Share News

Krishna Water Dispute: కృష్ణాలో 72PER ఏపీకే

ABN , Publish Date - Apr 16 , 2025 | 05:18 AM

ఈ ఏడాది కృష్ణా జలాల్లో ఏపీ 72% నీటిని వినియోగించగా, తెలంగాణకు కేవలం 28% మాత్రమే లభించింది. కేడీఎస్‌కు కొత్తగా నీటి కేటాయింపులు అవసరం లేదని తెలంగాణ ట్రైబ్యునల్‌కి వాదనలు వినిపించింది.

Krishna Water Dispute: కృష్ణాలో 72PER ఏపీకే

  • ఈ ఏడాది 715 టీఎంసీల నీటి వినియోగం

  • తెలంగాణ వాడుకుంది 27.80 శాతమే

  • మొత్తం 990 టీఎంసీల్లో 275 టీఎంసీలే

  • నీటి వాడకంపై లెక్కలు తీసిన కృష్ణా బోర్డు

  • కేడీఎస్‌కు కొత్తగా కృష్ణా జలాలు అక్కర్లేదు

  • కృష్ణా ట్రైబ్యునల్‌లో తెలంగాణ వాదనలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): కృష్ణా బేసిన్‌లో నీటి వినియోగం విషయంలో మరోసారి తెలంగాణకు మరోసారి తీవ్ర నష్టం జరిగింది. ఈ వాటర్‌ ఇయర్‌ (2024-2025)లో కూడా తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్‌ పెద్దఎత్తున నీటిని అధికంగా వినియోగించుకుంది. 2024 జూన్‌ 1 నుంచి ఈ నెల 14వ తేదీ రాత్రి వరకు రెండు తెలుగు రాష్ట్రాల నీటి వినియోగం 990.382 టీఎంసీలుగా ఉండగా.. ఇందులో 715.031 టీఎంసీలను (72.20 శాతం) ఏపీయే వాడుకున్నట్లు కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) గుర్తించింది. తెలంగాణ కేవలం 275.350 టీఎంసీలు (27.80 శాతం) మాత్రమే వినియోగించుకున్నట్లు తేల్చింది. మరో 45 రోజుల్లో వాటర్‌ ఇయర్‌ ముగియనుండగా.. కృష్ణా బేసిన్‌లో ఎవరెంత మేర నీటిని వినియోగించారనే దానిపై కేఆర్‌ఎంబీ లెక్కలు తీసింది. వాస్తవానికి కృష్ణాలో చెరో 50 శాతం చొప్పున సమానంగా నీటిని పంచాలంటూ తెలంగాణ గత రెండేళ్లుగా పట్టుబడుతోంది. కానీ, దీనిపై తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి ఒప్పందాలు లేవు. కృష్ణా నీటి కేటాయింపులపై జస్టిస్‌ బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌లో విచారణ జరుగుతోంది. అయితే అప్పటిదాకా నీటి పంపిణీ అధికారాలను త్రిసభ్య కమిటీ (కృష్ణాబోర్డు సభ్య కార్యదర్శి, రెండు తెలుగు రాష్ట్రాల ఈఎన్‌సీలు)కి ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2015లో ఆ ఒక్క ఏడాదికే 63, 37% చొప్పున కృష్ణా జలాల పంపిణీకి తాత్కాలిక ఒప్పందం జరిగింది. అయితే రెండేళ్లపాటు వాటా మేరకు వినియోగం లేకపోవడంతో ఏపీ 66ు, తెలంగాణ 34ు చొప్పున నీటిని పంచుకున్నాయి. 2015 ఒప్పందం క్రమంగా 2022-23 దాకా కొనసాగింది. ఆ తరువాత 2023-24 వాటర్‌ ఇయర్‌లో నీటిని 50 శాతం చొప్పున పంచాలంటూ తెలంగాణ పట్టుబట్టింది.


దీంతో నీటి వాటాను తేల్చే బాధ్యతను అపెక్స్‌ కౌన్సిల్‌ (కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మండలి)కి కట్టబెడుతూ కృష్ణాబోర్డు తీర్మానం చేసింది. అయితే నీటి పంపిణీ బాధ్యత అపెక్స్‌ కౌన్సిల్‌కు లేదని, తెలుగు రాష్ట్రాలే తేల్చుకోవాలని జలశక్తి శాఖ పేర్కొంది. కానీ, త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకోకముందే జలాశయాలు ఖాళీ అయ్యాయి.

కేడీఎస్‌కు కొత్తగాకృష్ణా జలాల కేటాయింపు వద్దు

కృష్ణా డెల్టా సిస్టమ్‌ (కేడీఎ్‌స)కు కొత్తగా కృష్ణా జలాలను కేటాయించాల్సిన అవసరం లేదని తెలంగాణ పేర్కొంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు నుంచి 80 టీఎంసీలు, పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మరో 105 టీఎంసీలు, డ్రైన్లలో అదనంగా 42 టీఎంసీలు కేడీఎ్‌సకు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. పైగా రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ తరువాత గోదావరి బేసిన్‌ నుంచి పెన్నా బేసిన్‌కు భారీగా నీటిని తరలించడానికి గోదావరి-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టును ఏపీ సర్కారు చేపట్టిందని నివేదించింది. ఈ మేరకు మంగళవారం జస్టిస్‌ బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌లో నీటి కేటాయింపులపై తెలంగాణ తరఫున సీనియర్‌ న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్‌ వాదనలు వినిపించారు. పోలవరం ప్రాజెక్టు రెండు కాలువల నుంచి 10 వేల క్యూసెక్కుల దాకా నీటిని తరలించడానికి అనుమతినివ్వగా.. ఆ తర్వాత వీటి సామర్థ్యం పెంచుకున్నారని నివేదించారు. తాజాగా పోలవరం కుడి ప్రధాన కాలువ(ఆర్‌ఎంసీ) నుంచి రోజుకు 1.5 టీఎంసీల దాకా తరలించడానికి వీలుగా పనులు చేస్తున్నారని తెలిపారు. ఏకంగా 135 టీఎంసీలను పోలవరం నుంచి తరలించడానికి వీలుగా పనులు చేపట్టారని వివరించారు. కాగా, మరో రెండు రోజులపాటు తెలంగాణ వాదనలు వినిపించనుంది.

Updated Date - Apr 16 , 2025 | 05:18 AM