Share News

బంతి బంతికీ లెక్క!

ABN , Publish Date - Apr 01 , 2025 | 11:37 PM

ఐపీఎల్‌ మ్యాచ్‌లు జోరుగా కొనసాగుతున్నాయి. కోట్లాది మంది క్రికెట్‌ అభిమానులు టీవీలకు అతుక్కుపోతున్నారు.

బంతి బంతికీ లెక్క!

- ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లకు పాల్పడుతున్న యువత

- సొంతంగా యాప్‌లనుక్రియేట్‌ చేసుకున్న నిర్వాహకులు

- టీకొట్లు, హోటళ్లు, లాడ్జింగులే అడ్డాలు

జడ్చర్ల, ఏప్రిల్‌ 1 : (ఆంధ్రజ్యోతి) : ఐపీఎల్‌ మ్యాచ్‌లు జోరుగా కొనసాగుతున్నాయి. కోట్లాది మంది క్రికెట్‌ అభిమానులు టీవీలకు అతుక్కుపోతున్నారు. మరి కొందరు స్టేడియంలకు వెళ్లి మ్యాచ్‌లను తిలకిస్తున్నారు. ప్రతీ మ్యాచ్‌ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. అదే తీరుగా బెట్టింగుల జోరూ కొనసాగుతోంది. బెట్టిం గ్‌లు నిర్వహించేందుకు బుకీలు, ఫంటర్‌లు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. గతంలో బెట్టింగ్‌లకు పాల్పడిన వారితో పాటు, బాగా తెలిసిన వారిని ఆకర్షిస్తున్నారు. బంతి బంతికీ బెట్టింగ్‌ చేస్తున్నారు. మ్యాచ్‌ చూస్తూనే ఓవర్‌లో ఇన్ని పరుగులు వస్తాయని, ఇన్ని సిక్స్‌లు, ఫోర్‌లు కొడ్తారని, ఓ బ్యాట్స్‌మెన్‌ అత్యధిక స్కోర్‌ చేస్తా డని, బౌలర్‌ ఇన్ని వికెట్లు తీస్తాడని, మొదటి బ్యాటింగ్‌ చేసిన జట్టు ఇంత స్కోర్‌ చేస్తుందని, ఏ బంతికి ఔట్‌ అవుతాడని.. ఇలా మ్యాచ్‌లో ప్రతి అంశంపైన బెట్టింగులు నిర్వహిస్తూ యువకులను ఆకర్షిస్తున్నారు. ఇలా రహస్యంగా బెట్టింగులు కొనసాగిస్తూ నిర్వాహకులు కోట్ల రూపాయలు దండుకుంటుండగా, పందేలు కాస్తున్న వారు మాత్రం సర్వం కోల్పోతున్నారు.

మ్యాచ్‌ ప్రారంభానికి ముందే..

మ్యాచ్‌ ప్రారంభం కంటే ముందే ఏ జట్టు గెలుస్తుం దనే అంశంపై బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. మరి కొందరు మ్యాచ్‌ కొనసాగుతుండగా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నా రు. అందుకు పట్టణాల శివారుల్లో ఉన్న కొన్ని ఛాయ్‌ హోటళ్లు బెట్టింగులకు అడ్డాగా మారినట్లు తెలుస్తోంది. అక్కడ ఏర్పాటు చేసిన భారీ స్ర్కీన్లలో మ్యాచ్‌లు చూస్తూ బెట్లు కడుతున్నారు. మరికొందరు హోటళ్లు, లాడ్జింగ్‌లలో గదులను అద్దెకు తీసుకుని, టీవీల్లో మ్యా చ్‌లను చూస్తూ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. ఇప్పటి కే రెండు, మూడు పర్యాయాలు బెట్టింగ్‌ నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడిన జడ్చర్లకు చెందిన ఓ యువకు డు సొంతంగా యాప్‌లను క్రియేట్‌ చేసి, ప్రస్తుతం ఆన్‌లైన్లో బెట్టింగులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అలాగే ఉమ్మడి జిల్లాలో కొందరు బ్రోకర్‌ల అవతారం ఎత్తారు. ప్రధాన పట్టణాలలోని బుకీలు, ఫంటర్‌లకు సంబంధించిన ఫోన్‌ నెంబర్లను బెట్టింగులకు పాల్పడే వారికి ఇచ్చి, వారి నుంచి కమీషన్లు తీసుకుంటున్నట్లు తెలిసింది.

అప్పుల ఊబిలో యువత

బెట్టింగ్‌లతో సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చన్న దురాశతో కొందరు యువకులు వేలాది రూపాయలు నష్టపోతున్నారు. ఒక వేళ బెట్టింగ్‌లో గెలిచినా, సదరు బుకీ, ఫంటర్‌, బ్రోకర్లు డబ్బులు ఇవ్వకపోవడంతో ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో అప్పుల ఊబిలో చిక్కు కుంటున్నారు. నష్టపోయిన యువకులు పోగొట్టుకున్న డబ్బును ఎలాగైనా సంపాదించు కోవాలన్న ఆశతో మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు, బంగారు వస్తువులు, బైకులు, కార్లు, విలువైన వస్తువలను కుదువ పెట్టి అప్పులు తీసుకుని మరీ బెట్టింగ్‌ చేస్తున్నారు. మళ్లీ మళ్లీ నష్టపో తున్నారు. దీంతో చేసిన అప్పులు తీర్చలేక, తల్లిదండ్రు లకు చెప్పుకోలేక కొందరు యువకులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

కేసులు నమోదవుతున్నా...

బెట్టింగ్‌రాయళ్లపై కేసులు నమో దవుతున్నా దందా మాత్రం ఆగడం లేదు. రెండు సంవత్సరాల క్రితం మహబూబ్‌నగర్‌ పట్టణంలోని ఓ వైన్స్‌లో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఏడుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. గద్వాల జిల్లాలో గత సంవత్సరం వేర్వేరుగా నమోదయిన రెండు బెట్టింగ్‌ సంఘటనల్లో 16 మందిపై కేసులు నమోదయ్యాయి. అలాగే ఆన్‌లైన్లో బెట్టింగ్‌కు పాల్పడుతూ జడ్చర్లకు చెందిన ఓ యువకుడు కర్నూలులో పట్టుబడ్డాడు. అతడిపై హైదరాబాద్‌లోనూ కేసులు నమోద య్యాయి. కాగా ఆ వ్యక్తే ప్రస్తుత సీజన్‌లో ప్రత్యేక యాప్‌లను తయారు చేసి ఆన్‌లైన బెట్టిం గ్‌లకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

లక్షల రూపాయలు నష్టపోయి..

ఉమ్మడి జిల్లాలో క్రికెట్‌ బెట్టింగ్‌లతో లక్షల రూపాయలు నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడిన సంఘ టన లున్నాయి. రెండు రోజుల క్రితం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు బెట్టింగులతో రూ. 5 లక్షలు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. గత సంవత్సరం ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు దాదాపు రూ. 80 లక్షలు బెట్టింగులో పెట్టి పోగొట్టుకోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు.

కఠిన చర్యలు తీసుకుంటాం

క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహించినా, పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటాం. బెట్టింగ్‌ నిర్వాహకులు, పాల్గొనే వారిపై ఇప్పటికే నిఘా పెట్టాం. ఇప్పటికే కొందరిని బైండోవర్‌ కూడా చేశాం. కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటాం. తమ పిల్లలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నా, ఇంట్లో విలువైన వస్తువులు మాయం అవుతున్నా, ఆందోళనకు గురవుతున్నట్లు గుర్తించినా తల్లిదం డ్రులు, కుటుంబ పెద్దలు అప్రమత్తం కావాలి. బె ట్టింగ్‌లతో యువకులు జీవితాలను నాశనం చేసుకోవద్దు.

వెంకటేశ్వర్లు, డీఎస్పీ, మహబూబ్‌నగర్‌

Updated Date - Apr 01 , 2025 | 11:37 PM