Kanch Gachibowli Land: ఆ 400 ఎకరాలు ప్రభుత్వానివే

ABN, Publish Date - Mar 26 , 2025 | 04:48 AM

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అని మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఈ భూమి ఐఎంజీ అకాడమీకి కేటాయించబడినప్పటికీ, అకాడమీ ప్రాజెక్టు ప్రారంభం కాకపోవడంతో, కాంగ్రెస్‌ ప్రభుత్వం 2006లో కేటాయింపులను రద్దు చేసింది

Kanch Gachibowli Land: ఆ 400 ఎకరాలు ప్రభుత్వానివే
  • కంచ గచ్చిబౌలి భూములపై మంత్రి శ్రీధర్‌బాబు

  • కొంత మంది చెప్పేది అవాస్తవమని ప్రకటన

హైదరాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఆ భూమిపై కొంత మంది అవాస్తవాలు చెబుతూ వార్తలు ఇస్తున్నారని చెప్పారు. భూములపై గందరగోళ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్పష్టత ఇస్తూ మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లా శేర్‌లింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని సర్వే నం.25లో ఉన్న 400 ఎకరాల భూమిని 2003లో అప్పటి ఏపీ ప్రభుత్వం క్రీడా సౌకర్యాల అభివృద్ధి కోసం ఐఎంజీ అకాడమీకి కేటాయించిందని మంత్రి పేర్కొన్నారు. అయితే ఐఎంజీ భారత్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ అకాడమీ ప్రాజెక్టును ప్రారంభించలేదని, దీంతో 2006లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించి కేటాయింపులు రద్దు చేసిందన్నారు. ఐఎంజీ సంస్థ కేటాయింపు రద్దును సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా.. 2024 మార్చి 7న ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. దానిపై ఐఎంజీ సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించగా 2024 మే 3న ఐంఎజీ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిందని వివరించారు.


రెవెన్యూ రికార్డుల ప్రకారం..

రెవెన్యూ రికార్డుల ప్రకారం శేర్‌లింగంపల్లి డిప్యూటీ కలెక్టర్‌, తహసీల్దార్‌లు 400 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిగా ధ్రువీకరించారని మంత్రి శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు. కొత్త భూ కేటాయింపు విధానం ప్రకారం 26-6-2024న తెలంగాణ పరిశ్రమల మౌలిక వసతుల సంస ్థ(టీజీఐఐసీ)కు కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులిచ్చిందని తెలిపా రు. ఆతరువాత 1-7-2024న రెవెన్యూ అధికారులు టీజీఐఐసీకి భూమి ని అప్పగించారన్నారు. ఈ భూమిలోని రాతి నిర్మాణాలను, పుట్టగొడు గు ఆకారపు అపురూపమైన రాయిని గ్రీన్‌ జోన్‌గా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రణాళికను కూడా సిద్ధం చేసి అమలు చేయనున్నట్లు తెలిపారు. టీజీఐఐసీ హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం భూములను ఆక్రమించలేదన్నారు.

ఇవి కూడా చదవండి:

ఇది కారు లాంటి గేట్..

Hotel Booking: ఒయో రూమ్స్ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇలా చేయండి

Stock Market Update: స్వల్ప లాభాల్లో గట్టెక్కిన నిఫ్టీ, సెన్సెక్స్ రెడ్ లో బ్యాంక్ నిఫ్టీ

Updated Date - Mar 26 , 2025 | 04:49 AM