Share News

Sangareddy: దారుణం.. మద్యం మత్తులో భార్యపై దాడి.. చివరికి ఏమైందంటే..

ABN , Publish Date - Apr 14 , 2025 | 04:08 PM

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పెద్ద కంజర్లలో దారుణం చోటు చేసుకుంది. మత్తుకు బానిసైన ఓ వ్యక్తి తన భార్యపై దాడి చేశాడు. విచక్షణారహితంగా రోకలిబండతో కొట్టాడు.

Sangareddy: దారుణం.. మద్యం మత్తులో భార్యపై దాడి.. చివరికి ఏమైందంటే..
Sangareddy

సంగారెడ్డి: ఇటీవల కాలంలో భార్యాభర్తల బంధం నీటి బుడగల మారిపోయింది. వేదమంత్రాల నడుమ నిండునూరేళ్లు కలిసి ఉంటామని ప్రమాణం చేస్తూ ఆ వాగ్దానాన్నే మరచిపోతున్నారు. చిన్నచిన్న విషయాలకే గొడవ పడుతూ సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాలతో కొందరు, క్షణికావేశంలో మరికొందరూ, ఆస్తుల కోసం ఇంకొందరు భార్యభర్తల బంధాన్ని తృణప్రాయంగా తెంపుకుంటున్నారు. మరికొందరు అయితే విపరీత ధోరణితో ఏకంగా భాగస్వామినే కడతేరుస్తున్నారు.


తాజాగా అలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పెద్ద కంజర్లలో చోటు చేసుకుంది. మత్తుకు బానిసైన ఓ వ్యక్తి తన భార్యను హతమార్చాడు. రమేశ్(32) అనే వ్యక్తికి పెద్దకంజర్ల గ్రామానికి చెందిన ప్రమీల(25)తో రెండేళ్ల క్రితం వివాహం అయ్యింది. కొనాళ్లపాటు బాగానే సాగిన వారి సంసారంలో మెల్లిగా కలతలు మెుదలయ్యాయి. రమేశ్ మత్తుకు బానిసయ్యాడు. కూలినాలి చేసుకుంటూ వచ్చిన కాస్త డబ్బులతో మద్యం తాగుతూ జల్సా చేసేవాడు. కుటుంబ పోషణ కోసం డబ్బులు అడిగితే ప్రమీలను కొట్టేవాడు. మరికొన్నాళ్లకు ఆమెను అనుమానించడం మెుదలుపెట్టాడు. భర్త వేధింపులు భరించలేని సదరు మహిళ చివరికి పుట్టింటికి వెళ్లిపోయింది.


కొన్నాళ్లపాటు ఒంటరిగా జీవించిన రమేశ్‌కు మళ్లీ భార్య కావాలని అనిపించింది. దీంతో పెద్దకంజర్ల గ్రామానికి చేరుకున్నాడు. తనతోపాటు రావాలని భార్యను కోరాడు. అయితే అందుకు ప్రమీల నిరాకరించింది. ప్రతి రోజూ తాగుతూ హింసించే భర్తతో ఉండలేనని తేల్చి చెప్పింది. మాటమాట పెరిగి వివాదం చెలరేగింది. దీంతో ప్రమీల తల్లి కవిత సైతం రమేశ్‌ను దూషించింది. కోపంతో రగిలిపోయిన అతను పక్కనే ఉన్న రోకలిబండతో వారిపై దాడి చేశాడు. తొలుత భార్యపై దాడి చేయగా.. ఆమె తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అడ్డుకోబోయిన అత్తపైనా దాడి తెగబడ్డాడు రమేశ్. దీంతో కవితకూ తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి:

PM Narendra Modi: కంచ గచ్చిబౌలి భూములు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ..

PM Modi: వక్ఫ్ నిబంధనలను స్వార్థం కోసం కాంగ్రెస్ మార్చేసింది: మోదీ

భార్య‌పై భర్త ఘాతుకం.. స్కూడ్రైవర్‌తో అతి కిరాతకంగా..

Updated Date - Apr 14 , 2025 | 04:08 PM