TTD: గ్యారేజీలోనే పర్యాటక బస్సులు!
ABN, Publish Date - Jan 02 , 2025 | 03:21 AM
తెలంగాణ పర్యాటక సంస్థ అధికారుల నిర్వాకం కారణంగా రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన బస్సులు గ్యారేజీకే పరిమితమవుతున్నాయి. పర్యాటక సంస్థలకు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లను కేటాయించరాదన్న టీటీడీ బోర్డు నిర్ణయం.. తెలంగాణ పర్యాటక సంస్థకు శాపంగా మారింది.
‘శ్రీవారి ప్రత్యేక దర్శనం’ నిలిచిపోయాక ఒక్క నెలలోనే రూ.2కోట్లకుపైగా నష్టం
ఇతర ప్యాకేజీలపై పర్యాటక సంస్థ నిర్లక్ష్యం
హైదరాబాద్, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పర్యాటక సంస్థ అధికారుల నిర్వాకం కారణంగా రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన బస్సులు గ్యారేజీకే పరిమితమవుతున్నాయి. పర్యాటక సంస్థలకు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లను కేటాయించరాదన్న టీటీడీ బోర్డు నిర్ణయం.. తెలంగాణ పర్యాటక సంస్థకు శాపంగా మారింది. కొన్నేళ్లుగా హైదరాబాద్-తిరుమల ప్యాకేజీలకు మంచి ఆదరణ ఉండేది. శ్రీవారి ప్రత్యేక దర్శనం (రూ.300) టికెట్లతో కలిపి ప్యాకేజీ టూర్ ఉండడంతో తిరుమల వెళ్లే యాత్రికులు ఆసక్తి చూపేవారు. దీంతో పర్యాటక సంస్థ సైతం కోట్లాది రూపాయలు వెచ్చించి అధునాతన సౌకర్యాలతో కూడిన ఏసీ బస్సులను కొనుగోలు చేసింది. కానీ, అనూహ్యంగా నెల రోజుల క్రితం పర్యాటక సంస్థలకు టికెట్ల కేటాయింపును టీటీడీ రద్దు చేసింది. దీంతో తెలంగాణ పర్యాటక సంస్థ పరధిలోనూ తిరుమల దర్శనం ప్యాకేజీ అటకెక్కగా, ఒక్క నెలలోనే రూ.2కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.
అయితే, ప్రత్యామ్నాయ ప్యాకేజీలను తీసుకురావడంలో పర్యాటక సంస్థ అధికారులు విఫలమయ్యారన్న వాదన వినిపిస్తోంది. ఒక వైపు క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో టూర్లు వెళ్లడానికి, మరో వైపు అయ్యప్ప స్వాములు శబరిమలై వెళ్లి రావడానికి ప్రత్యేక బస్సుల కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. గత్యంతరం లేక ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. అలాంటి వారికి బస్సులు కేటాయించే అవకాశం ఉన్నా.. పర్యాటక సంస్థ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. సాగర్, శ్రీశైలం, షిర్డీ ప్యాకేజీలు తప్ప ఇతర ప్యాకేజీలపై పర్యాటక సంస్థ అధికారులు దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. యాదగిరిగుట్ట, వరంగల్, రామప్ప, కాళేశ్వరం, వేములవాడ, బాసర, కొండగట్టు, మైసూర్ తదితర ప్యాకేజీలపై ప్రచారం చేయకపోవడంతో పర్యాటకులు ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తుండగా.. రాష్ట్ర పర్యాటక సంస్థ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండడం విమర్శలకు దారి తీస్తోంది.
Updated Date - Jan 02 , 2025 | 03:21 AM