Karimnagar: మంత్రుల ఎదుటే కొట్టుకున్న ఎమ్మెల్యేలు..
ABN, Publish Date - Jan 12 , 2025 | 04:53 PM
కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి(MLA Kaushik Reddy), సంజయ్ (MLA Sanjay) మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వాగ్వాదం కాస్త ముదిరి ఇద్దరు ఎమ్మెల్యేలూ పరస్పరం చేయి చేసుకున్నారు. జిల్లా సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పథకాలపై చర్చ జరిగింది.
కరీంనగర్: కలెక్టరేట్‌లో నిర్వహించిన కరీంనగర్ (Karimnagar) జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి (MLA Kaushik Reddy), సంజయ్ (MLA Sanjay) కొట్టుకున్నారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన సందర్భంగా జిల్లా సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పథకాలపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సహా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మైక్ తీసుకుని మాట్లాడే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన కౌశిక్ రెడ్డి నువ్వు ఏ పార్టీ అంటూ సంజయ్‌ను ప్రశ్నించారు. దమ్ముంటే కాంగ్రెస్ టికెట్‌పై గెలవాలని సవాల్ చేశారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. వాగ్వాదం కాస్తా ముదిరి ఇద్దరూ ఒకరిపై మరొకరు చేయి చేసుకున్నారు. మంత్రుల ఎదుటే కొట్టుకున్నారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు కౌశిక్ రెడ్డిని కలెక్టరేట్ నుంచి బలవంతంగా బయటకు లాక్కెళ్లారు. వివాదం నేపథ్యంలో అక్కడంతా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కాగా, బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీకి సపోర్టుకు మాట్లాడడం ఏంటని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. మరోవైపు కౌశిక్ రెడ్డి ఎక్కడుంటే అక్కడ వివాదాలు ఉంటాయని కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరుపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని మంత్రి ఉత్తమ్ తీవ్రంగా ఖండించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ను అడ్డుకుని దాడి చేయడంపై కరెక్ట్ కాదంటూ మండిపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Revanth Reddy: స్పోర్ట్స్ యూనివర్సిటీపై రేవంత్ కీలక ప్రకటన
MLA Anil :మరోసారి తెరపైకి నయీం ఆస్తుల వివాదం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
Updated Date - Jan 12 , 2025 | 06:03 PM