అంగన్‌వాడీల్లో పోషణ సంబరాలు
ABN , Publish Date - Apr 15 , 2025 | 11:39 PM
నేటి ఆధునిక జీవన విధానంలో నాణ్యమైన పోషకాహారాన్ని తీసుకోవాలని వైద్యులు, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక చిన్నారుల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఈ క్రమంలో మహిళా శిశు సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.

గణేశ్‌నగర్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): నేటి ఆధునిక జీవన విధానంలో నాణ్యమైన పోషకాహారాన్ని తీసుకోవాలని వైద్యులు, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక చిన్నారుల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఈ క్రమంలో మహిళా శిశు సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ఇంటి వద్ద సమతుల ఆహారం అందించడంపై పేదరికం, కుటుంబ పరిస్థితులు, తదితర కారణాలతో తల్లిదండ్రులు తగిన శ్రద్ద చూపడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవనం గడిపే వారు అధికం. వీరికి పోషకాలపై అవగాహన ఉండడం లేదు. ఈ నేపథ్యంలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు పోషకాహార లోపాన్ని అధిగమించి సంపూర్ణ ఆరోగ్య సమాజం కోసం రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 8 నుంచి పోషణ పక్షం 2025 పోషణ్ అభియాన్ పేరిట ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. పోషకాహార లోపంలేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో కార్యక్రమాలను రూపొందించారు. ఈనెల 22 వరకు ఈ అవగాహన కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
ఫ జిల్లాలో 777 అంగన్‌వాడీ కేంద్రాలు
జిల్లాలో గంగాధర, హుజూరాబాద్, కరీంనగర్‌రూరల్, కరీంనగర్ అర్బన్, నాలుగు ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 777 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో బాలింతలు 4223 మంది, గర్భిణులు 4159 మంది, 7 నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు 21,034 మంది. 03-06 ఏళ్ల లోపు చిన్నారులు 26,433 మంది ఉన్నారు. ప్రజల్లో పోషకాహారం, ఆరోగ్యర క్షణ, పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు మహిళా శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించింది. ఐసీ డీఎస్, స్వచ్చంద సంస్థలు, విద్యాలయాలు, ఆరోగ్యశాఖ, ఆయుష్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రక్షిత మంచినీటి శాఖ, వివిధ శాఖల భాగస్వామ్యంతో ఈనెల 22 వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు.
ఫ చేపట్టే కార్యక్రమాలు:
శిశువు పుట్టినప్పటి నుంచి రెండేళ్ల వయస్సు వరకు వెయ్యి రోజుల ప్రణాళికలో భాగంగా వారి ఆరోగ్యం, సంరక్షణ, తల్లిపాల ప్రాధాన్యం, అనుబంద పోషకాలు, ఎదుగుదలతోపాటు పర్యావరణ పరిరక్షణ, పిల్లల్లో ఊబకాయం నివారణకు యోగా వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రజల భాగస్వామ్యం, వివిధ శాఖల సహకారంతో పోషణ పక్షోత్సవాలను నిర్వహిస్తున్నారు.
ఫ విద్యకు ప్రాధాన్యం
పోషణ్ భీ- పడాయి భీ (ఆరోగ్యంతో పాటు విద్య...) సూత్రంతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రీ ప్రైమరీ దశలో శిశువులకు విద్యపై ఆసక్తి కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులకు విద్య ప్రాధాన్యం తెలిపి పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు కృషి చేస్తున్నారు. ఈ మేరకు పక్షత్సవాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు విద్య పై ఆసక్తి కల్పించేందుకు వినూత్న పద్ధతుల్లో చేపడుతున్న బోధన మార్గాలను తెలియజేస్తున్నారు. ఆట వస్తువులు, బొమ్మలు ఇతరత్రా మార్గాల ద్వారా వారికి విద్యపై ఆసక్తి కలిగేలా చర్యలు తీసుకుంటున్నారు. చిరు ప్రాయంలోనే పిల్లలకు విద్యపై ఆసక్తి కల్పించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేయాలనే సంకల్పంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఫ చిన్నారులు, మహిళల ఆరోగ్య సంరక్షణే లక్ష్యం
- సబిత, ఇన్‌చార్జి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి
చిన్నారులు, బాలింతలు, గర్భిణుల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ నేతృత్వంలో జిల్లావ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ నెల 8 నుంచి పోషణ పక్షోత్సవాలను నిర్వహిస్తున్నాం. జిల్లాలోని 777 అంగన్‌వాడీ కేంద్రాల్లో షెడ్యూల్ ప్రకారం ఈ నెల 22 వరకు పోషణపక్షం కార్యక్రమాల నిర్వహణకు చర్యలు చేపట్టాం.