శాంతికి మేం సిద్ధం!
ABN, Publish Date - Apr 03 , 2025 | 05:21 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘ఆపరేషన్ కగార్’ పేరుతో కొనసాగిస్తున్న నరమేధాన్ని నిలిపివేస్తే.. శాంతిచర్చలకు, కాల్పుల విరమణకు తాము సిద్ధంగా ఉన్నామని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ప్రకటించింది.

ఆపరేషన్ కగార్ నిలిపేస్తే.. కాల్పుల విరమణ
కగార్ ఓ నరమేధం.. 400 మంది హత్య
అమానుష చిత్రహింసలు పెట్టి, మహిళలపై గ్యాంగ్‌రేప్ చేసి చంపుతున్నారు
సొంత ప్రజలపై సైన్యం.. రాజ్యాంగవ్యతిరేకం
కార్పొరేట్లకు వనరుల అప్పగింత, దోపిడీ సుస్థిరం.. ఇవే ‘హిందూరాష్ట్ర’ లక్ష్యాలు
బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు
కేంద్రం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలే దోషులు
మావోయిస్టు పార్టీ బహిరంగ ప్రకటన
హైదరాబాద్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘ఆపరేషన్ కగార్’ పేరుతో కొనసాగిస్తున్న నరమేధాన్ని నిలిపివేస్తే.. శాంతిచర్చలకు, కాల్పుల విరమణకు తాము సిద్ధంగా ఉన్నామని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ప్రకటించింది. చత్తీ్‌సగఢ్, మహారాష్ట్ర (గడ్చిరోలి), ఒడిశా, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చేస్తున్న హత్యాకాండలను నిలిపివేయాలని, బస్తర్‌లోని సాయుధ బలగాలను బ్యారక్‌లకే పరిమితం చేయాలని, కొత్త క్యాంపుల ఏర్పాటును ఆపాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట గత నెల 28వ తేదీన విడుదల చేసిన బహిరంగ ప్రకటన బుధవారం వెలుగులోకి వచ్చింది. మార్చి 24వ తేదీన హైదరాబాద్‌లో ‘కేంద్ర ప్రభుత్వం- మావోయిస్టు పార్టీ బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించి శాంతిచర్చలు జరపాలి’ అన్న అంశంపై ‘శాంతిచర్చల కమిటీ’ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశాన్ని స్వాగతిస్తున్నామని అభయ్ పేర్కొన్నారు. శాంతి చర్చలకు తాము తొలి నుంచీ సిద్ధంగా ఉన్నామన్నారు. ‘గత ఏడాది జనవరిలో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు బీజేపీ ప్రభుత్వం, విప్లవోద్యమం ఉనికిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆపరేషన్ కగార్ పేరిట ప్రజలపై ప్రతీఘాతక యుద్ధాన్ని ప్రారంభించాయి. ప్రజలను మోసగించడానికి ఛత్తీ్‌సగడ్ హోంమంత్రి విజయ్‌శర్మ.. మావోయిస్టులతో చర్చలకు సిద్ధమని ప్రకటించారు. దీనిపై మా పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మీడియా ప్రతినిధి వికల్ప్ స్పందిస్తూ.. చర్చలకు తాము కూడా సిద్ధమని రెండుసార్లు తెలిపారు. కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. పైగా, గత 15 నెలలుగా కగార్ పేరిట ఆదివాసీలపై, ప్రజలపై యుద్ధం చేస్తున్నాయి’ అని అభయ్ వివరించారు. చత్తీ్‌సగడ్‌లో జరుపుతున్న నరమేధం కారణంగా.. ఇప్పటివరకూ మావోయిస్టు పార్టీకి చెందిన 400 మందికి పైగా వివిధ స్థాయిల నాయకులు, కార్యకర్తలు, సభ్యులు హత్యకు గురయ్యాయరని తెలిపారు. వీరిలో మూడొంతుల మంది ఆదివాసీలేనన్నారు. తమ పార్టీకి చెందిన వేలాదిమందిని అరెస్టు చేశాన్నారు.
పథకం ప్రకారమే నరమేధం
‘కార్డన్ అండ్ కిల్’ (చుట్టుముట్టడం, చంపివేయటం) అనే పద్ధతి ప్రకారం మారణహోమం జరుపుతున్నారని, పట్టుబడిన వారిని అత్యంత అమానుష పద్ధతుల్లో చిత్రహింసలు పెట్టి చంపుతున్నారని, మహిళా కామ్రేడ్స్‌పై సామూహిక అత్యాచారాలు జరిపి హత్య చేస్తున్నారని అభయ్ పేర్కొన్నారు. అందుకే ఈ యుద్ధాన్ని తాము నరమేధంగా చెబుతున్నామన్నారు. ఈ యుద్ధంలో భద్రతా బలగాలు పాల్గొంటున్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. వాస్తవానికి భారతసైన్యాన్ని మోహరించారని తెలిపారు. ఆ పోరాటాన్ని అణచివేసి.. భూమిని, ప్రకృతి వనరులను కార్పొరేట్ కంపెనీల అధిపతులకు కట్టబెట్టటం కోసం ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ జరుపుతున్నాయని పేర్కొన్నారు.
నియంతృత్వమే ‘హిందూరాష్ట్ర’ లక్ష్యం
సామ్రాజ్యవాదుల, దళారీ పెట్టుబడిదార్ల, భూస్వాముల దోపిడీని సుస్థిరం చేయటమే ‘హిందూరాష్ట్రం’ లక్ష్యమన్నారు. భూముల్ని, వనరుల్ని, ప్రభుత్వరంగ సంస్థల్ని కార్పొరేట్లకు అప్పగించటం, మతమైనారిటీలపై వివక్షను రాజ్యాంగబద్ధం చేయటం, సమాఖ్య వ్యవస్థను నిర్మూలించి నియంతృత్వ ప్రభుత్వాన్ని నెలకొల్పటం కోసమే ఆపరేషన్ కగార్ జరుపుతున్నారని అభయ్ ఆరోపించారు. శాంతిచర్చల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని శాంతిచర్చల కమిటీకి, ప్రజామేధావులకు, హక్కుల సంఘాలకు అభయ్ విజ్ఞప్తి చేశారు.
Updated Date - Apr 03 , 2025 | 05:21 AM