోల వద్దకు తిరిగి రాలేదు. ఈ నలుగురి కోసం పలుచోట్ల వెతికినా ఫలితం లేకపోయింది. విషయం తెలిసి ఇక్కడ వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఘటన గురించి స్థానిక అధికారులకు ఫిర్యాదు వెళ్లింది. వారొచ్చి.. మిగతా ఎనిమిదిమంది కోసం ఓ చోట ప్రత్యేకంగా ఆశ్రయం కల్పించారు. ఇక.. బాధిత కుటుంబసభ్యులు జగిత్యాల నుంచి ప్రత్యేకంగా ఓ కార్లో ప్రయాగ్‌రాజ్ బయలుదేరారు. తప్పిపోయిన మహిళల కోసం విస్తృతంగా గాలిస్తున్నామని అద్దె వాహనం డ్రైవర్ రాకేశ్ ‘ఆంధ్రజ్యోతి’కి వెల్లడించారు. గల్లంతైన మహిళల వద్ద ఫోన్లు లేకపోవడం, వారికి తెలుగు తప్ప మరే భాష రాకపోవడం ఇబ్బందిగా మారిందని చెప్పాడు. మహిళల ఆచూకీ లభించగానే తిరుగు ప్రయాణం అవుతామని చెప్పాడు.