PCC Chief Statement: కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యల వెనుక కుట్ర
ABN , Publish Date - Apr 16 , 2025 | 04:10 AM
కొత్త ప్రభాకర్‌రెడ్డి చేసిన ప్రభుత్వ కూల్చే వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ వ్యాఖ్యలు కేసీఆర్ సూచనలతో జరిగాయని ఆరోపిస్తూ, చర్యలకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

కేసీఆర్ సూచనలతోనే ఆ వ్యాఖ్యలు
దుబ్బాక ఎమ్మెల్యేపై కాంగ్రెస్ ఆగ్రహం
ఎమ్మెల్యేలేమైనా సంతలో వస్తువులా?
విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం: పీసీపీ చీఫ్
నోవాటెల్‌లో సీఎం రేవంత్‌కు తప్పిన ప్రమాదం
ముఖ్యమంత్రి వెళ్తున్న లిఫ్ట్ మొరాయింపు
శంషాబాద్ రూరల్/హైదరాబాద్ సిటీ/తొగుట/చేగుంట/రాయపోల్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిందిగా బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు తమను కోరుతున్నారంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు, మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలను.. ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రకోణంగా భావిస్తున్నామని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకునే దిశగా ఆలోచిస్తామన్నారు. మంగళవారం నోవాటెల్ హోటల్‌లో నిర్వహించిన సీఎల్పీ సమావేశానికి ముందు వారు మాట్లాడారు. తొలుత పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. కొనుగోలు చేయడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలేమైనా సంతలో వస్తువులా? అని మండిపడ్డారు. చోటా మోటా కాంట్రాక్టర్లు కూల్చితే కూలే ప్రభుత్వం తమది కాదని, ఇలాంటి వారికి భయపడబోమని చెప్పారు. తమ ఎమ్మెల్యేలకు ప్రజల సంపూర్ణ మద్దతు ఉందన్నారు. కాగా, కొత్త ప్రభాకర్‌రెడ్డి.. కేసీఆర్ ఆత్మ అని, ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో భాగంగానే ఆయన వ్యాఖ్యలు చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ల సూచనలతోనే ప్రభాకర్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. భూభారతిని తీసుకురావడంతోనే వారికి భయం పట్టుకుందని, గతంలో చేసిన అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనని ఆందోళన చెందుతున్నారని తెలిపారు. కాగా, తమ ప్రభుత్వంపై మొదటి నుంచీ కుట్రలు జరుగుతూనే ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి ట్రాన్స్‌పోర్టు వ్యాపారి అనుకున్నానని, కానీ.. ఆయన ఈ మధ్య జ్యోతిష్యం కూడా చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
ప్రభాకర్‌రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదులు..
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన సొంత నియోజకవర్గం దుబ్బాకలోని తొగుటలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు మంగళవారం ప్రభాకర్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ప్రభాకర్‌రెడ్డిపై రాజద్రోహం కేసు నమోదు చేయాలంటూ తొగుట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చేగుంటలోనూ ఎమ్మెల్యేపై పోలీసులకు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. రాయపోల్‌లో ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే కొత్త ప్రభాకరరెడ్డిని అరెస్టు చేసి విచారించాలని టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు హైదరాబాద్‌లోని బేగంబజార్ పోలీ్ స స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డికి తప్పిన ప్రమాదం
సీఎల్పీ సమావేశానికి హాజరుకావడానికి ఎయిర్‌పోర్టులోని నోవాటెల్ హోటల్‌కు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన వెళుతున్న లిఫ్ట్ ఓవర్‌లోడ్ కారణంగా ఒక్కసారిగా కిందకు దిగింది. 8 మంది ఎక్కాల్సిన లిఫ్ట్‌లో 13 మంది ఎక్కడంతో అది మొరాయించింది. ఓవర్ లోడ్‌తో అలారం మోగడంతో అప్రమత్తమైన భద్రత , హోటల్ సిబ్బంది వెంటనే లిఫ్ట్‌లో నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను కిందకి దించారు. సీఎంను వేరే లిఫ్ట్‌లో పంపించారు. కాగా, ఓవర్ లోడ్ కారణంగానే లిఫ్ట్ పైఫ్లోర్‌కు వెళ్లకుండా ఆగిపోయిందని పోలీసులు తెలిపారు. సీఎంకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు.