మహిళలకు పెద్దపీట
ABN , Publish Date - Apr 06 , 2025 | 12:52 AM
ఐదేళ్లలో మహిళలను కోటీ శ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నది.

- ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 50 శాతం కేటాయించేందుకు కసరత్తు
- ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంక్, రైస్‌మిల్లులు ఏర్పాటు
- మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ముందుకు
పెద్దపల్లి, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): ఐదేళ్లలో మహిళలను కోటీ శ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నది. మహిళలు ఆర్టీసీ బస్సుల కొనుగోళ్లతో పాటు పెట్రోల్ బంకుల నిర్వహణ, రైస్‌మిల్లులను ఏర్పాటు చేయా లని, సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు రూపొంది స్తున్నది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 50 శాతం కేంద్రాలను ఈ సీజన్ నుంచే మహిళలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పంచాయతీరాజ్‌శాఖ అధికారులను ఆదేశించారు. ఆ మేరకు సెర్ఫ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లాలో 269 కేంద్రాలు సహకార సంఘాలు, 59 మహిళా సంఘాలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసే సంఘాలతోపాటు ప్రాథమిక వ్యవ సాయ సహకార సంఘాల నిర్వహణలో ఉన్న కొన్ని కేంద్రాలను మహిళా సంఘాలకు ఇచ్చే విధంగా సెర్ఫ్ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసినందుకు క్వింటాలు ధాన్యానికి కామన్ రకం 31.20 రూపాయలు, ఫైన్ రకం ధాన్యానికి రూ.32 కమీషన్ ఇస్తుండడంతో ఆ డబ్బు మహిళల కుటుంబాలకు దోహదపడనున్నది. ఈ సీజన్‌లో సాధ్యమైనన్నీ కేంద్రాల నిర్వహణ బాధ్యతను అప్పగించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎంపిక చేసిన మహిళలకు కేంద్రాల నిర్వహణపై ఒక రోజు శిక్షణ ఇవ్వనున్నారు.
ధాన్యం కొనుగోలు ఇలా..
యాసంగి సీజన్ నుంచి రాష్ట్రంలోని సగం ధాన్యం కొనుగోలు కేంద్రాలను మహిళలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు కసరత్తు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికా రులు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యానికి మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో 2006-07 నుంచి కొనుగోలు కేంద్రాలను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐదు నుంచి పది గ్రామాలకు కలిపి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల నిర్వహణ బాధ్యతను స్వశక్తి సంఘాల మహిళలకు అప్పగించారు. ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా మహిళలకు కమీషన్ చెల్లించారు. ఈ డబ్బులను గ్రామైక్య సంఘానికి, కేంద్రాన్ని నిర్వహించిన మహిళలకు కొంత అంద జేశారు. ప్రైవేట్ వ్యాపారులు ధాన్యం కొనుగోళ్లలో మద్దతు ధర చెల్లించడమే కాకుండా, సంచి కిలో, మట్టి కిలో చొప్పున తరుగు తీయడంతో రైతులకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరతోపాటు తరుగు లేకుండా 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడంతో రైతులు కొనుగోలు కేంద్రాల వైపు మొగ్గు చూపారు.
పెరిగిన సాగు విస్తీర్ణం
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగు విస్తీర్ణం ఆధారంగా కొనుగోలు కేంద్రాలను పెంచారు. మహిళా సంఘాలు నిర్వహిస్తున్న కేంద్రాలతోపాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా కూడా కొన్ని కేంద్రాలను నిర్వహించారు. కరోనా సమయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామానికి ఒక కొనుగోలు కేం ద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఎక్కువ కొనుగోలు కేంద్రాలు సహకార సంఘాల చేతికి వెళ్లాయి.
ప్రస్తుతం మహిళల చేతిలో 30 శాతం సంఘాలు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రంలో నీటి వనరులు చేతికి రావడంతో వరి సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తున్నది. గడిచిన వానాకాలం సీజన్‌లో 617 కోట్ల 72 లక్షల రూపాయల విలువైన 2,66,281 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 47,209 మంది రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఇందులో దొడ్డు రకం ధాన్యం 63వేల268 మెట్రిక్ టన్నులు, సన్నరకం ధాన్యం 2,03,013 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ధాన్యం కొనుగోలు చేసినందుకు కేంద్రాల నిర్వాహకులకు సుమారు 75 లక్షల రూపాయల కమీషన్ చెల్లించాల్సి ఉంటుంది. సంఘాలకు కమీషన్ పెద్ద ఎత్తున వస్తుండడంతో ప్రస్తుతం ఉన్న కేంద్రాల్లో కొన్నింటిని, కొత్తగా ఏర్పాటు చేసే కేంద్రాలను స్వశక్తి మహిళా సంఘాలకు అప్పగించాలని జిల్లాలో కసరత్తు చేస్తున్నారు.