KTR: నాది తప్పయితే.. రేవంత్ చేసిందీ తప్పే
ABN, Publish Date - Jan 02 , 2025 | 03:03 AM
‘‘నాడు పురపాలక శాఖ మంత్రిగా ఫార్ములా -ఈ రేసు ఈవెంట్‌కు నేను అనుమతిస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి దాన్ని రద్దు చేశారు. ఈ విషయంలో నేను చేసింది తప్పయితే.. ఇప్పుడు రేవంత్ చేసింది కూడా తప్పే.
ఫార్ములా-ఈ రేస్‌ను రద్దు చేసినందుకు ఆయనపై కూడా కేసు పెట్టాలి
ఏసీబీ, ఈడీ కేసులను దీటుగా ఎదుర్కొంటా
సుప్రీంకోర్టు తిట్లు తిన్న ఏకైక సీఎం రేవంత్: కేటీఆర్
హైదరాబాద్, జనవరి 1 (ఆంధ్రజ్యోతి) : ‘‘నాడు పురపాలక శాఖ మంత్రిగా ఫార్ములా -ఈ రేసు ఈవెంట్‌కు నేను అనుమతిస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి దాన్ని రద్దు చేశారు. ఈ విషయంలో నేను చేసింది తప్పయితే.. ఇప్పుడు రేవంత్ చేసింది కూడా తప్పే. ఇద్దరి నిర్ణయాలపై క్యాబినెట్‌లో చర్చ జరగలేదు. ఈ మేరకు రేవంత్‌పైనా కేసు పెట్టాలి’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం మీడియా ప్రతినిధులతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తనపై ఏదో ఓ కేసు నమోదు చేసి, జైలుకు పంపాలని ఆరు సార్లు ప్రయత్నించారని పేర్కొన్నారు. ఏసీబీ ఎఫ్‌ఐఆర్ తప్పుల తడకగా ఉందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు సంబంధంలేని అంశాలను అందులో ఇరికించారన్నారు. తాను ఇలాంటి వాటికి భయపడనని, ఏసీబీ కేసు, ఈడీ నోటీసును న్యాయపరంగా ఎదుర్కొంటానన్నారు. రైతు భరోసాను కుదించే ప్రయత్నంలో భాగంగా సెల్ఫ్ డిక్లరేషన్ అంశాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని దుయ్యబట్టారు. సుప్రీం కోర్టుతో తిట్లు తిన్న ఏకైక సీఎం రేవంత్‌రెడ్డి మాత్రమేనని.. చివరకు ఆయన కోర్టుకు క్షమాపణ చెప్పాల్సి వచ్చిందన్నారు.
అప్పు చేయకపోవడమే అభివృద్ధి అన్న రేవంత్... ఇప్పుడు రూ.1.35లక్షల కోట్లు ఎందుకు అప్పు చేశారని ప్రశ్నించారు. అందులో ఆర్‌ఆర్‌ట్యాక్స్ రూపంలో ఢిల్లీ పెద్దలకు ఎన్ని ముడుపులు వెళ్తున్నాయో చెప్పాలన్నారు. కాంగ్రెస్ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలంతా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో ఉన్నారని, ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క అవినీతి దుకాణం తెరిచారని ఆరోపించారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజల తరఫున తమ పార్టీ ఇచ్చేది మైనస్ మార్కులేనని చెప్పారు. సమాజంలో ఏ ఒక్కరిని అడిగినా.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బండ బూతులు తిడుతున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచన రేవంత్‌రెడ్డి సర్కార్‌కు లేదని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తా చాటుతుందని జోస్యం చెప్పారు. కాంగ్రె్‌సలో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల స్థానాల్లో ఈ ఏడాది ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఏడాదంతా పార్టీ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామన్నారు. ఏప్రిల్ 27న బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. అంతకుముందు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రూపొందించిన 2025 క్యాలెండర్, డైరీని కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
Updated Date - Jan 02 , 2025 | 03:03 AM