మక్కలకు మద్దతు ధర దక్కేనా..?
ABN , Publish Date - Apr 08 , 2025 | 12:51 AM
మొక్కజొన్న రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో చేతికి వచ్చిన పంటను దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. వరదలతో వానాకాలంలో చాలా మంది మొక్కజొన్న రైతులు నష్టపోయారు. కొన్ని చోట్ల రైతులకు పెట్టుబడి కూడా దక్కలేదు.

జగిత్యాల, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): మొక్కజొన్న రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో చేతికి వచ్చిన పంటను దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. వరదలతో వానాకాలంలో చాలా మంది మొక్కజొన్న రైతులు నష్టపోయారు. కొన్ని చోట్ల రైతులకు పెట్టుబడి కూడా దక్కలేదు. ఇలాంటి తరుణంలో యాసంగిలో మొక్కజొన్న సాగు చేస్తే మద్దతు ధర దక్కకపోవడం అన్నదాతకు శాపంగా మారింది. గతంతో పోలిస్తే ప్రస్తుత సీజన్‌లో దిగుబడి తక్కువగా ఉన్నప్పటికీ ధర బాగుంటుందని ఆశించిన రైతులకు నిరాశే మిగులుతోంది. ఒకవైపు ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం, మరోవైపు వ్యాపారులు సరియైన ధరకు కొనకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 30 వేల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. ఎకరాకు రూ.30 వేల నుంచి 40 వేల వరకు పెట్టుబడి పెట్టారు. మొగి పురుగు, కత్తెర పురుగు తదితర తెగుళ్ల నివారణకు, పందులు, కోతుల బారి నుంచి పంట రక్షణకు కంచె అమర్చేందుకు అదనంగా వెచ్చించారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు, పౌలీ్ట్ర నిర్వాహకులు ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారు.
ఫ12 కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు...
జిల్లాలో 12 ప్రాంతాల్లో మార్క్‌ఫెడ్ ఆద్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. దాదాపుగా ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే పంట చేతికి వచ్చి పదిహేను రోజులకు పైగా గడుస్తుండడంతో ఇప్పటికే దళారులకు మొక్కజొన్నను రైతులు విక్రయించారు. జిల్లాలోని కథలాపూర్, మల్లాపూర్‌లో పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో, ఇబ్రహీంపట్నం, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, మేడిపల్లి, రాయికల్, ధర్మపురి, గొల్లపల్లి, మల్యాల, పెగడపల్లిలలో డీసీఎంఎస్‌ల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను నిర్వహించడానికి మార్క్‌ఫెడ్ కసరత్తులు పూర్తి చేసింది.
ఫపడిపోతున్న ధర
గత యేడాది క్వింటాలు ధర మక్కలకు రూ. 2,400 పలికింది. మొన్నటి వరకు క్వింటాలుకు రూ.2,200 పైనే ఉన్న ధర పంట రైతులచేతికచ్చే సమయానికి పతనమైంది. ప్రస్తుతం క్వింటాలు మక్కల ధర రూ.2,000 నుంచి రూ. 2,100 వరకే చెల్లిస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర రూ.2,225 ఉండగా దళారులు, పౌలీ్ట్ర నిర్వాహకులు ఇంతకంటే తక్కువకే కొనుగోలు చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గ్రామాల్లో మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఈ పరిస్థితి తలేత్తేది కాదని రైతులు వాపోతున్నారు.
ఫజీరో వ్యాపారంపై కట్టడి ఏది..?
గ్రామాల్లో రైతుల వద్దకే వచ్చి కొనుగోళ్లు చేపడుతున్న వ్యాపారులకు ట్రేడ్ లైసెన్స్ ఉందా..?వారు వినియోగిస్తున్న కాంటాలకు స్టాంపింగ్ ఉందా..? తరుగు పేరిట అదనంగా ఎంత తూకం వేస్తున్నారు..? తదితర విషయాలను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించడం లేదు. దీంతో కల్లాల వద్దకే వ్యాపారులు వెళ్లి మక్కలు కొనుగోలు చేస్తున్నారు. పలువురు ఎటువంటి లైసెన్స్‌లు లేకుండా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. కొందరు లైసెన్స్ ఉన్న వ్యాపారులు కొనుగోలు చేసిన మక్కలను ఎలాంటి మార్కెట్ సెస్ చెల్లించకుండానే ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు నిఘా పెంచాలని పలువురు రైతులు కోరుతున్నారు.
ఫమంత్రి తుమ్మలను కలిసిన ఎమ్మెల్యే సంజయ్
జిల్లాలోని పలు ప్రాంతాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కలిసి సమస్యను విన్నవించారు. జిల్లాలో వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటను రైతులు పండించారని, కొనుగోలు కేంద్రాలు లేకపోవడం వల్ల పంట ఉత్పత్తులను విక్రయించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ప్రభుత్వం ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పరచి మద్దతు ధరతో మొక్కజొన్న కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరుస్తారని రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు.
ప్రతీ యేటా ఇబ్బందులు తప్పడం లేదు..
-బుర్రగళ్ల మల్లయ్య, రైతు, రేచపల్లి
మొక్కజొన్న రైతులకు ప్రతీ యేటా ఇబ్బందులు తప్పడం లేదు. పంట సాగు సమయంలో చీడ పీడల దాడి వల్ల నష్టాలు ఎదుర్కొన్నాం. తదుపరి అకాల వర్షాలు, ఈదురు గాలుల వల్ల నష్టపోయాం. ప్రస్తుతం పంట చేతికి వచ్చిన సమయంలో మార్కెట్‌లో గిట్టుబాటు ధర రావడం లేదు.
సాధ్యమైనంత త్వరగా కేంద్రాలు ప్రారంభిస్తాం
-ఎండీ హబీబ్, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్
జిల్లాలో పన్నెండు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడానికి కసరత్తు పూర్తి చేశాం. సాధ్యమైనంత తొందరలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. రైతులు నాణ్యమైన మొక్కజొన్నను కేంద్రాలకు తరలించి మద్దతు ధర పొందాలి.