మొదలైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు
ABN , Publish Date - Apr 09 , 2025 | 01:04 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం జిల్లాలో పునాదులు దాటుతోంది. ఇప్పటి వరకు ప్రయోగత్మకంగా ఎంపిక చేసిన 13 గ్రామాల్లో ఈ పథకం కొనసాగుతున్నది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ మేరకు జిల్లాలో చేపట్టిన ఇళ్ల్లు ముందుకు సాగలేదు. మంథనిలో కొన్ని పూర్తికాగా లబ్ధిదారులకు అందజేశారు.

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం జిల్లాలో పునాదులు దాటుతోంది. ఇప్పటి వరకు ప్రయోగత్మకంగా ఎంపిక చేసిన 13 గ్రామాల్లో ఈ పథకం కొనసాగుతున్నది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ మేరకు జిల్లాలో చేపట్టిన ఇళ్ల్లు ముందుకు సాగలేదు. మంథనిలో కొన్ని పూర్తికాగా లబ్ధిదారులకు అందజేశారు. పెద్దపల్లిలోని హనుమం తుని పేట, చందపల్లిలో నిర్మాణంలో ఉన్న గృహాలకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. కానీ వాటిలో మౌలిక వసతులు కల్పించలేదు. దీంతో ప్రస్తుత ప్రభుత్వం మౌలిక వసతుల్లో భాగంగా తాగునీరు, రోడ్లు, మురికి కాలువలు, విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు నిధులు మంజూరు చేయగా ఆ పనులు పూర్తి కావస్తున్నాయి. రామగుండం, అంతర్గాం, సుల్తానాబాద్‌లో చాలా వరకు ఇళ్లు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు సొంత స్థలాలు ఉన్న వారికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం కింద ఇల్లు నిర్మించుకునేందుకు 3 లక్షలు ఇస్తామని ప్రకటిం చింది. కానీ లబ్ధిదారుల ఎంపికలో జాప్యం జరగడంతో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రాగా, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకు వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా లబ్ధిదారులు నిర్మించుకున్నారు. అదే తరహాలో ప్రభుత్వం ఇళ్ల పథకాన్ని తీసుకరావడంతో పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఆశలు చిగురించాయి. 2024-25 బడ్జెట్‌లో ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేసింది. ఆ తర్వాత మార్గదర్శకా లను రూపొందించిన ప్రభుత్వం ఆ మేరకు ఇంటింటి సర్వే నిర్వహించి సొంత స్థలాలు ఉన్న అర్హులను గుర్తించారు.
ఫ జనవరి 26న పథకం ఆరంభం..
ఈ ఏడాది జనవరి 26న ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఆరంభించింది. అయితే మండలానికి ఒక గ్రామం చొప్పున జిల్లాలోని 13 రూరల్ మండలాల్లోని మద్దిర్యాల, బంజేరుపల్లి, శివపల్లి, కోనరావుపేట, రొంపి కుంట, అడవిసోమన్‌పల్లి, మచ్చుపేట, శానగొండ, రామారావుపల్లి, నిమ్మనపల్లి, రత్నాపూర్, అంకంపల్లి, కాట్నపల్లి గ్రామాల్లో సొంత ఇంటి స్థలం ఉన్న 1,940 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఇల్లు మంజూరు చేశారు. ఆయా గ్రామాల్లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు, రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ ఇళ్ల నిర్మాణా లను ఆరంభించారు. ఇప్పటి వరకు జిల్లాలోని ఆయా గ్రామాల్లో 623 మంది లబ్ధిదారులు ఇళ్లు నిర్మిం చుకునేందుకు ముందుకు రాగా ముగ్గులు పోశారు. ఇందులో 230 ఇళ్లు పిల్లర్లు, పునాదుల దశలో కొన సాగుతుండగా, 50 ఇళ్లు బేస్‌మెంట్ స్థాయిలో పూర్త య్యాయి. ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు అందజేస్తుంది. ఈ డబ్బులను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. పునాది దశలో లక్ష, లెంటల్ లెవల్‌లో 2 లక్షలు, పూర్తయిన తర్వాత మిగతా 2 లక్షల రూపాయలు దశల వారీగా లబ్ధిదారుల ఖాతా ల్లో జమ చేయనున్నారు. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సొంత ఇంటి స్థలాలు ఉన్న పేద, మధ్య తరగతి కుటుంబాల సొంతింటి ఇళ్ల కల నెరవేరుస్తున్నప్పటికీ, లబ్ధిదారులు వేగంగా ఇళ్లు నిర్మించేందుకు ముందుకు రావడం లేదు. ఇంటి పను లను ఆరంభించేందుకు కొంత మందికి ముహూర్తాలు లేక పోగా, మరి కొందరికి ఆర్థికంగా లేకపోవడంతో ఆలస్యం చేస్తున్నారు. ఇది గమనించిన ప్రభుత్వం స్వశక్తి సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ఆ సంఘాల ద్వారా లక్ష రూపాయల వరకు రుణాలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించింది. ఆ మేరకు జిల్లాలో డీఆర్‌డీఏ అధికారులు, ఎంపీడీవోలు, కార్యదర్శులు ఆర్థికంగా వెనుకబడిన వారిని గుర్తిస్తు న్నారు. వారికి బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేసిన వెంటనే ఇళ్ల నిర్మాణంలో మరింత వేగం పెరగ నున్నది. ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేందుకు కొత్తగా 26 మంది మేస్త్రీలకు న్యాక్ కేంద్రం ద్వారా ఆరు రోజుల పాటు శిక్షణ ఇప్పించారు. స్వశక్తి సంఘాల్లో సభ్యుల కుటుంబ సభ్యుల్లో సిమెంటు ఇటుకల తయా రీ, సెంట్రింగ్ సామగ్రి సరఫరా చేసేందుకు ఆసక్తి గల వారిని గుర్తించి వారికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు సంబంధిత అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ఫ లబ్ధిదారులకు అవగాహన..
- రాజేశ్వర్, జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు అధికారి
జిల్లాలో గుర్తించిన మండలానికి ఒక గ్రామంలో సొంత ఇంటి స్థలం గల అర్హులైన వారందరికీ ఇంది రమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసింది. ఇళ్ల్లు నిర్మించుకునేలా లబ్ధిదారులకు అవగా హన కల్పిస్తున్నాం. స్వశక్తి సంఘాల్లో ఆర్థికంగా లేని లబ్ధిదారులను గుర్తించి బ్యాంకుల ద్వారా వారికి లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం ఇప్పించేందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటు న్నాం. జిల్లాలో ఇప్పటి వరకు 50 మంది లబ్ధిదారులు బేస్‌మెంట్ లెవెల్ వరకు ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయగా, బిల్లుల కోసం ప్రభుత్వానికి నివేదించాం. త్వర లోనే వారి ఖాతాలో బిల్లులు జమ కానున్నాయి.