జై హనుమాన్
ABN , Publish Date - Apr 13 , 2025 | 12:52 AM
కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో శనివారం హనుమాన్ చిన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జయంతి సందర్భంగా తరలివచ్చిన భక్తజనంతో కొండగట్టు కిక్కిరిసింది. అంజన్న దీక్షాపరుల సంకీర్తనలతో స్వామి పరిసరాలు భక్తి పారవశ్యంతో పులకించాయి.

కొండగట్టు అంజన్నకు భక్తజన హారతి
అంజన్నను దర్శించుకున్న వేలాది భక్తులు
ఘనంగా హనుమాన్ చిన్న జయంతి
మల్యాల, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో శనివారం హనుమాన్ చిన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జయంతి సందర్భంగా తరలివచ్చిన భక్తజనంతో కొండగట్టు కిక్కిరిసింది. అంజన్న దీక్షాపరుల సంకీర్తనలతో స్వామి పరిసరాలు భక్తి పారవశ్యంతో పులకించాయి. భక్తులు శ్రీరామ భక్తుడు హనుమంతుడిని తమ సంకీర్తనలతో కొలిచారు. అంజన్న దీక్షాపరులతో కొండగట్టు పుణ్యక్షేత్రం శనివారం రాత్రి కాషాయవర్ణాన్ని పులుముకుంది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల నుంచి అత్యధిక సంఖ్యలో అంజన్న దీక్షాపరులు కొండపైకి చేరుకుని 41, 21, 11 రోజుల దీక్ష బూనిన వారు మాల విరమణ చేశారు. ఘాట్‌రోడ్డు, మెట్లదారుల గుండా వచ్చిన దీక్షాపరులతో కొండంతా భక్తజనంతో నిండింది.
ఘనంగా హనుమాన్ చిన్న జయంతి
కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో శనివారం చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతియేటా చైత్ర పౌర్ణమి సందర్భంగా నిర్వహించే ఈ జయంతిలో భాగంగా అంజన్నకు విశేష అభిషేకం, తులసీ అర్చన, స్వామివారికి పట్టు వస్త్రాలంకరణ నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, స్థానిక శాసనసభ్యుడు మేడిపల్లి సత్యం అంజన్నను దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈవో శ్రీకాంత్‌రావు, ఉత్సవాల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, ఆలయ పర్యవేక్షకులు హరిహరనాథ్, సునీల్, చంద్రశేఖర్, స్థానాచార్యులు కపీంధర్, ప్రధాన అర్చకులు రామకృష్ణ, జితేంద్రప్రసాద్ స్వామి, రఘు ఉపప్రధాన అర్చకులు చిరంజీవి, మారుతీ సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కొండపైనే కలెక్టర్, ఎస్పీ మకాం..
హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాల సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్ ప్రత్యేక పర్యవేక్షణ చేస్తూ నిత్యం కొండపైన ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెండు రోజులుగా భక్తులు అధికంగా వచ్చే సమయంలో కొండపైన కలియతిరుగుతూ అర్ధరాత్రి వరకు కొండపైనే ఉంటూ, భక్తుల వద్దకు వెళుతూ సమస్యలు తెలుసుకొని తగు పరిష్కార సూచనలు ఇచ్చారు. సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు భక్తుల రద్దీ, దీక్షా విరమణ, దర్శనాలు తదితరవి పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూడాలని అధికారులకు సూచనలు చేశారు.