JNTU: జేఎన్‌టీయూ కాలేజీలో మెరిట్ జాబితా
ABN, Publish Date - Apr 08 , 2025 | 05:02 AM
జేఎన్‌టీయూ యూనివర్సిటీ ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీలో ఈ ఏడాది నుంచి మెరిట్ విద్యార్థుల జాబితా ప్రవేశపెడుతున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీవీ నర్సింహారెడ్డి తెలిపారు.

10% మంది మెరిట్ విద్యార్థులకు ప్రశంసాపత్రాలు
బ్యాక్‌లాగ్స్ పూర్తికోసం జేఎన్‌టీయు ‘వన్‌టైం చాన్స్’.. !
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): జేఎన్‌టీయూ యూనివర్సిటీ ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీలో ఈ ఏడాది నుంచి మెరిట్ విద్యార్థుల జాబితా ప్రవేశపెడుతున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీవీ నర్సింహారెడ్డి తెలిపారు. తమ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల్లో ప్రతి విభాగం నుంచి 10 శాతం మంది మెరిట్ విద్యార్థులను ఈ జాబితాకు ఎంపిక చేస్తామని సోమవారం పేర్కొన్నారు. అలా ఎంపికైన విద్యార్థులకు ప్రశంసా పత్రాల ప్రదానం చేయడంతోపాటు కళాశాల ప్రిన్సిపాల్, రిజిస్ట్రార్, రెక్టార్, వైస్ చాన్స్‌లర్ సంతకాలు చేసిన సర్టిఫికెట్లు పంపిణీ చేస్తామని నర్సింహారెడ్డి చెప్పారు.
ఈ ఏడాది నుంచి కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే నిర్వహణకు వైస్ చాన్స్‌లర్ అనుమతించారన్నారు. కాగా, తన అనుబంధ కళాశాలల్లో విద్యాభ్యాసం గడువు ముగిసినా సబ్జెక్టులు పాస్ కాలేకపోయిన విద్యార్థులకు జేఎన్‌టీయూ ‘వన్‌టైమ్ చాన్స్’ కల్పిస్తోంది. బ్యాక్‌లాగ్స్ ఉన్న విద్యార్థుల కోసం మే/జూన్ నెలల్లో ప్రత్యేక సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నది.
Updated Date - Apr 08 , 2025 | 05:02 AM