Share News

karimnagar : అధ్యక్షులెవరు?

ABN , Publish Date - Apr 14 , 2025 | 12:43 AM

జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ తమ జిల్లా శాఖ అధ్యక్షులెవరో తేల్చడంలో తర్జనభర్జన పడుతున్నాయి. రోజులు గడిచినా కొద్ది ఈ వ్యవహారం జఠిలమవుతూ ఆ పార్టీల రాష్ట్ర నేతలకు తలనొప్పి కలిగిస్తున్నది.

karimnagar : అధ్యక్షులెవరు?

- ఎటూ తేల్చని కాంగ్రెస్‌, బీజేపీ

- తర్జనభర్జన పడుతున్న అధిష్ఠానాలు

- నాయకులు, కార్యకర్తల్లో గందరగోళం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ తమ జిల్లా శాఖ అధ్యక్షులెవరో తేల్చడంలో తర్జనభర్జన పడుతున్నాయి. రోజులు గడిచినా కొద్ది ఈ వ్యవహారం జఠిలమవుతూ ఆ పార్టీల రాష్ట్ర నేతలకు తలనొప్పి కలిగిస్తున్నది. కాంగ్రెస్‌లో ఆశావహుల సంఖ్య పెరిగిపోతుంటే బీజేపీలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అనుచరవర్గంలోనే పోటీ నెలకొంది. దీంతో ఎవరిని ఎంపిక చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులెవరవుతున్నారో తెలియక ఆయా పార్టీల శ్రేణుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంటున్నది. జిల్లా పార్టీ అధ్యక్షుల నియామకం తర్వాత తమకు పార్టీ పదవులు దక్కుతాయనుకుంటున్న వారి ఆశలు రోజురోజుకు నీరుగారిపోతున్నాయి.

ఫ కాంగ్రెస్‌లో పోటాపోటీ

అధికార కాంగ్రెస్‌ పార్టీలో జాతీయ నాయకత్వం క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ జిల్లా అధ్యక్షులే ఇక ముందు అన్ని వ్యవహారాల్లో కీలక పాత్ర వహిస్తారని పేర్కొన్నది. దీంతో జిల్లా అధ్యక్ష పదవికి పోటీ పెరిగింది. అధికార పదవుల్లో ఉన్నవారు సైతం పార్టీ కార్యాలయానికి రావాలని, పార్టీ నాయకత్వంతో సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని అధిష్ఠానం చెప్పడంతో జిల్లా అధ్యక్ష పదవులు ఇప్పుడు ఆ పార్టీలో కీలకమయ్యాయి. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా మానకొండూర్‌ శాసన సభ్యుడు కవ్వంపల్లి సత్యనారాయణ వ్యవహరిస్తున్నారు. ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించాలని పార్టీ భావిస్తున్నది. అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో చొప్పదండి శాసన సభ్యుడు మేడిపల్లి సత్యం, కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పురమల్ల శ్రీనివాస్‌, సుడా చైౖర్మన్‌, కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, ప్రస్తుత జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు అంజన్‌కుమార్‌, నగర మాజీ అధ్యక్షుడు ఆకారపు భాస్కర్‌రెడ్డి, హౌస్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌ బొమ్మ శ్రీరాంచక్రవర్తి, మాజీ కౌన్సిలర్‌ మల్లికార్జున రాజేందర్‌ పోటీ పడుతున్నారు.

ఫ మంత్రుల నిర్ణయమే కీలకం

ఉమ్మడి జిల్లా పరిధి నుంచి శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ రాష్ట్ర మంత్రి వర్గంలో మంత్రులుగా ఉండడంతో వీరి నిర్ణయం, మద్ధతు అధ్యక్ష పదవి ఎంపికలో కీలకం కానున్నది. ఈ ఇద్దరు మంత్రులు ఉత్తర, దక్షిణ ధృవాలుగా ఉంటూ ఎవరి దారి వారిదన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. దీంతో ఏకాభిప్రాయం సాధ్యం కాక అధ్యక్షుని ఎంపిక ఆలస్యం అవుతున్నదని ప్రచారం జరగుతున్నది. పదవిని ఆశిస్తున్న వారిలో ఈ ఇద్దరు నేతలు తమకు విధేయులు ఎవరన్న విషయానికే ప్రాధాన్యం ఇస్తుండడంతో ఒకరు సూచించే అభ్యర్థి మరొకరికి నచ్చని పరిస్థితి ఏర్పడింది. ఆశావహులు కూడా రెండు వర్గాలుగా చీలిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లా అధ్యక్షుడి ఎంపిక ఆ పార్టీ అధిష్ఠానానికి చిక్కుముడిగా మారింది.

ఫ బీజేపీలో బండి సంజయ్‌ ఆశీస్సులు ఎవరికో..?

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ ఆశీస్సులు ఉన్న వారికే బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి దక్కుతుంది. ఆయన ఎవరి పేరు సూచిస్తే వారు అధ్యక్షుడిగా నియమితులు కావడం ఖాయం. అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడి, పార్లమెంట్‌ ఇన్‌చార్జి బోయినపల్లి ప్రవీణ్‌రావు, సీనియర్‌ నాయకుడు కొట్టె మురళీకృష్ణ, నగర శాఖ మాజీ అధ్యక్షుడు బేతి మహేందర్‌రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌ ఉన్నారు. మాజీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ, సీనియర్‌ నాయకుడు కన్నబోయిన ఓదెలు కూడా అధ్యక్ష పదవిని ఆశించారు. వయోపరిమితి కారణంగా వీరిద్దరి పేర్లు రేసు నుంచి తప్పించారు. గంగాడి కృష్ణారెడ్డి మొదటిసారి జిల్లా అధ్యక్ష పదవిని చేపట్టినప్పుడు పూర్తి కాలం పదవిని నిర్వహించలేదు. ఆ తర్వాత రెండో సారి అధ్యక్ష పదవి వరించింది. రెండు సార్లు అధ్యక్ష పదవిలో ఉన్న వారికి ఆ పదవి మళ్లీ ఇచ్చేది లేదని పార్టీ నిబంధన ఉన్నది. తను మొదటి విడతలో పూర్తి కాలం పదవిలో లేనందువల్ల తనను మళ్లీ అధ్యక్షుడిగా నియమించాలని ఆయన కోరుతున్నట్లు సమాచారం. బేతి మహేందర్‌రెడ్డి మినహా మిగతా అందరూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌కు విధేయ వర్గంలోనే ఉన్నారు. ఆయన జిల్లా అధ్యక్ష పదవికి క్రిష్ణారెడ్డి పేరు సూచించారని, రెండు విడతల పదవీ కాలం అనే నిబంధన అడ్డు వస్తున్నట్లు చెబుతున్నారు. పోటీలో ఉన్న కొట్టె మురళీకృష్ణ, బోయినపల్లి ప్రవీణ్‌రావు, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌ ముగ్గురు మంత్రి సంజయ్‌కి సన్నిహితులే కావడంతో ఎవరి పేరు చెప్పినా మిగతా ఇద్దరు నొచ్చుకుంటారనే భావనతో ఆయన ఎటు తేల్చుకోలేక పోతున్నారని ప్రచారం జరుగుతున్నది. బేతి మహేందర్‌రెడ్డి బండి సంజయ్‌ వర్గానికి చెందిన వారే అయినా ఆయన ఎంపీగా ఎన్నికైన తర్వాత రాజకీయంగా తీసుకున్న చర్యలతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఆ కారణంగానే మహేందర్‌రెడ్డి అధ్యక్ష పదవి పొందలేక పోతున్నారని చెబుతున్నారు. పార్టీలోని ఇతర విభాగాల సీనియర్‌ నేతలతోపాటు ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలతో కలిసి మహేందర్‌ తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారని, వారందరి సూచన మేరకు కేంద్ర మంత్రి సంజయ్‌ని కలిసి అధ్యక్ష పదవిని ఇవ్వాలని కోరారని సమాచారం. ఆయనకు పదవి రావడమనేది అంత సులువు కాదని అంటున్నారు. గంగాడి కృష్ణారెడ్డికి అధ్యక్ష పదవి రాని పక్షంలో మురళీకృష్ణ, ప్రవీణ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌లో ఒకరికి అవకాశం దక్కుతుంది.

Updated Date - Apr 14 , 2025 | 12:43 AM