Share News

Kaleshwaram: మేడిగడ్డలో లోపాలను 2019లోనే గుర్తించాం

ABN , Publish Date - Jan 25 , 2025 | 05:47 AM

సిమెంట్‌ కాంక్రీట్‌ బ్లాకులు చెల్లాచెదురయ్యాయి. అప్పుడే అధికారులకు దీనిపై నివేదిక ఇచ్చాం. తగిన మరమ్మతులు చేయడానికి వీలుగా డిజైన్లు/డ్రాయింగ్‌లు అందించాలని పదే పదే కోరాం.

Kaleshwaram: మేడిగడ్డలో లోపాలను 2019లోనే గుర్తించాం

  • ప్రభుత్వానికి నివేదించినా చర్యలు తీసుకోలేదు

  • కాళేశ్వరం కమిషన్‌ ముందు ఎల్‌ అండ్‌ టీ ప్రతినిధులు

హైదరాబాద్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ‘2019లో తొలి వరదల అనంతరం గేట్లు దించగానే బ్యారేజీ దిగువ భాగంలో వేరింగ్‌ కోట్‌ , అఫ్రాన్లు దెబ్బతిన్నాయి. సిమెంట్‌ కాంక్రీట్‌ బ్లాకులు చెల్లాచెదురయ్యాయి. అప్పుడే అధికారులకు దీనిపై నివేదిక ఇచ్చాం. తగిన మరమ్మతులు చేయడానికి వీలుగా డిజైన్లు/డ్రాయింగ్‌లు అందించాలని పదే పదే కోరాం. ఆ మరమ్మతులను సకాలంలో చేయనందువల్లే మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతింది. బ్యారేజీ దిగువ భాగంలో ఎనర్జీ డిసిపేషన్‌ ఏర్పాట్లు లేకపోవడమే బ్యారేజీ వైఫల్యానికి కారణం’ అని కాళేశ్వరం విచారణ కమిషన్‌కు ఎల్‌ అండ్‌ టీ సంస్థ నివేదించింది. కాళేశ్వరం బ్యారేజీలపై విచారణలో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌టీ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎం.వి.రామకృష్ణరాజు, ఎల్‌ అండ్‌ టీ వైస్‌ప్రెసిడెంట్‌(హైడల్‌) ఎస్‌.సురే్‌షకుమార్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ రజనీష్‌ ఎస్‌.చౌహాన్‌లను కమిషన్‌ శుక్రవారం క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసింది.


మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి, బ్లాక్‌-7 కుంగిపోవడానికి కారణాలేంటని ప్రశ్నించగా రామకృష్ణంరాజు సమాధానమిచ్చారు. 2019 ఆగస్టు 6వ తేదీన తొలిసారి వరద వచ్చిందని 2019 నవంబరులో గేట్లు మూసివేశామని చెప్పారు. ‘‘ఆ సమయంలో బ్యారేజీ దిగువభాగంలో రక్షణ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. మేడిగడ్డలోనే కాదు... అన్నారం, సుందిళ్లలోనూ ఇదే పరిస్థితి. వరద ప్రవాహ వేగం పెరగడం వల్లే బ్యారేజీలు దెబ్బతిన్నట్లు గుర్తించాం. ఐఐటీ హైదరాబాద్‌కూడా అధ్యయనం చేసి, వరద ప్రవాహ వేగాన్ని కచ్చితంగా అంచనా వేయడంలో లోపాలు, ఎనర్జీ డిసిపేషన్‌ ఏర్పాట్లు దిగువ భాగంలో లేకపోవడమే కారణమని నివేదిక ఇచ్చారు. అప్పట్లోనే ఆ లోపాలను సవరించడానికి వీలుగా తగిన డిజైన్లు/డ్రాయింగ్‌లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాం. నాలుగేళ్లయినా అధికారులు డిజైన్లు/డ్రాయింగ్‌లు అందించలేదు. 2020 జూన్‌లో బ్యారేజీ నిర్మాణం పూర్తయింది. 2022 జూన్‌ 28వ తేదీన డిఫెక్ట్‌ లయబుల్టీ కాలం పూర్తయింది.


ఐదేళ్లపాటు ఓ అండ్‌ ఎం ఒప్పందం జరిగింది. 2019లో గుర్తించిన లోపాలను సవరించని కారణంగా 2023 అక్టోబరు 23వ తేదీన బ్యారేజీ కుంగింది. బ్యారేజీలను వానాకాలానికి ముందు, వానాకాలం తర్వాత ఖాళీగా ఉంచి... ఎగువ, దిగువ భాగంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని పరిశీలించి, నివేదికలు తయారు చేయాలి. బ్యారేజీ పూర్తయిన తర్వాత నాలుగేళ్లకాలంలో ఏ రోజు బ్యారేజీని ఖాళీ చేయలేదు. బ్యారేజీ వైఫల్యానికి ఇది కూడా ఒక కారణం.’’ అని వివరించారు. వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చిన ఆర్నెల్ల తర్వాత బ్యారేజీ నిర్మాణ స్థలాన్ని అప్పగించారని, రెండేళ్లలోపు పూర్తి చేయాలని టార్గెట్‌ విధించారని చెప్పారు. మేడిగడ్డ నిర్మాణ పనులను ఐటెమ్‌ రేట్‌ కాంట్రాక్ట్‌ (ఎంత పనిచేస్తే అంత చెల్లింపులు) కింద పని అప్పగించారన్నారు. దీనివల్లే తగిన అధ్యయనాలు, పరీక్షలు చేయలేకపోయామని పేర్కొన్నారు. బ్యారేజీని మళ్లీ మరమ్మతులు చేసి, వాడకంలోకి తేవొచ్చా అని కమిషన్‌ ప్రశ్నించగా... సవరణ డిజైన్లతో మరమ్మతులు చేసి, మళ్లీ వినియోగంలోకి తే వొచ్చని రాజు సమాధానమిచ్చారు. 2019లో బ్యారేజీ దెబ్బతిన్నప్పుడే మరమ్మతులకు తగిన డిజైన్లు ఇచ్చి ఉంటే బ్లాక్‌-7 కుంగేదే కాదని రాజు కమిషన్‌కు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Virender Sehwag: విడాకులు తీసుకోనున్న వీరేంద్ర సెహ్వాగ్..

Kaleshwaram Commission: నేటి కాళేశ్వరం విచారణ.. అత్యంత కీలకం

Updated Date - Jan 25 , 2025 | 05:47 AM