Konda Surekha: ప్రతీది రాజకీయం చేస్తున్న బీఆర్‌ఎస్: సురేఖ
ABN, Publish Date - Jan 19 , 2025 | 04:12 AM
‘‘కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతి పనిని బీఆర్‌ఎస్ రాజకీయం చేస్తున్నది. మాజీ మంత్రి కేటీఆర్ తెలివి ఉండి మాట్లాడుతున్నారా.. తెలివి లేక మాట్లాడుతున్నారా?..

చేగుంట/దుబ్బాక, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతి పనిని బీఆర్‌ఎస్ రాజకీయం చేస్తున్నది. మాజీ మంత్రి కేటీఆర్ తెలివి ఉండి మాట్లాడుతున్నారా.. తెలివి లేక మాట్లాడుతున్నారా?.. ఆయన పదేళ్లు మంత్రిగా ఉన్నట్లు మాట్లాడటం లేదు. 100 శాతం రుణమాఫీ కళ్లకు కనిపించడం లేదా?’’ అని మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో శనివారం ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో చేగుంట, నార్సింగి మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంత్రి కల్యాణలక్ష్మి, షాదీముబాకర్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె లేకరులతో మాట్లాడుతూ.. కల్యాణ లక్ష్మి, షాదీముబాకర్ పథకాలు పేదింటి ఆడపిల్లలకు వరం అని, అందుకే ప్రభుత్వం మారినా వాటిని కొనసాగిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వాలు మారినా పథకాలు ప్రజలకు అవసరం అనుకుంటే వాటిని అమలు చేయడం పాలకుల బాధ్యత అన్నారు.
మంత్రి సురేఖ పర్యటనలో ప్రొటోకాల్ వివాదం
మంత్రి కొండా సురేఖ పర్యటన ప్రొటోకాల్ వివాదం, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణంలో కొనసాగింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివా్‌సరెడ్డి వేదికపై ముందు వరుసలో కూర్చోవడంపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. దీంతో మంత్రి సురేఖ కల్పించుకుని శ్రీనివా్‌సరెడ్డిని వెనుక కూర్చొమని సర్దిచెప్పగా, ఆయన వెనకాలకు వెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు హోరీహోరీ నినాదాలు మార్మోగాయి. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇందిరమ్మ ఇళ్ల నమూనా భూమి పూజ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఫొటోను గృహనిర్మాణ శాఖ అధికారులు విస్మరించారు. దీంతో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మంత్రి సురేఖ అధికారులపై మండిపడ్డారు.
Updated Date - Jan 19 , 2025 | 04:12 AM