నిబంధనలు బేఖాతరు
ABN , Publish Date - Apr 06 , 2025 | 12:54 AM
జిల్లాలోని పలు ప్రైవేటు జూనియర్ కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా నీట్, ఐఐటీ కోచింగ్ పేరిట తరగతులు నిర్వహిస్తూ అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. తమ పిల్లలు ఇంజినీర్, డాక్టర్ కావాలన్న విద్యార్థుల తల్లిదండ్రుల ఆశలను ప్రైవేటు విద్యాసంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి.

-పలు ఇంటర్ కాలేజీల్లో నీట్, ఐఐటీ కోచింగ్
-అనుమతులు లేకుండానే నిర్వహణ
-ప్రభుత్వం సెలవులు ప్రకటించినా పట్టించుకోని వైనం
-ప్రేక్షకపాత్ర వహిస్తున్న విద్యాశాఖ అధికారులు
జగిత్యాల, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు ప్రైవేటు జూనియర్ కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా నీట్, ఐఐటీ కోచింగ్ పేరిట తరగతులు నిర్వహిస్తూ అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. తమ పిల్లలు ఇంజినీర్, డాక్టర్ కావాలన్న విద్యార్థుల తల్లిదండ్రుల ఆశలను ప్రైవేటు విద్యాసంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. ఇటీవల ఈ కోర్సులకు డిమాండ్ రావడంతో ప్రైవేటు ఇంటర్ కళాశాలలతో పాటు కోచింగ్ సెంటర్లు ఇబ్బడిముబ్బడిగా వెలిశాయి. అయితే ప్రభుత్వం గత నెల 29 నుంచి ఇంటర్ కళాశాలలకు సెలవులు ప్రకటించింది. కానీ జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రధాన పట్టణాల్లోని చాలా ప్రైవేటు ఇంటర్ కళాశాలల్లో విద్యార్థులకు ఐఐటీ, నీట్, ఎప్‌సెట్ వంటి వాటిపై కోచింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లాలో అన్ని రకాల కోచింగ్ సెంటర్లు కలిపి 30కి పైగా ఉండగా, వీటిలో సుమారు 5 వేల మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నట్లు అంచనా. ఇందులో ఏ ఒక్క కోచింగ్ సెంటర్‌కు కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు లేవని పలు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ యథేచ్ఛగా కళాశాలల్లో ఉదయం నుంచి రాత్రి వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఫఅధిక మొత్తంలో ఫీజులు వసూలు
ఐఐటీ, నీట్ కోచింగ్‌లకు ఆయా కళాశాలల యాజమాన్యాలు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇందులో షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ పేరిట ఫీజులు నిర్ణయిస్తున్నారు. ఐఐటీ, నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్‌కు ఎక్కువ మొత్తంలో, షార్ట్‌టర్మ్ తక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారు. దీనికి తోడు బ్రిడ్జి కోర్సు పేరిట ఐఐటీ-జేఈఈ పరీక్ష కోసమని ప్రత్యేక ఫీజులను ప్రకటిస్తున్నారు. తరగతులు ఫలానా తేదీ నుంచి ప్రారంభిస్తామని బహిరంగంగానే ప్రకటనలు సైతం ఇస్తున్నారు. కొన్ని ప్రైవేటు కళాశాలలు రెండు, మూడు బ్రాంచ్‌లు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. వీటితో పాటు గురుకుల, నవోదయ, ఆర్మీ స్కూల్ వంటి వాటికి రూ.వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రైవేటు ఇంటర్ కళాశాలలు నిర్వహిస్తున్న భవనాల్లోనే కోచింగ్ పేరిట యథేచ్ఛగా తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని పలు విద్యార్థి సంఘాలు, యువజన సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
చర్యలు తీసుకోవాలి
-దొనికెల నవీన్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
ప్రభుత్వం జూనియర్ కళాశాలలకు సెలవులు ప్రకటించినా నిబంధనలకు విరుద్ధంగా ఐఐటీ, నీట్ కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న కళాశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి. ఇంటర్మీడియట్ శాఖ అధికారులు ఆయా కళాశాలల్లో తనిఖీలు చేపట్టడం లేదు. కలెక్టర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి.
కళాశాలలు మూసివేయాలి
-బొప్పరాతి నారాయణ, జిల్లా ఇంటర్ విద్యాధికారి
జిల్లాలోని జూనియర్ కళాశాలల విద్యార్థులకు సెలవులు ఇవ్వాలని, ఎలాంటి తరగతులు నిర్వహించరాదని కమిషనర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకుంటాం. ఏ కళాశాలలో అయినా విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవు.