Share News

MNJ Cancer Hospital: ఎంఎన్‌జేలో ఒక్క పూటలోనే కీమోథెరపీ

ABN , Publish Date - Apr 16 , 2025 | 04:51 AM

ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రి, కీమోథెరపీ చికిత్సను ఒక్క పూటలోనే అందించే డే కేర్‌ విధానాన్ని ప్రారంభించింది. ఇప్పటి వరకు ఆస్పత్రిలో ఉన్న సమయంలో గడిచే ప్రక్రియను సులభతరం చేసి, దూర ప్రాంతాల నుంచి వచ్చే బాధితులకు మరింత సౌకర్యాన్ని కల్పించింది

MNJ Cancer Hospital: ఎంఎన్‌జేలో ఒక్క పూటలోనే కీమోథెరపీ

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి):క్యాన్సర్‌ బాధితులు కీమోథెరపీ కోసం రోజుల తరబడి ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం లేకుండా ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రి డే కేర్‌ విధానానికి శ్రీకారం చుట్టింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే క్యాన్సర్‌ బాధితులు, వారి బంధువులు ఒక్కపూటలో అన్నీ చక్కబెట్టుకుని ఇంటికి వెళ్లేలా ఏర్పాట్లు చేసింది. ఇంతకుముందు ఆస్పత్రిలో అడ్మిషన్‌ ఒకరోజు, వైద్య పరీక్షలకు మరోరోజు, ఆరోగ్యశ్రీ నుంచి అప్రూవల్‌కు ఇంకో రోజు సమయం పట్టేది. ఆ తర్వాతే కెమోథెరపీ జరిగేది. ఇప్పుడు అన్నీ ఒకే రోజులో పూర్తయ్యేలా, ఉదయం వస్తే సాయంత్రం తిరిగి వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేశామని ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసులు తెలిపారు. డే కేర్‌ విధానంలో రోజూ 50 నుంచి 60 మందికి కెమోథెరపీ చేస్తున్నామని చెప్పారు. మెరుగైన రేడియేషన్‌ థెరపీ కోసం నాలుగు అత్యాధునిక లీనియర్‌ యాక్సిలరేటర్‌ యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. శరీరంలోని అంతర్గత భాగాల్లో వచ్చే క్యాన్సర్లకు రేడియేషన్‌ చికిత్స చేసే బ్రాకీ థెరపీని కూడా ఆస్పత్రిలో అందుబాటులోకి తీసుకువచ్చినట్టు వెల్లడించారు.



For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 16 , 2025 | 04:51 AM