పైసలిస్తం.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టమంటున్నారు
ABN , Publish Date - Apr 15 , 2025 | 05:41 AM
దుబ్బాక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని చెప్పారు.

అవసరమైతే ఎమ్మెల్యేలను కొనమంటున్నారు
బిల్డర్లు, పారిశ్రామిక వేత్తలు ఖర్చు భరిస్తామంటున్నారు
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తొగుట, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): దుబ్బాక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని చెప్పారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఖర్చును తాము భరిస్తామంటున్నారని తెలిపారు. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారన్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని, ఆ పార్టీ తమ దరిదాపుల్లో కూడా లేదని అన్నారు.
రాష్ట్రంలో వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ప్రభాకర్ రెడ్డి ప్రసంగించారు. రాజకీయాల్లోకి వచ్చాక సిన్సియర్‌గా ఉంటే కుదరడం లేదని, దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పారు. ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు దుబ్బాక నుంచి భారీగా కార్యకర్తలను తరలిస్తామని తెలిపారు.